పాత బాటలో కొత్త ప్రస్థానం

ABN , First Publish Date - 2021-03-02T06:20:52+05:30 IST

బ్యాంకుల జాతీయీకరణ విఫలమయిందా? ఇదొక సుదీర్ఘ చర్చ. అదలా ఉంచితే ప్రభుత్వ రంగంలోని రెండు బ్యాంకులను 2021–22 ఆర్థిక సంవత్సరంలో...

పాత బాటలో కొత్త ప్రస్థానం

బ్యాంకుల జాతీయీకరణ విఫలమయిందా? ఇదొక సుదీర్ఘ చర్చ. అదలా ఉంచితే ప్రభుత్వ రంగంలోని రెండు బ్యాంకులను 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరించనున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన కొత్త సాధారణ బడ్జెట్‌లో ప్రకటించారు. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన దరిమిలా ప్రభుత్వరంగ సంస్థలలోని తన వాటాలను విక్రయించడం ప్రభుత్వానికి పరిపాటి అయింది. అయితే సంస్థ యాజమాన్యంపై పూర్తి నియంత్రణను వదులుకోవడం లేదు. ఇందుకు అవసరమైన వాటాలను తానే అట్టిపెట్టు కునే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తూ వస్తోంది. ఇందుకు భిన్నమైన ప్రక్రియ ‘ప్రైవేటీకరణ’. దీని ప్రకారం ఒక ప్రభుత్వరంగ సంస్థలోని అత్యధిక వాటాలను ఒక నిర్దిష్ట ప్రైవేట్ కొనుగోలుదారుకు విక్రయిస్తున్నారు. ఈ ప్రక్రియ ఫలితంగా సదరు ప్రభుత్వ రంగ సంస్థపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ ఉండదు. 


ఇప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించవలసిన అగత్యమేర్పడింది. ఎందుకని? ప్రతి సంవత్సరం ప్రభుత్వం పెద్ద మొత్తాలను జాతీయ బ్యాంకులలో మదుపు చేస్తూ వస్తోంది. ఇలా మదుపు చేయనిపక్షంలో పలు ప్రభుత్వరంగ బ్యాంకులు పూర్తిగా దివాలా తీసే దుస్థితిలో ఉన్నాయి. ఇలా మదుపు చేయడాన్ని బ్యాంకుల ‘మూల ధనీకరణ’ అంటారు. అంటే సదరు బ్యాంకులు పొందుతున్న నష్టాలకు పరిహారంగా ప్రభుత్వం వాటి మూల ధన పెట్టుబడులను పెంచుతోంది. దీనివల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల మూల ధనం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటోంది. ఆ బ్యాంకులకు వాటిల్లుతున్న నష్టాలను ప్రభుత్వ మదుపులు భర్తీ చేయగలుగుతున్నాయి. అయినప్పటికీ పలు ప్రభుత్వరంగ బ్యాంకులు నష్టాలను చవి చూస్తూనే ఉన్నాయి. మార్గాంతరమేమిటి? ప్రైవేటీకరణే. దీనివల్ల ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతుంది. నష్టాలను భర్తీచేసేందుకు కొత్త మదుపులు చేయవలసిన అవసరముండదు. నష్టాల్లో ఉన్న బ్యాంకుల్లో కొత్త మదుపులు చేయడమంటే నాలుగు కార్లు ఉన్న ఆసామి దాదాపుగా చెడిపోయిన ఒక కారును అమ్మివేయడానికి బదులుగా దానికి పదే పదే మర మ్మత్తులు జరిపించేందుకు పెద్ద మొత్తాలను వెచ్చించిన చందమే అవుతుంది. 


ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. సదరు బ్యాంకుల విక్రయం ద్వారా లభించిన ఆదాయాన్ని ప్రభుత్వ సిబ్బందికి మరింత పెద్ద మొత్తంలో వేతన భత్యాలు చెల్లించేందుకే వినియోగిస్తారని పలువురు ఆక్షేపిస్తున్నారు. ఇది, పాక్షిక సత్యమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–-21)లో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.20 వేల కోట్ల ఆదాయం లభించగలదని ప్రభుత్వం ఆశించింది. 2021–-22 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1,75,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే రాబోయే ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ఆదాయంలో రూ.1,55,000 కోట్ల మెరుగుదలను లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పాటు ప్రభుత్వ మూల ధన వ్యయాల పెరుగుదల కూడా ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నది. 2020–-21 ఆర్థిక సంవత్సరంలో రూ.4,30,000 కోట్లుగా ఉన్న ప్రభుత్వ మూల ధన వ్యయాలు 2021–-22 ఆర్థిక సంవత్సరంలో రూ.5,54,000 కోట్లకు పెరగనున్నాయి. అంటే ఈ మూల ధన వ్యయాలు రూ.1,24,000 కోట్ల మేరకు పెరగనున్నాయి. ప్రైవేటీకరణ ద్వారా వసూళ్ళ లక్ష్యం, మూల ధన వ్యయాల పెరుగుదల కంటే స్వల్పంగా మాత్రమే అధికం. మూల ధన వ్యయాలు మరింతగా పెరగడమే అభిలషణీయం. 


ప్రైవేటీకరణ విధానాలతో ప్రభుత్వం తన ‘సంక్షేమ రాజ్య’ బాధ్యతలను వదిలివేస్తుందనే విమర్శలూ గట్టిగా వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల వారికి, పేద ప్రజలకు సరైన విధంగా బ్యాంకింగ్ సేవలు అందడం లేదనే కారణంగానే 1971లో బ్యాంకులను జాతీయాకరణ చేశారు. జాతీయీకరణ వల్ల గ్రామీణ ప్రాంతాలలో అవి తమ శాఖలను విరివిగా ప్రారంభిస్తాయని, ప్రాధాన్యతారంగాలకు రుణ సదుపాయాన్ని సమకూరుస్తాయని ఆనాటి విధాన కర్తలు భావించారు. ఈ లక్ష్యం దాదాపుగా నెరవేరింది. మార్మూల ప్రాంతాలలో సైతం ఇప్పుడు వివిధ జాతీయ బ్యాంకుల శాఖలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఆ బ్యాంకులు తీవ్రనష్టాలను చవి చూస్తున్నాయి. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో అవినీతి పెచ్చరిల్లింది. నష్టాలతో దివాలా తీయకుండా ఉండేందుకే ఆ బ్యాంకులలో ప్రభుత్వం భారీ మదుపులు చేస్తోంది. ఇందుకుగాను ప్రజలపై అధిక పన్నులు విధిస్తోంది. ఈ విధంగా బ్యాంకుల జాతీయీకరణ విధానం ప్రజలపై రెండు విధాలుగా ప్రభావాన్ని నెరపుతోంది. ఒక పక్క ప్రభుత్వరంగ బ్యాంకులు వారికి సేవలు అందిస్తుండగా మరోపక్క ఆ బ్యాంకుల్లో కొత్త మదుపులకు గాను ప్రజలు అధిక పన్నులు చెల్లించవలసివస్తోంది. మొత్తంగా చూస్తే వెనుకబడిన ప్రాంతాలు, నిరుపేద వర్గాలు బ్యాంకుల జాతీయీకరణతో లబ్ధి పొందలేదనే నేను గట్టిగా అభిప్రాయపడుతున్నాను. 


నిజం చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు అందించేందుకు బ్యాంకులను తప్పనిసరిగా జాతీయీకరణ చేయవలసిన అవసరం లేదు. నిర్దిష్ట వెనుకబడిన ప్రాంతాలలో తమ శాఖలు ప్రారంభించవలసిందిగా ప్రైవేట్ బ్యాంకులను ఆదేశించేందుకు ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)కి తగిన అధికారాలు ఉన్నాయి. 1971లో బ్యాంకుల జాతీయీకరణ సందర్భంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒక పొరపాటు చేసింది. వెనుకబడిన ప్రాంతాలలో విధిగా శాఖలను ప్రారంభించాలని ప్రైవేట్ బ్యాంకులను కచ్చితంగా నిర్దేశించడంలో ఆర్బీఐ వైఫల్యాన్ని సరిదిద్దడానికి బదులుగా బ్యాంకుల జాతీయీకరణ వైపు ప్రభుత్వం మొగ్గింది. జాతీయాకరణ అయిన బ్యాంకులు నష్టాలను మూట గట్టుకోవడానికి ఎంతో కాలం పట్ట లేదు. పెనం మీద నుంచి పొయ్యిలో పడిన పరిస్థితి బ్యాంకింగ్ వ్యవస్థకు దాపురించింది. జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరించనున్న ప్రస్తుత సందర్భంలో గతంలో జరిగిన పొరపాటు పునరావృతం కాకూడదు. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తేనే సరిపోదు. ఆ చర్యతో పాటు, గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ సేవలు సమకూర్చేందుకు ప్రైవేట్ బ్యాంకులను ఆర్బీఐ కట్టడి చేసి తీరేలా ప్రభుత్వం శ్రద్ధ చూపాలి. పాలకులు ఈ విధ్యుక్త ధర్మాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించినప్పుడే బ్యాంకింగ్ వ్యవస్థ ప్రజా హితంగా పని చేయగలుగుతుంది. ఏమైనా ప్రభుత్వరంగంలోని రెండు బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నందుకు నిర్మలా సీతారామన్‌ను అభినందించి తీరాలి.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2021-03-02T06:20:52+05:30 IST