ఆఫీసు 6 నెలలకు చాలు!

ABN , First Publish Date - 2020-07-14T07:43:09+05:30 IST

రాజధాని తరలింపుపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ తాజాగా జారీ చేసిన జీవో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది.

ఆఫీసు 6 నెలలకు చాలు!

  • రెండేళ్ల అద్దె ఒప్పందాన్ని కుదించండి
  • ఫుడ్‌ కమిషన్‌ కార్యాలయంపై జీవో
  • ‘తరలింపు’పై ఉద్యోగుల్లో చర్చలు
  • అద్దెలు తగ్గుతాయనే ఇలా: అధికార వర్గాలు


అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): రాజధాని తరలింపుపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ తాజాగా జారీ చేసిన జీవో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. ఇప్పటికే రెండేళ్ల కాలానికి చేసుకున్న ఆఫీసు అద్దె ఒప్పందాన్ని అకస్మాత్తుగా ఆరు నెలల కాలానికి కుదించాలని జీవోలో పేర్కొంది. దీంతో ఇదంతా ‘తరలింపు’లో భాగమేనని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. పౌరసరఫరాల శాఖకు చెందిన అన్ని కార్యాలయాలు విజయవాడ బందరు రోడ్డులోని సాయి టవర్స్‌లో ఉన్నాయి. ఆ శాఖలో భాగమైన ఆహార(ఫుడ్‌) కమిషన్‌ కూడా ఇక్కడే ఓ అంతస్తులో ఉంది. ఆ ఆఫీసుకు సంబంధించి ఇప్పటికే రెండేళ్ల కాలానికి అద్దె ఒప్పందం చేసుకున్నారు. అయితే, ఈ అద్దె ఒప్పందాన్ని సవరించాలని పేర్కొంటూ సోమవారం పౌరసరఫరాల శాఖ జీవో ఇచ్చింది. ఇప్పటి వరకు చదరపు అడుగుకు రూ.30 చొప్పున అద్దె చెల్లిస్తున్నారు.


అదనంగా పన్నులు ఉంటాయి. ఇప్పుడు దీనిని సవరించి అన్ని పన్నులతో కలిపి చదరపు అడుగు రూ.30 చొప్పున ఒప్పందం చేసుకోవాలని, ఆరు నెలలకే పరిమితం కావాలని తాజా జీవోలో పేర్కొన్నారు. అంతేకాదు, రెండు నెలల ముందస్తు నోటీసుతో ఆఫీసు ఖాళీ చేసేలా నిబంధన పెట్టాలని సూచించారు. దీంతో ఆఫీసును విశాఖపట్నం తరలిస్తారేమోనని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒప్పంద కాలాన్ని కుదించారని భావిస్తున్నారు. అయితే, అధికార వర్గాల్లో మాత్రం మరో వాదన వినిపిస్తోంది. రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం వల్ల విజయవాడలో అద్దెలు బాగా తగ్గిపోయాయని, భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉన్నందున ఒకేసారి ఒప్పందం చేసుకోవద్దనేది ప్రభుత్వ ఉద్దేశంగా ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి.  

Updated Date - 2020-07-14T07:43:09+05:30 IST