అధికారులూ కనిపించడం లేదా..?

ABN , First Publish Date - 2022-09-29T05:24:55+05:30 IST

‘పుంగనూరు పట్టణ శివారులోని మేలుపట్ల చెరువులో రాత్రింబవళ్లు మట్టి, ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. యంత్రాల సాయంతో లోడేసి.. చెరువు రూపురేఖలు మార్చేస్తున్నారు. కళ్లెదుటే ఇంత జరుగుతున్నా అధికారులకు కనిపించడం లేదా’ అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

అధికారులూ కనిపించడం లేదా..?
వాహనాలు వెళ్లకుండా చెరువులో షామియానా వేసుకుని బైఠాయించిన రైతులు

ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్లను అడ్డగించిన రైతుల ఆగ్రహం 


పుంగనూరు సమీప చెరువులో 6 గంటలపాటు నిరసన


పుంగనూరు, సెప్టెంబరు 28: ‘పుంగనూరు పట్టణ శివారులోని మేలుపట్ల చెరువులో రాత్రింబవళ్లు మట్టి, ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. యంత్రాల సాయంతో లోడేసి.. చెరువు రూపురేఖలు మార్చేస్తున్నారు. కళ్లెదుటే ఇంత జరుగుతున్నా అధికారులకు కనిపించడం లేదా’ అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. చెరువు వద్ద బుధవారం రైతులు, మహిళలు నిరసనకు దిగారు. ఉదయం 11.45 గంటలకు దాదాపు 100 మంది రైతులు, మహిళలు, యువకులు మేలుపట్ల చెరువును కాపాడలంటూ ఆందోళన చేపట్టారు. చెరువులో 6 ఎక్స్‌కవేటర్ల, 12 ట్రాక్టర్లతో ఇసుక, మట్టి తరలిస్తుండగా అడ్డుకున్నారు. చెరువును నాశనం చేయొద్దంటూ షామియానా వేసుకుని 6 గంటల పాటు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చెరువులో మట్టి, ఇసుక తరలించకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ వెంకట్రాయులుకు ఫోన్‌ చేయగా.. తాను సెలవులో ఉన్నానని చెప్పారు. మీ కిందిస్థాయి అధికారులను పంపాలని కోరినా అందరూ చిత్తూరుకు వెళ్లారని చెప్పి తహసీల్దారు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశారని రైతులు ఆరోపించారు. ఎంపీడీవో, పలమనేరు ఆర్డీవో, కలెక్టర్‌, పోలీసులకు ఫోన్లు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మేలుపట్ల చెరువు నుంచి కొంతమంది రియల్‌ ఎస్టేట్‌.. ఇసుక వ్యాపారులు కలిసి మట్టి, ఇసుక తవ్వేస్తున్నారన్నారు. ట్రాక్టర్‌ లోడు మట్టిని రూ.4800, ఇసుకను రూ.5వేలు చొప్పున విక్రయిస్తూ వాళ్లు లాభాల బాటలో ఉన్నారన్నారు. ఇలా చేయడం వల్ల చెరువులో నీళ్లు నెల రోజులు కూడా నిల్వ లేకుండా ఇంకిపోయి, సాగునీటి వసతిలేక రైతులం నష్టపోతున్నామన్నారు. సామాన్యులకు మట్టి, ఇసుక అవసరమైతే రెవన్యూ అధికారుల అనుమతి తీసుకవాఆల్సి వస్తోందన్నారు. లేదంటే చర్యలు తీసుకుంటున్నారన్నారు. కానీ, వ్యాపారులు ఇలా ఇష్టారాజ్యంగా తరలిస్తుంటే మాత్రం చూసీచూడనట్లు ఉంటున్నారన్నారు. ఇటీవల చెరువులోని గోతుల్లో పడి రెండు ఆవులు చనిపోయాయని గుర్తుచేశారు. మరోవైపు చెరువును చదును చేసి ప్లాట్లు వేసి అమ్ముస్తున్నారని ఆరోపించారు. చెరువులోనుంచి వాహనాలు వెళ్లకుండా ఉదయం నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు వీరు నిరసన చేశారు. సాయంత్రంగా ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ ఆందోళనకారుల వద్దకెళ్లి  రైతులు కోరినట్లు ఇసుక, మట్టి తరలించకుండా చర్యలు చేపట్టడానికి తహసీల్దార్‌, మున్సిపల్‌ కమిషనర్‌కు సిఫార్సు చేస్తానని హామీ ఇచ్చారు. ఇసుక, మట్టి తరలింపునకు అనుమతులు ఉన్నాయని అడ్డుకుంటే  కేసులు పెట్టాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించడంతో, ఇకనైనా చెరువును కాపాడండంటూ రైతులు ఆందోళన విరమించారు. దీనిపై గురువారం ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం జరగనుంది. ఈ ఆందోళనలో రైతులు దొరబాబు, మంజునాధ్‌, లోకేశ్‌, సతీశ్‌, శంకర్‌రెడ్డి, గణేశ్‌, సుభా్‌షరెడ్డి, గంగాధర్‌రెడ్డి, పాపులమ్మ, శోభ, జ్యోతి, శ్యామలమ్మ, మొబీనా, ముభాజాన్‌, గులాబీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-29T05:24:55+05:30 IST