Shocking : సరికొత్త సైబర్‌ వల..

ABN , First Publish Date - 2022-01-09T05:26:57+05:30 IST

సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు పంథా మార్చారు. దుకాణాల యజమానుల పేర్లు, ఫోననెంబర్‌, ఎందులో ఏవేవి విక్రయిస్తుంటారు తెలుసుకుని.. ఫోన చేసి మెటీరి యల్‌ పంపాలంటున్నారు. మీ మెటీరియల్‌ ముట్టింది. మీకు ఫోనపేలో డబ్బులు పంపిస్తామంటూ దోచేస్తు న్నారు.

Shocking : సరికొత్త సైబర్‌ వల..

  • ఇనుము.. ప్లైవుడ్‌ కావాలంటూ షాపులకు ఎర 
  • ఒక్క రూపాయి ఫోన పే చేస్తే డబ్బు పంపిస్తామని బురిడీ 
  • మాటల్లో పెట్టి అకౌంట్లు ఖాళీ 
  • కడపలో రూ.3.53 లక్షలు దోచుకున్న వైనం 


కడప, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు పంథా మార్చారు. దుకాణాల యజమానుల పేర్లు, ఫోననెంబర్‌, ఎందులో ఏవేవి విక్రయిస్తుంటారు తెలుసుకుని.. ఫోన చేసి మెటీరి యల్‌ పంపాలంటున్నారు. మీ మెటీరియల్‌ ముట్టింది. మీకు ఫోనపేలో డబ్బులు పంపిస్తామంటూ దోచేస్తు న్నారు. ఈ నెల 2న మరియాపురం చర్చి ఎదురుగా ఉన్న ఓ ఐరనమార్టుకు ఫోన చేశారు. ఇనుము కడ్డీలు పంపించండి అంటూ ఆర్డర్‌ ఇచ్చారు. ఆ మెటీరియల్‌ను తెలుగుగంగ కాలనీకి పంపిస్తే మీకు డబ్బులు ఇస్తా మన్నారు. వెంటనే మెటీరియల్‌ పంపించారు. సరుకు చేరింది. ఫోనపే ద్వారా డబ్బు పంపిస్తాం. రూ.1 పంప మన్నారు. పంపిస్తే రూ.2 ఇస్తామన్నారు. అలా మాటల్లో పెట్టి రూ.41,660లు కాజేశారు. అదే రోజు జిల్లా పరిషత సమీపంలోని ఓ ఐరనమార్ట్‌కు ఫోన్ చేసి ఇదే విధంగా మెటీరియల్‌ పంపాలని కోరారు. ఆటోలో ఐరన తీసుకెళ్లగా అప్పటికే అక్కడ రెండు ఆటోలు ఉండడంతో అనుమానం వచ్చి వెనక్కు వచ్చేశారు. ఇవి బయటకు వచ్చినవి మాత్రమే.. ఇంకా పలువురు వ్యాపారులు సైబర్‌నేరాల్లో మోసపోయినట్లు తెలుస్తోంది. బయట చెప్పుకుంటే చిన్నతనమని కొందరు ముందుకు రావడం లేదని చెబుతున్నారు.


కొల్లగొట్టేస్తున్నారు..

సైబర్‌ నేరగాళ్లు ఆమాయకులకు వల విసిరి లక్షలాది రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌, బెంగళూరు, ముంబై, కలకత్తాలాంటి మెట్రో సిటీలతో పాటు ప్రధాన నగరాల్లోనే సైబర్‌ బెడద ఉండేది. ఇప్పుడు ఇంటర్నెట్‌ వినియోగం ఎక్కువ కావడం ఆనలైన కొనుగోళ్లు పెరగడంతో అన్ని చోట్లకు చొరబడుతున్నారు. జిల్లాలో ఏడాది కాలంలో 102 సైబర్‌ కేసులు నమోదయ్యాయి. పరువుపోతుందని స్టేషనకు రాని బాధితులు మరెందరో ఉన్నారు. ఆలాంటి వారిని కూడా కలుపుకుంటే కేసుల సంఖ్య 200కు పైగా ఉండవచ్చని సమాచారం. వాట్సాప్‌కు యాప్‌ లింక్‌ పంపి దానిని ఇనస్టాల్‌ చేసుకుంటే రివార్డ్‌ పాయింట్లు వస్తాయంటూ నమ్మిస్తారు. తెలియక కొందరు సైబర్‌నేరగాళ్లు చెప్పిన విధంగా ఇనస్టాల్‌ చేసుకొని ఇబ్బం ది పడుతున్నారు. ఓటీపీ ద్వారా అకౌంట్‌ను కొల్లగొడు తున్నారు. నిజానికి ఇలాంటివి ప్లేస్టోర్‌లో దొరకవు. బ్యాంకు నుంచి ఫోన చేస్తున్నాం. మీ ఆధార్‌ అప్‌డేట్‌ చేయాలి. మీ ఫోన నెంబర్‌ అప్‌డేట్‌ చేయాలంటూ ఓటీపీ అడిగి డబ్బు కొట్టేస్తున్నారు. నకిలీ ఫేస్‌బుక్‌ సృష్టించి మెసేంజర్‌ ద్వారా అత్యవసరమంటూ మెసేజ్‌ చేసి డబ్బులు లాగేస్తున్నారు. ఇలా సైబర్‌గాళ్లు అమాయకులను బురడీ కొట్టిస్తున్నారు. 


ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు శ్రీనివాసులు. ఈయనకు పాలెంపాపయ్య వీధిలో సాయిబాబా ఐరన మార్టు షాపు ఉంది. ఎన్నో ఏళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 2న ఈయన సెల్‌కు ఓ ఫోన వచ్చింది. ‘‘నేను మామిళ్లపల్లిలోని తెలుగుగంగ కాలనీలో ఉన్న ఆర్మీ క్యాంటీనలో పనిచేస్తున్నాను. టాటా స్టీల్‌ రేకులతో పాటు ఐరనరాడ్లు కావాలి. వాటిని ఆటో ద్వారా తెలుగు గంగ కాలనీకి పంపిస్తే బాడుగతో సహా మొత్తం డబ్బు పంపిస్తా’’ అని చెప్పాడు. ఆర్మీ క్యాంటీన అని చెప్పడంతో సంకోచించకుండానే మెటీరియల్‌ను ఆటోలో పంపించారు. ఓ పది నిమిషాల వ్యవధిలోనే మరొక వ్యక్తి ఫోన చేశాడు. ‘‘మీరు పంపించిన స్టీల్స్‌ వచ్చాయి. రిసీవ్‌ చేసుకున్నాం. ఫోన పే ద్వారా డబ్బు పంపిస్తాం. మీ ఫోన పే నుంచి రూ.1 సెండ్‌ చేయండి, నేను రూ.2 సెండ్‌ చేస్తా. నాకు కన్ఫం చేయండి’’ అన్నాడు. అతను చెప్పిన విధంగానే ఒక్క రూపాయి పంపాడు. తనకు రెండు రూపాయలు వచ్చింది. మా అకౌంట్‌ అంతా వేరేవిఽధంగా ఉంటుంది. మీరు ఎంత పంపితే అంతకు డబుల్‌ మీ అకౌంట్‌లో జమ అవుతుందంటూ చెప్పాడు. మాటల్లో పెట్టి  ఇతని ఖాతా నుంచి రూ.1,39,333 కాజేశాడు.


ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు దూదర్‌. పాలెంపాపయ్య వీధిలో అంబికా ప్లైవుడ్స్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు. అతనికి ఈ నెల 3న ఉదయాన్నే ఫోన వచ్చింది. 8 ఎంఎం ప్లైవుడ్‌ 50 షీట్లు, డెక్లామ్‌, ఫెవికాల్‌ను నగర శివారుల్లోని పాలెంపల్లె రోడ్డులోని పాఠశాల వద్దకు ఆటో ద్వారా పంపించండి అన్నారు. వెంటనే దూదర్‌ రూ.80 వేల విలువ చేసే మెటీరియల్‌ను పంపించాడు. కాసేపటికి ఫోన వచ్చింది. ‘‘మెటీరియల్‌ రిసీవ్‌ చేసుకున్నాం. మీకు ఫోనపే ద్వారా డబ్బు పంపుతాం. మీరు రూ.1 పంపండి. మేము తిరిగి రూ.2 పంపిస్తాం’’ అంటూ అతని వద్ద నుంచి రూ.63 వేలు కొల్లగొట్టారు. పై రెండు కేవలం ఉదాహరణలు మాత్రమే సైబర్‌ నేరగాళ్లు సరికొత్త పంథాతో దోపిడీలకు పాల్పడుతున్నారు. వారు చెబుతున్న పేరు, ఫోన నెంబర్‌తో పాటు వారు సరుకు పంపించమనే లొకేషన్లు కూడా కడపలో తెలిసిన ప్రాంతాలే కావడం.. వాట్సాప్‌ డీపీలో ఆర్మీ ఫొటోలు ఇతర ఐడీ కార్డు లు పెట్టుకొని అనుమానం రాకుండా అకౌంట్లను కొల్లగొడుతున్నారు. ఎక్కడో నార్తులో ఉంటూ కడపలోని పలువురి నుంచి సొమ్ము కాజేయడం ఆశ్చర్యాలకు గురిచేస్తోంది. 

Updated Date - 2022-01-09T05:26:57+05:30 IST