Abn logo
Sep 24 2020 @ 01:26AM

నూతన రెవెన్యూ చట్టం అభినందనీయం

చెన్నూర్‌ రైతు ఆశీర్వాదర్యాలీలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ 


చెన్నూరు, సెప్టెంబరు 23:  తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన నూతన రెవెన్యూ చట్టం అభినందనీయమని మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. నూతన రెవెన్యూ చట్టానికి సంఘీభావంగా బుధవారం చెన్పూర్‌ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుంచి కిష్టంపేట వరకు 500 ట్రాక్టర్లతో నిర్వహించిన రైతు ఆశీర్వాద యాత్రను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ నూతన రెవెన్యూ చట్టాన్ని ఆమోదింపజేసి వీఆర్‌వో వ్యవస్ధను రద్దు చేయడం అభినందనీయమని చెప్పారు. వీఆర్‌వో వ్యవస్ధ రద్దుతో రాష్ట్రమంతటా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. ఇకముందు ఎలాంటి భూ సమస్యలు ఉండవన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని చెప్పారు.


చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్‌, మందమర్రి మండలాల్లోని లక్షా 37 వేల ఎకరాల సాగు భూమికి నీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం వద్ద లిఫ్టులు ఏర్పాటు చేసి నీరందించేందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఫాంఆయిల్‌ పంట సాగుకు రైతులు ముందుకు వస్తుండడం సంతోషకర విషయమని అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఏడు వేల ఎకరాల్లో పాంఆయిల్‌ పంట సాగుకు మొక్కలు నాటారని తెలిపారు. అంతకుముందు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుంచి కిష్టంపేట వరకు 500 ట్రాక్టర్లతో ఆశీర్వాద ర్యాలీ నిర్వహించి కిష్టంపేట వరకు  బాల్క సుమన్‌ స్వయంగా ట్రాక్టర్‌ నడిపారు.  ర్యాలీలో నియోజకవర్గంలోని చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్‌, మందమర్రి మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement