సరికొత్త ఆర్థిక కూటమి!

ABN , First Publish Date - 2022-05-24T08:34:43+05:30 IST

ప్రపంచ యవనికపై మరో కొత్త ఆర్థిక కూటమి ఆవిర్భవించింది.

సరికొత్త ఆర్థిక కూటమి!

అమెరికా చొరవతో ఐపీఈఎ్‌ఫ

భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా సహా 12 దేశాల చేరిక

ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇండో-పసిఫిక్‌ ఇంజన్‌ కావాలి

పరస్పర విశ్వాసం, పారదర్శకత పునాదులవ్వాలి

ప్రధాని మోదీ ఆకాంక్ష.. నేడు టోక్యోలో ‘క్వాడ్‌’ భేటీ


టోక్యో, మే 23: ప్రపంచ యవనికపై మరో కొత్త ఆర్థిక కూటమి ఆవిర్భవించింది. ఆర్థిక, వాణిజ్య రంగాల్లో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునే దిశగా అమెరికా చొరవతో ఏర్పాటైన ‘ఇండో-పసిఫిక్‌ ఎకనమిక్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఐపీఈఎఫ్‌)’ ఒప్పందంలో భారత్‌, జపాన్‌ సహా 12 దేశాలు చేరాయి. ఈ దేశాలకు ప్రపంచ స్థూల ఉత్పత్తి(జీడీపీ)లో 40 శాతం వాటా ఉండడం గమనార్హం. సోమవారం టోక్యోలో జరిగిన కీలక సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, భారత్‌, జపాన్‌ ప్రధానులు నరేంద్ర మోదీ, ఫుమియో కిషిదా తదితర దేశాధినేతల సారథ్యంలో కొత్త ఒప్పందం అమల్లోకి వచ్చింది.


సంతకాలు చేసిన ఇతర దేశాల్లో ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, ఇండోనేసియా, మలేసియా, న్యూజిలాండ్‌, ఫిలిప్పైన్స్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, వియత్నాం, బ్రూనే ఉన్నాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంత సానుకూల అభివృద్ధికి అమెరికా కట్టుబడి ఉందని బైడెన్‌ అన్నారు. ఎగుమతి-దిగుమతులు, పర్యావరణహిత ఇంధన రంగాలు, అవినీతి నిరోధక చర్యలకు సంబంధించి ఆసియా ఎకానమీలతో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఐపీఈఎఫ్‌ సహకరిస్తుందన్న విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇండో-పసిఫిక్‌ ఇంజన్‌గా మారాలని.. ఐపీఈఎఫ్‌ ఒప్పందానికి పరస్పర విశ్వాసం, పారదర్శకత పునాదులు కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీశాయని.. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ కోసం మన ఆర్థిక వ్యవస్థలను సమష్టిగా సిద్ధం చేయడానికి ఐపీఈఎఫ్‌ ఉపకరిస్తుందని సభ్య దేశాలు ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. అయితే ఈ ఒప్పందంలో పలు లోపాలు ఉన్నాయని విమర్శకులు అంటున్నారు. సభ్య దేశాలకు టారి్‌ఫల తగ్గింపు వంటి రాయితీలు, అమెరికా మార్కెట్లలో ప్రవేశానికి అధిక అవకాశాలు ఇందులో లేకపోవడం ప్రధాన కొరతగా చెబుతున్నారు.


గతంలో అమెరికా ఆధ్వర్యంలో విజయవంతంగా నడచిన ట్రాన్స్‌-పసిఫిక్‌ భాగస్వామ్యం (టీపీపీ) మాదిరిగా తాజా ఒప్పందం ఆకర్షణీయంగా లేదని స్పష్టం చేస్తున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో టీపీపీ నుంచి అమెరికా బయటకు వచ్చేసింది. దాని స్థానంలో ఐపీఈఎ్‌ఫను తీసుకొచ్చి.. చైనా ఆర్థిక ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని బైడెన్‌ యంత్రాంగం కొత్త ఒప్పందానికి చొరవ తీసుకుంది. మరోవైపు.. అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన ‘క్వాడ్‌’ సమావేశం మంగళవారం జరగనుంది. బైడెన్‌, మోదీ, కిషిదాతో పాటు ఆస్ట్రేలియా కొత్త ప్రధాని ఆంథోనీ ఆల్బెనీస్‌ కూడా హాజరవుతారు. తైవాన్‌పై దాడికి చైనా సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

Updated Date - 2022-05-24T08:34:43+05:30 IST