యాదాద్రిలో భక్తుల సందడి

ABN , First Publish Date - 2020-08-03T11:02:43+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి ఏర్పడింది. వారంతపు సెలవుదినం కావడంతో పలు ప్రాంతాల నుంచి

యాదాద్రిలో భక్తుల సందడి

యాదాద్రి టౌన్‌, ఆగస్టు 2: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి ఏర్పడింది. వారంతపు సెలవుదినం కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆర్జీత సేవలు ఆన్‌లైన్‌కే పరిమితమైనా, పవిత్ర శావణమాసంలో ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు భక్తులు క్యూకట్టారు. స్వామికి నిత్యారాధనలు ఆగమ శాస్త్రరీతిలో కొనసాగాయి. ప్రధానాలయంలోని స్వయంభువులను ఆరాధించిన అర్చకులు బాలాలయ కవచమూర్తులకు హారతి నివేదించారు. మండపంలో ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసిదళాలతో అర్చించారు.


కల్యాణమండపంలో సుదర్శన హోమం, నిత్యతిరుకల్యాణోత్సవ వేడుకలు సంప్రదాయ రీతిలో కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార వెండి జోడు సేవలు, సహస్రనామార్చన పర్వాలు కొనసాగాయి. కొండపైన రామలింగేశ్వరుడిని ఆరాధించిన అర్చకులు ఉపాలయంలో చరమూర్తులకు నిత్య పూజలు నిర్వహించారు. అదేవిధంగా అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ నిత్యవిధి కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామికి ఆదివారం భక్తుల నుంచి 2లక్షల 92వేల 845 రూపాయల ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు పేర్కొన్నారు.


అధునాతన శానిటైజేషన్‌ యంత్రాలు ఏర్పాటు 

యాదాద్రి క్షేత్రంలో అధునాతన శానిటైజేషన్‌ యంత్రాల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఇప్పటికే క్షేత్ర సందర్శనకు వస్తున్న భక్తులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌, శానిటైజేషన్‌ చేస్తున్నారు. యాదాద్రి క్షేత్రానికి ఆదివారం అధునాతన, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన శానిటైజేషన్‌ యంత్రాలను తీసుకువచ్చారు. వీటిని దర్శన క్యూలైన్లు, బాలాలయంలో ఏర్పాటుచేయనున్నారు. భక్తులు దర్శన క్యూలైన్లకు చేరుకోగానే థర్మల్‌ స్ర్కీనింగ్‌తో పాటు శానిటైజేషన్‌ను ఈ అధునాతన యంత్రాలే నిర్వహిస్తాయి.

Updated Date - 2020-08-03T11:02:43+05:30 IST