కొత్త భూకామందులు ఈ కార్పొరేట్లు

ABN , First Publish Date - 2022-01-04T06:01:17+05:30 IST

ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భూ సంస్కరణల అమలుకు కేంద్ర ప్రభుత్వం 1971లో ఒక కొత్త భూ కమతాల పరిమితి విధానాన్ని రూపొందించింది. ఈ విధానం అమలుకు 1972లో జాతీయ మార్గదర్శకాలను కూడా జారీ చేసింది...

కొత్త భూకామందులు ఈ కార్పొరేట్లు

భూమిని పంచడమంటే అధికారాన్ని పంచడమే! 

                               ఎస్‌.ఆర్‌. శంకరన్‌


ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భూ సంస్కరణల అమలుకు కేంద్ర ప్రభుత్వం 1971లో ఒక కొత్త భూ కమతాల పరిమితి  విధానాన్ని రూపొందించింది. ఈ విధానం అమలుకు 1972లో  జాతీయ మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఆ మార్గదర్శకాల మేరకు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం 1973 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల (భూ కమతాల పరిమితి) చట్టం–1973ను తీసుకువచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ ఆ చట్టంలో ఎలాంటి మార్పులు చేయలేదు. దాని పరిధిని ఉభయరాష్ట్రాలకు వర్తింపచేస్తూ రాష్ట్రాలవారీగా నామకరణం చేసారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల (భూ కమతాల పరిమితి) చట్టం-1973’గా మార్చి జీఓ జారీ చేశారు. ఒక కుటుంబానికి ఎంత భూమి ఉండాలనేది వ్యవసాయ సీలింగ్‌ చట్టంలో స్పష్టంగా నిర్దేశించారు. భూమి స్వభావాన్ని బట్టి అంటే తరి లేదా మాగాణి భూమి గరిష్ఠంగా రెండు పంటలు పండినట్లయితే 18 ఎకరాలు, ఒక్క పంట పండేది అయితే 27 ఎకరాలు; అదే ఖుష్కి (మెట్ట) ఏదైనా సరే 54 ఎకరాలు గరిష్ఠంగా ఉండవచ్చు. ఇంతకు మించి ఎంత పొలం ఉన్నా సదరు పట్టాదారు తానే స్వయంగా ప్రభుత్వానికి దఖలు పరచాలి. అలా చేయని పక్షంలో ప్రభుత్వమే సీలింగ్‌ పరిధి చట్టంలోని విచక్షణాధికారాలను ఉపయోగించి మిగులు భూమిని స్వాధీనం చేసుకుంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఇబ్బందులను తప్పించుకునేందుకు భూమి స్వంతదారులు కొన్ని లోపాయకారి పద్ధతులలో వ్యవహరించారు. గ్రామాల్లో వీటి గురించి కథలు కథలుగా చెప్పుకోవడం చాలా మందికి తెలిసే ఉంటుంది.
1975 జనవరి 1 నుంచి భూ సంస్కరణల చట్టం అమలులోకి వచ్చింది. 1971 జనవరి 21 నుంచి 1975 జనవరి 1 లోగా భూమి పట్టాదారు తన భూమిని అమ్మినా, బదలాయింపు చేసినా, పేరు మార్చినా, దానపత్రం చేసినా తన సీలింగ్‌ పరిధి నుంచి బయట పడలేడు. తప్పించుకోవటానికి వీలులేదు. ఏదో ఒక ధార్మిక సంస్థకు, మసీదులకు రాసి ఇవ్వడం ఇత్యాది తప్పిదాలను కూడా గుర్తించి స్టాండర్డ్‌ హోల్డింగ్‌ (ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది సభ్యులు ఉన్న కుటుంబ పోషణకు అవసరమైన గరిష్ఠ భూమి) నిర్థారించి చట్టబద్ధమైన చర్యలు చేపడతారు. భూ పరిమితి నిబంధనను తప్పించుకునేందుకు పట్టాదారులు చేసిన రకరకాల ప్రయత్నాలు ముఖ్యంగా అదనపు భూమి డిక్లరేషన్‌ ముసాయిదాపై ఒక ట్రిబ్యునల్ ద్వారా క్షుణ్ణంగా విచారణ జరిపించారు. ప్రభుత్వం నిర్దేశించిన తారీకును, వారి అక్రమ లావాదేవీల తేదీలను పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు. మిగులు భూమిగా నిర్ధారణ అయిన భూమిని సర్కారు స్వాధీనం చేసుకుంది. స్వాధీనంలోకి తీసుకున్న అదనపు భూమికి ప్రభుత్వం కొంత నష్టపరిహారం చెల్లించాలని ట్రిబ్యునల్ సిఫారసు చేసింది.

అయినప్పటికీ ఈ చట్ట పరిధి నుంచి చాలా భూములను తప్పించారు. దేవాలయ భూములు, వక్ఫ్‌ భూములు, అగ్రహారాలు, విశ్వవిద్యాలయాలు, ఊరుమ్మడి భూములు, వివిధ మతసంస్థల పరిధిలోనివి నిజానికి చాలా వరకు భూ స్వాముల చేతుల్లోనే ఉండేవి. ఇంకా కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల ఆధీనంలో చాలా భూములు ఉండేవి. ఇప్పుడు మూతపడిన హెచ్‌ఎంటి, ఐడిపిఎల్‌, హెచ్‌సిఎల్‌, ఆజాం జాహీ, నిజాం చక్కెర కర్మాగారం, అన్ని యూనివర్సిటీలకు చెందిన భూములు, బలహీన వర్గాలకు చెందిన గృహ సంబంధ, వ్యవసాయ భూములను సైతం ఎన్నెన్నో సీలింగ్‌ పరిధి నుంచి మినహాయించారు.

సీలింగ్‌ ద్వారా ప్రభుత్వాలకు స్వాధీనం చేసిన భూములు ఏ మాత్రం భూమిలేని వ్యవసాయాధారిత కుటుంబాలను ఆదుకున్నాయి. అవసరాన్ని మించి వేల ఎకరాలు దాచుకున్న భూస్వాములు తమ భూములను రకరకాల బినామీల పేరున బదలాయింపు చేసుకున్నారు. ఎన్ని రకాల పేర్లు ఉన్నా ఇంకా మిగిలి ఉన్న భూములను తమకు తాముగా ప్రభుత్వానికి స్వాధీనం చేయవలసిన బాధ్యతను భూస్వాములు నిర్వర్తించవలసి ఉంది. మిగులు భూమిగా అప్పజెప్పిన భూములన్నీ రాళ్ళు, రప్పలు, గుట్టలు, కొండలు, దిబ్బలు, పంట సాగుకు ఏ మాత్రం పనికి రాని భూములే. ఈ విధంగా అప్పజెప్పిన భూములను గ్రామీణ నిరుపేదలు, భూ వసతి లేని వాళ్ళకు పంపకం చేశారు. కొన్ని సంవత్సరాల తరబడి ఈ పనికి రాని భూములను చదును చేసుకుని వాటి ఆధారంగా ఆ పేదలు జీవించారు. అయితే లాండ్‌ ట్రిబ్యునల్స్‌ ఉన్నపళంగా భూస్వాములకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడంతో ఆ పేదలు తిరిగి భూమిలేని వారుగా మారిపోయారు. ఈ భూ సంస్కరణల చట్టాన్ని రాను రాను ప్రభుత్వమే నిర్వీర్యం చేయటం గర్హనీయమైన వాస్తవం. సరైన సిబ్బంది లేక, ఉన్నటువంటి సిబ్బందికి అవగాహన లేక ఈ చట్టం తన ప్రాముఖ్యాన్ని 
కోల్పోయింది. 

ఇప్పుడు ఒక కొత్త ఒరవడి మొదలైంది. వ్యవసాయ సీలింగ్‌ చట్టం పరిధిలో ఒక కుటుంబం 54 లేదా 27 ఎకరాలకు మించి ఉండటానికి వీలు లేదు. ఈ నిబంధన దృష్ట్యా ఒక వ్యక్తి పేరున కాకుండా ఒక కంపెనీ పేరుమీద, ఓ యూనివర్సిటీ పేరున, ఓ రిసార్టు పేరున, గోదాముల పేరున, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్స్‌ పేరున, ప్రత్యేక ఆర్థికమండళ్ళ పేరున భూములను కొని వ్యవసాయేతర భూములుగా మారుస్తున్నారు. ఇలా కొన్ని వందల, వేల ఎకరాలు కొనుగోలు చేస్తున్నారు. ఎవరికీ ఈ లెక్కలు దొరకవు. ఒక ప్రైవేట్ కళాశాల కోసం ఇరవై ఎకరాలు కొని ప్రహరీ గోడ నిర్మించి చుట్టుపక్కల పేద రైతుల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తూ, వారు తమ భూములు అమ్మేలా ఒత్తిడి చేస్తున్నారు. అవసరమైతే రైతులను బెదిరించి, హింసించి కొనుగోలు చేస్తున్నారు. ఒక మంత్రి తనకు 600 వందల ఎకరాలు ఉన్నట్లు బహిరంగంగా ప్రకటించారు. సీలింగ్‌ పరిధికి ఎన్నో రెట్లు ఎక్కువగా భూములు కలిగి ఉండటం చట్ట
విరుద్ధం. అలాగే బడా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఊర్లకు ఊర్లే కొనేస్తున్నారు. గోడలు కట్టేస్తున్నారు. వీళ్ళందరినీ భూ సంస్కరణ పరిధిలోకి తీసుకురావాలి. ఆయా సంస్థలకు అవసరమైన మేరకు భూమిని ఉండనిచ్చి, మిగులు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.

మన దేశంలో భూ సంస్కరణలు ఒక్క జమ్మూ- కశ్మీర్‌లో మాత్రమే నూటికి నూరు శాతం అమలయ్యాయి. ఆ రాష్ట్రంలో ఎవరూ వంద ఎకరాల ఆసామి ఉండడు. అలాగే ఎవరూ భూమిలేని రైతులు ఉండరు. రాజ్యాంగ అధికరణ 370ని రద్దు చేయడం వల్ల కశ్మీర్‌లో వేలాది ఎకరాలను కార్పొరేట్‌ కంపెనీలు కైవసం చేసుకుంటున్నాయి. పశ్చిమబెంగాల్‌, కేరళలో భూ సంస్కరణలు కొంతమేరకు అమలయ్యాయి. ఈ వాస్తవాల దృష్ట్యా భూ సంస్కరణలకు పదును పెట్టాలి. ఫ్యామిలీ హోల్డింగ్‌ అంటే 54 ఖుష్కి లేదా 27 మాగాణి ఎకరాలు మాత్రమే ఒక కుటుంబం పేరుమీద ఉండాలి. మిగతాది ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి లేదా వారే ప్రభుత్వాలకు అప్పజెప్పేలా చూడాలి. పెట్టుబడులు ఆహ్వానించాలి, ప్రోత్సహించాలి అంటూ నరేంద్రమోదీ ప్రభుత్వం నీతి ఆయోగ్‌ ద్వారా భూములను ఎలాంటి పరిమితులు లేకుండా లీజుకు తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. ఏ కంపెనీ పేరుమీద ఎంత పొలం ఉంది, ఆ కంపెనీకి ఎంత విస్తీర్ణం అవసరం వంటి సమాచారాన్ని ప్రజల ముందుంచాలి. నిజానికి ఏ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకైనా పది నుంచి ఇరవై ఎకరాలు సరిపోతుంది. కొన్ని వందల ఎకరాల భూములను ఆయా కంపెనీల పేరుమీద స్వంతం చేసుకుంటున్నారు. 

ప్రస్తుతమున్న భూ సంస్కరణల చట్టానికి పలు సవరణలు చేయవలసిన అవసరం ఉంది. బలమైన చట్టంతో మాత్రమే కొంతవరకు కార్పొరేట్లను కట్టడి చేయగలం. భూ సంస్కరణల చట్టం వచ్చిన కొత్తలో మిగులు భూములను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకునేందుకు నాటి పాలకులు పటిష్ఠచర్యలు చేపట్టారు. ప్రస్తుత పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అసలు ఆ చట్టాన్నే నీరు ర్చారు. 

ఒక కంపెనీ పేరుమీద చట్ట విరుద్ధంగా సొంతం చేసుకుని వాటి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి పడావుగా ఉంచడం పరిపాటి అయింది. దీనివల్ల సమీప భవిష్యత్తులోనే ఆహార భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదముందనేది కాదనలేని సత్యం. ఒక కంపెనీ పేరున కొనుగోలు చేసిన భూములు ఆయా కంపెనీల అవసరాల మేరకు ఉండనిచ్చి మిగతా వాటి విషయంలో భూ సంస్కరణల చట్టాన్ని అమలు పరచాలి. భూమి లేని పేదలు కోట్ల సంఖ్యలో ఉన్నారు. కొందరికి వ్యవసాయం తప్ప వేరే పని ఏదీ తెలియని దుస్థితి. వ్యవసాయమే వృత్తిగా జీవించే బడుగు బలహీనవర్గాలకు, భూస్వాముల వద్ద ఉన్న అదనపు భూములను స్వాధీనం చేసుకుని పంపిణీ చేయాలి. ప్రభుత్వాలు అలా చేయని పక్షంలో సభ్యసమాజంలోని ప్రజాప్రయోజనాలను ఆశించే ప్రగతిశీలురు కోర్టుల ద్వారా లేదా ప్రజాప్రయోజనాల వ్యాజ్యాల ద్వారానైనా గడీలలో భూములను దాచుకున్న స్వార్థపరుల నుంచి ప్రభుత్వాలకు స్వాధీనమయ్యేలా చేయగలగాలి. ముందు ముందు ఎవ్వరూ అవసరాన్ని మించి భూములను కొనుగోలు చేయకుండా ఉండేలా పకడ్బందీగా చట్టాన్ని రూపొందించాలి. వెనుకటి జమిందార్లు, జాగీర్దార్లు పేర్లు మార్చుకుని కార్పొరేట్ల పేరున వేల ఎకరాలు సేకరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పరిణమించకముందే ప్రభుత్వమూ, పౌరసమాజమూ మేల్కోవాలి.
వి. బాలరాజు
రిటైర్డ్‌ తాహశీల్దార్‌

Updated Date - 2022-01-04T06:01:17+05:30 IST