‘రా’కాసులు

ABN , First Publish Date - 2020-09-25T17:55:36+05:30 IST

వందకు మూడు రోజులకు రూ. 10 వడ్డీ! ప్రతి మూడు రోజులకు దాన్ని చెల్లించాలి..

‘రా’కాసులు

పాత నేరస్థులే వడ్డీ వ్యాపారులు

పేదల రక్తాన్ని పిండుతున్న వడ్డీ వ్యాపారులు

చీరాల ప్రాంతంలో వందల మందికి ఇదే ఉపాధి

అవసరాలే ఆసరాగా అప్పులు.. భారీగా వడ్డీలు 

బాకీ చెల్లించని వారిపై దౌర్జన్యాలు.. ఇళ్లకు తాళాలు 

వేధింపులు తట్టుకోలేక పలువురు ఆత్మహత్యల బాట

ఊరు విడిచివెళ్తున్న బాధితులు 

మరికొందరు ఇళ్లు అప్పగించి వలసలు


చీరాల(ప్రకాశం): చీరాల ప్రాంతంలో వడ్డీ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. లాక్‌డౌన్‌తో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కూలీలు, ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకొని జలగల్లా పీక్కుతింటున్నారు. వందల్లో వడ్డీలకు అప్పులు ఇచ్చి వేలాది రూపాయలు గుంజుతున్నారు. మూడు రోజులు, వారం, పది రోజులు, నెల ఇలా రకరకాలుగా వ్యాపారం చేస్తున్నారు.


వందకు రూ. 10 నుంచి రూ. 20 వరకూ వడ్డీ వసూలు చేస్తున్నారు. చీరాల మండల పరిధిలో పలు గ్రామాల ప్రజలు వీరి వలలో చిక్కి విలవిల్లాడుతున్నారు. ఉన్నదంతా పోగొట్టుకుని కొందరు ఊరు విడిచి వెళుతుంటే.. మరికొందరు ఉన్న ఇళ్లు, వాకిళ్లు అప్పు ఇచ్చిన వారికి తాకట్టు పెట్టి వలసపోతున్నారు. మరికొందరు అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా అప్పులు ఇచ్చి రక్తం పిండుతున్న వారిలో చీరాల ప్రాంతంతోపాటు గుంటూరు జిల్లా పరిధిలోని స్టూవర్టుపురం, వెదుళ్లపల్లికి చెందిన వారు కూడా ఉన్నారు. వీరిలో కొందరు మాజీ నేరస్థులు  కావడం గమనార్హం.


వందకు మూడు రోజులకు రూ. 10 వడ్డీ! ప్రతి మూడు రోజులకు దాన్ని చెల్లించాలి. లేకపోతే వడ్డీకి మళ్లీ వడ్డీ వేస్తారు! చెల్లించకపోతే ఇంటికి వచ్చి దాదాగిరీ చేస్తారు! ఇదేకాదు నెల, వారం, రోజువారీ వడ్డీ వ్యాపారం కూడా నడుస్తోంది. దానికి వందకు రూ. 10 నుంచి రూ. 20 వరకూ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.  ఇలా చీరాల ప్రాంతంలో వడ్డీ వ్యాపారులు పేదలను పిండేస్తున్నారు. వారి ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకొని భారీ మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తున్నారు. దీంతో అప్పులు తీసుకున్న వారు విలవిల్లాడుతున్నారు. 


200 మంది వరకూ వడ్డీ వ్యాపారులు 

చీరాల పట్టణం, రూరల్‌లో దళితులు, బలహీనవర్గాలు వారు అధికం. అత్యధికులు చేతివృత్తులు, రోజువారీ కూలి పనులు చేసుకుంటుంటారు. లాక్‌డౌన్‌ కారణంగా వీరికి ఉపాధి కరువైంది. చేనేతలకు పనులు లేవు. చిరు వ్యాపారులు పరిస్థితి దయనీయంగా ఉంది. పూటగడవటం కష్టంగా మారింది. దీంతో పేదలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అవకాశంగా వారు ఇష్టారాజ్యంగా వడ్డీలు వసూలు చేస్తున్నారు. చీరాల ప్రాంతంలో సుమారు 100 నుంచి 200 మంది వరకు వడ్డీ వ్యాపారులు ఉన్నారు. 


వడ్డీల వసూలు ఇలా.. 

రోజువారీ వడ్డీ కింద ఒక వ్యక్తి రూ.5 వేలు అప్పుగా తీసుకుంటే నిత్యం సాయంత్రానికి వడ్డీ రూ.50 చెల్లించాలి. ఒక వేళ పది నాగాలు ఉంటే రూ.100 తిరిగి అసలులో కలుస్తుంది. అప్పుడు బాకీదారుడు రోజు ఇక రూ.60 చెల్లించాలి. వారం వడ్డీ విషయానికి వస్తే ఒక వ్యక్తి రూ. 10 వేలు అప్పుగా తీసుకుంటే ప్రతి సోమవారం వెయ్యి  చెల్లించాల్సి ఉంటుంది. మూడు నాగాలు ఉంటే ఒక వెయ్యి అసలులో కలుస్తుంది. అప్పుడు బాకీదారుడు వారానికి రూ. 1100 చెల్లించాల్సి ఉంటుంది. నెల వడ్డీ కింద ఒక వ్యక్తి రూ. 10వేలు అప్పుగా తీసుకుంటే నెలకు వెయ్యి రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా అప్పు తీసుకోవాలంటే సిఫార్సు అవసరం. అందుకోసం రూ. 2వేలు కమీషన్‌ ఇవ్వాలి.


మూడు రోజుల వడ్డీ 

మూడురోజుల వడ్డీ విధానం కొత్తగా పెట్టారు. ఇది చాలా ప్రమాదకరం అని తెలిసినా అత్యవసర సమయాల్లో తీసుకుంటున్నారు. రూ.5వేలు అప్పు తీసుకుంటే మూడు రోజులకు రూ.500 వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ నాల్గో రోజు వచ్చిందంటే వడ్డీ వ్యాపారి ఇంటి ముందు కూర్చుంటాడు.


బాకీలు చెల్లించకపోతే వేధింపులు

బాకీలు చెల్లించని వారిని వడ్డీ వ్యాపారులు రకరకాలు వేధిస్తున్నారు.  ఇంటికి వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇళ్లలో ఉన్న వారిని బయటకు లాగి వారిపై దాడికి దిగుతున్నారు. కొందరిని బయటకు గెంటి తాళాలు కూడా వేస్తున్నారు. వడ్డీ వ్యాపారుల్లో పాత నేరస్థులు, పలుకుబడి ఉన్న వారు ఉండటంతో బయటకు చెప్పుకోలేకపోతున్నారు. 


ఊరు విడిచి వెళ్తున్న కొందరు బాధితులు

అప్పులు పెనుభారమై పచ్చని కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి.  మరికొందరు ఊరు విడిచి వలసలు పోతున్నారు. వేధింపులు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యాయత్నం, మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. చీరాల ప్రాంతంలో నెలకు సుమారు 15 మంది వరకూ ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. పోలీసులకు చేసే ఫిర్యాదులో అప్పుల బాధ, కుటుంబ కలహాలతో అని పేర్కొంటున్నారు. కానీ వీరిలో ఎక్కువ మంది వడ్డీ వ్యాపారుల వేధింపులను తట్టుకోలేక ఈ చర్యకు ఒడిగడుతున్నట్లు సమాచారం. మరికొందరు బాకీ కింద నివాసాలను వడ్డీ వ్యాపారులకు అప్పగిస్తున్నారు. వాడరేవు, తోటవారిపాలెం, గవినివారిపాలెం, కావూరివారిపాలెం, విజయనగర్‌ కాలనీల్లోని పలువురు ఇప్పటికే తమ నివాసాలను వడ్డీ వ్యాపారులకు స్వాధీనం చేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 


జిల్లాకు మారుమూల గ్రామం కావూరివారిపాలెం. ఇక్కడ నివసిం చే వారంతా దాదాపుగా రోజు కూ లీలే.  ఈగ్రామానికి కూతవేటు దూ రంలో గుంటూరు జిల్లా స్టూవ ర్టుపు రం, వెదుళ్లపల్లి గ్రామాలున్నాయి. అక్కడి వారు కొందరు కావూరిపా లెం వాసులకు వడ్డీలకు డబ్బులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కావూరివారిపాలెం పంచాయతీ ఆంధ్రకేసరినగర్‌కు చెందిన మూకిరి నయోమి భర్తకు రెండునెలల క్రితం అనారోగ్య సమస్య వచ్చింది. చికిత్సకు డబ్బు లేకపోవడంతో గుంటూరు జిల్లా స్టువర్టుపురానికి చెందిన వ్యాపారి వద్ద మూడు రోజుల వడ్డీ కింద రూ. 70వేలు అప్పు తీసుకుంది. ఇప్పటికే రూ. 80వేలు చెల్లించింది. ఇంకా రూ. లక్ష చెల్లించాలంటూ సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో సురేష్‌ ఆంధ్రకేసరినగర్‌లోని నయోమి ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేశాడు. ఆమె కుటుంబ సభ్యులకు బయటకు గెంటివేసి ఇంటికి తాళం వేశాడు. వడ్డీ వ్యాపారుల బరితెగింపునకు ఈ సంఘటన ప్రత్యక్ష నిదర్శనం. 


చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు: రోశయ్య, సీఐ, చీరాల రూరల్‌

వడ్డీ వ్యాపారులు వేధిస్తున్నట్లు ఫిర్యాదులు ఏవీ మాదృష్టికి రాలేదు. అటువంటి వేధింపులకు గురౌతున్నట్లు ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకుంటాం. కావూరివారిపాలెం ఘటనపై విచారణ జరుపుతున్నాం. గ్రామీణ ప్రాంతాలలో వీటిపై అవగాహన కూడా కల్పిస్తున్నాం.




Updated Date - 2020-09-25T17:55:36+05:30 IST