టోలో న్యూస్ రిపోర్టర్ మరణ వార్త నిజం కాదు

ABN , First Publish Date - 2021-08-27T00:50:25+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లోని టోలో న్యూస్ రిపోర్టర్ జియార్ ఖాన్ యాద్

టోలో న్యూస్ రిపోర్టర్ మరణ వార్త నిజం కాదు

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌లోని టోలో న్యూస్ రిపోర్టర్ జియార్ ఖాన్ యాద్ తాలిబన్ల దాడిలో మరణించినట్లు వచ్చిన వార్త నిజం కాదు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే గురువారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. తాలిబన్లు తనపై దాడి చేసిన మాట వాస్తవమేనని, అయితే తాను ఈ దాడిలో మరణించినట్లు సామాజిక మాధ్యమాలు, కొన్ని వార్తా మాధ్యమాల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. 


కాబూల్‌లోని ఓ కూడలి వద్ద ఓ వార్తను కవర్ చేస్తుండగా, తనపై తాలిబన్లు దాడి చేశారని జియార్ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో తెలిపారు. వారు తనపై అకస్మాత్తుగా దాడి చేశారని, వారు అలా ఎందుకు చేశారో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని తాలిబన్ నేతలకు తెలిపానని, అయితే తనపై దాడి చేసినవారిని ఇప్పటికీ అరెస్టు చేయలేదని తెలిపారు. ఇది వాక్ స్వాతంత్ర్యానికి తీవ్ర విఘాతమని పేర్కొన్నారు. 


ఆఫ్ఘన్ టెలివిజన్ చానల్ టోలో న్యూస్ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం, ఆ సంస్థలో పని చేస్తున్న రిపోర్టర్ జియార్ యాద్ ఓ కెమెరామేన్‌తో కలిసి ఓ వార్త కోసం పని చేస్తుండగా, వారిపై తాలిబన్లు దాడి చేసి, కొట్టారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపిస్తామని తాలిబన్ కల్చరల్ కమిషన్ డిప్యూటీ చీఫ్ అహ్మదుల్లా వసీక్ హామీ ఇచ్చారు. 


ఆఫ్ఘనిస్థాన్‌లోని పర్వాన్ ప్రావిన్స్ జర్నలిస్టుల సంఘం నేత పర్విజ్ అమీన్‌జాదా మాట్లాడుతూ, కాబూల్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి పాత్రికేయులపై దాడులు జరుగుతున్నాయనిచెప్పారు. ఈ పరిణామాలు జర్నలిస్టులకు ఆందోళనకరంగా మారాయని తెలిపారు. పాత్రికేయులకు, మీడియాకు స్వేచ్ఛ ఉంటుందని, తమ ప్రత్యర్థులను క్షమిస్తామని తాలిబన్లు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు. 


Updated Date - 2021-08-27T00:50:25+05:30 IST