Advertisement
Advertisement
Abn logo
Advertisement

వచ్చేది టీడీపీ ప్రభుత్వమే

  1. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు
  2. వైసీపీ ప్రజల విశ్వాసం కోల్పోయింది
  3. పోలీసుల వేధింపులపై ప్రజలు తిరగబడతారు
  4. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
  5. బేతంచెర్ల మున్సిపల్‌ ఎన్నికలపై సమీక్ష
  6. ఆరు వార్డుల్లో విజయంపై అభినందనలు 


డోన్‌, డిసెంబరు 4: ‘వైసీపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. బేతంచెర్ల మున్సిపల్‌ ఎన్నికల్లో ఆరు వార్డుల్లో విజయం సాధించడంపై ఆయన అభినందించారు. ఇలానే కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. శనివారం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో డోన్‌ నియోజకవర్గ టీడీపీ నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎదురొడ్డి గెలిచిన కౌన్సిలర్లకు చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. 20 వార్డుల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో ఆయన మాట్లాడారు. దొంగ ఓట్లతో వైసీపీ నాయకులు మిగిలిన వార్డుల్లో గెలిచారని, లేకుంటే టీడీపీదే విజయమని వారు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్‌ ఎన్నికల్లో నైతిక విజయం మనదేనని, ఇక ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని చంద్రబాబు భరోసా ఇచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డిన డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డిని ప్రత్యేకంగా చంద్రబాబు అభినందించారు. వైసీపీది మునిగిపోయే నావ అని, టీడీపీ ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. పోలీసుల వేధింపులపై ప్రజలే తిరగబడే రోజులు వస్తాయన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఏ సమస్యలున్నా నియోజకవర్గ ఇన్‌చార్జి ముందుండి పోరాడాలని సూచించారు. డోన్‌ నియోజకవర్గంలో టీడీపీ అనూహ్యంగా పుంజుకుందని, ఇలానే అందరినీ కలుపుకుని పని చేయాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకు వచ్చిందని, అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. నాయకులకు, కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. డోన్‌ టీడీపీ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షలో కర్నూలు లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల లోక్‌సభ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, జిల్లా పార్టీ పరిశీలకుడు ప్రభాకర్‌ చౌదరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామక్రిష్ణ, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మురళీకృష్ణగౌడు, నంద్యాల లోక్‌సభ అధికార ప్రతినిధి విజయభట్టు, ఉపాధ్యక్షుడు పోలూరు వెంకటేశ్వరరెడ్డి, మాజీ జడ్పీటీసీ బుగ్గన ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement