తిరుపతి: అంతరిక్షం, మహాసముద్రాలను సైతం ప్రయివేటీకరణ చేసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ధ్వజమెత్తారు. ఈ రోజు ఆయన తిరుపతిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలల్లో బీజేపీని వ్యతిరేకిస్తున్న వారంతా వామపక్షాలకు మద్దతుగా ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. టీటీడీ నుంచి 120 కోట్ల రూపాయలను జీఎస్టీ రూపంలో అన్యాయంగా కేంద్రం వసూలు చేస్తుందని ఆయన ఆరోపించారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆయన విమర్శించారు. వైసీపీ, టీడీపీ, జనసేన ఈ విషయాన్ని గుర్తించటం లేదని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడంలోవైసీపీ, టీడీపీ, జనసేన విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకే వామపక్షాలు పోటీ చేస్తున్నాయని ఆయన తెలిపారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తన అఫిడవిట్‌లో తప్పు వివరాలు ఇచ్చారని, ఆమె మీద చాలా కేసులున్నాయని మధు పేర్కొన్నారు. ఫిక్స్‌డ్ విద్యుత్ టారీఫ్ ద్వారా ప్రజలపై 6300 కోట్ల భారం పడనుందని సీపీఎం మధు తెలిపారు.