అమ్మో.. మలేరియా

ABN , First Publish Date - 2022-08-04T05:15:11+05:30 IST

జిల్లాలో మలేరియా విజృంభిస్తోంది. గ్రామాల్లో ఇంటికి ఒకరిద్దరు చొప్పున మంచం పట్టారు. రోజురోజుకూ వ్యాధిగ్రస్థులు పెరుగుతున్నారు.

అమ్మో.. మలేరియా

 రోజురోజుకూ పెరుగుతున్న వ్యాధిగ్రస్థులు

  కిటకిటలాడుతున్న ఆసుపత్రులు

  భయపెడుతున్న డెంగ్యూ

  వణికిపోతున్న జిల్లావాసులు 

 (పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)

జిల్లాలో మలేరియా విజృంభిస్తోంది. గ్రామాల్లో ఇంటికి ఒకరిద్దరు చొప్పున మంచం పట్టారు.  రోజురోజుకూ వ్యాధిగ్రస్థులు పెరుగుతున్నారు. ఆసుపత్రులన్నీ జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. కేసులు పెరుగుతున్నా.. అధికారుల మాట మరోలా ఉంది. ఏటా మలేరియా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వారు చెబుతుండడం గమనార్హం. క్షేత్రస్థాయిలో పరిస్థితికి.. అధికారులు చెబుతున్న లెక్కలకు పొంతన కుదరడం లేదు. 

ఇదీ పరిస్థితి.. 

ఏటా ఈ సీజన్‌లో వ్యాధులు ప్రబలడం సహజం. అయితే మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌, వైరల్‌ జ్వరాలు ప్రబలే ప్రాంతాలను ముందుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఆ దిశగా క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు తీసుకోలేదు. ముందస్తుగా అప్రమత్తం కాలేదు. ఫలితంగా జిల్లావాసులు మలేరియాతో మంచం పడుతున్నారు. రోజులు గడుస్తున్నా చాలామందికి జ్వరాలు అదుపులోకి రావడం లేదు. దీంతో ఆసుపత్రుల్లో ఇన్‌ పేషెంట్లుగా చేరుతున్నారు.  జిల్లా ఆవిర్భావం వరకు మలేరియా కేసుల లెక్కల్లో ఉన్న డొల్లతనాన్ని ఉన్నతాధికారులు కూడా కనిపెట్టలేని పరిస్థితి. తాజాగా పెరుగుతున్న కేసులతో  వ్యాధి తీవ్రతను గుర్తించాల్సి ఉంది.  పార్వతీపురం ఏజెన్సీతో పాటు,   సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజన గ్రామాలపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. 

 గ్రామాల్లో ఇలా.. 

ప్రస్తుతం జిల్లాలో అనేక పంచాయతీలకు నిధుల సమస్య వెంటాడుతోంది. దీంతో గ్రామాల్లో పారిశుధ్య లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు వర్షాలు కూడా కురస్తుండడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి.  దోమ తెరల వినియోగం కూడా గ్రామాల్లో, పట్టణాల్లో అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.  మరోవైపు స్ర్పేయింగ్‌, ఫాగింగ్‌ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ దోమల బెడద తగ్గడం లేదు.  మొత్తంగా పల్లెవాసులు మలేరియా, వైరల్‌ జ్వరాలతో వణుకుతున్నారు. మలేరియా, డెంగ్యూ వ్యాధుల నివారణ కేవలం మలేరియా శాఖ వల్లే కాదన్నది శత శాతం నిజం. ఎందుకంటే దోమల నివారణ బాధ్యత స్థానిక అధికార యంత్రాం గంపై ఉంది. కానీ జిల్లాలోని అనేక గ్రామాల్లో స్థానిక అధికార యంత్రాంగం చేపట్టే చర్యలు పెద్దగా కనిపించడం లేదు. ఇటీవల కాలంలో డెంగ్యూ కూడా జిల్లావాసులను కలవరపెడుతోంది.  జ్వరం తగ్గినప్పటికీ చాలామందిలో ప్లేట్‌లెట్స్‌ పడిపోతున్నాయి.  ప్లేట్‌లెట్స్‌ ఎక్కించే సదుపాయం జిల్లాలోని ఏ ప్రాంతంలో కూడా లేదు. దీంతో బాధితులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విశాఖకు తరలివెళ్లి చికిత్స పొందుతున్నారు. ఇందుకోసం వేలాది రుపాయలు వెచ్చిస్తున్నారు.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. 

కేసుల నమోదు ఇలా.. 

ఉమ్మడి జిల్లాలో 2018లో మలేరియా కేసులు 422 ఉండగా, 2019లో 150గా నమోదు చేశారు. 2020లో 153, 2021లో 109గా కేసులు నమోదు చేసుకుని మలేరియా తగ్గుముఖం పట్టిందని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి నేటివరకు మన్యం జిల్లాలో 260 కేసులు నమోదయ్యాయి. ఇంకా వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. డెంగ్యూకు సంబంధించి 2018లో 17, 2019లో 58, 2020లో రెండు, 2021లో 64, 2022 జూలై 27వ తేదీ వరకు 63 కేసులు నమోదయ్యాయి. 

 కేసులు పెరుగుతున్న మాట వాస్తవమే.. 

గతంలో పోల్చుకుంటే ఇప్పుడు జిల్లాలో మలేరియా కేసులు పెరుగుతున్నాయి. అయితే   రోగులకు మలేరియా పాజిటివ్‌ అని తేలగానే మెరుగైన  వైద్య సేవలు అందిస్తున్నాం. దోమల నివారణకు స్ర్పేయింగ్‌ కార్యక్రమాన్ని శత శాతం చేపడుతున్నాం.

 డాక్టర్‌ పైడిరాజు, జిల్లా మలేరియాశాఖ అఽధికారి


Updated Date - 2022-08-04T05:15:11+05:30 IST