పార్టీని గెలిపిస్తే మళ్లీ మీరే!

ABN , First Publish Date - 2022-04-08T08:43:24+05:30 IST

మంత్రులంతా ‘మాజీ’లు అయ్యారు! ‘కొందరికి మాత్రం మళ్లీ చాన్స్‌’ ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పేశారు! మళ్లీ మంత్రులయ్యేదెవరో... కొత్తగా మంత్రి పదవి వరించేది ఎవరినో... ఈనెల 11వ తేదీన తేలిపోతుంది. మాజీలను ‘

పార్టీని గెలిపిస్తే  మళ్లీ మీరే!

అందరూ ఔట్‌

24 మందీ రాజీనామా

ఎన్నికలు, పాలన, సామాజిక కోణంలోనే మార్పులు

మాజీ మంత్రుల గౌరవం ఏ మాత్రం తగ్గదు

పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలుగా నియామకం

జిల్లా అభివృద్ధి బోర్డు చైర్మన్లుగా నియమిస్తాం: సీఎం

మంత్రివర్గంలో అనుభవజ్ఞులూ ఉండాలి

కొందరికి మాత్రం మళ్లీ అవకాశం ఉంటుంది

11న ఉదయం 11.31కి ప్రమాణ స్వీకారాలు

మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్‌ వెల్లడి

కొత్త కేబినెట్‌లో బీసీలు, ఎస్సీలకు ప్రాధాన్యం?


మంత్రులంతా ‘మాజీ’లు అయ్యారు! ‘కొందరికి మాత్రం మళ్లీ చాన్స్‌’ ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పేశారు! మళ్లీ మంత్రులయ్యేదెవరో... కొత్తగా మంత్రి పదవి వరించేది ఎవరినో... ఈనెల 11వ తేదీన తేలిపోతుంది. మాజీలను ‘సంతృప్తి పరిచేందుకు’ అన్నట్లుగా... వారిని జిల్లా అభివృద్ధి బోర్డులకు చైర్మన్లుగా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక... బీసీలు, ఎస్సీలపై తనకు ఎనలేని ప్రేమ ఉందని చెప్పేందుకు కొత్త మంత్రివర్గంలో ఎక్కువ శాతం ఆ వర్గానికి చెందిన వారినే నియమించనున్నట్లు సమాచారం! సచివాలయ ప్రాంగణంలోని రెండో బ్లాక్‌కు ఎదురుగా... సోమవారం ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

మంత్రుల ముచ్చట తీరిపోయింది. మూడేళ్లుగా మంత్రి పదవుల్లో ఉన్నవారంతా మాజీలు అయ్యారు. పాత మంత్రులు పోగానే... కొత్త మంత్రివర్గం కూర్పుపై ‘సామాజిక సమీకరణ’ వార్తలు గుప్పుమన్నాయి. కొత్త కేబినెట్‌లో జగన్‌ తన సొంత సామాజిక వర్గానికి తక్కువ ప్రాధాన్యం ఇస్తారని... బీసీ, ఎస్సీలకు పెద్దపీట వేస్తారని వైసీపీ అనుకూల వర్గాలు ప్రచారం మొదలుపెట్టాయి. జగన్‌ పాలనపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో... కేబినెట్‌లో కుల సమీకరణనే నమ్ముకున్నారని, కొందరికి పదవులు ఇచ్చి ఆ వర్గాలన్నింటినీ ఉద్ధరిస్తున్నట్లుగా చెప్పుకోవడమే దీని వెనుక వ్యూహమని పేర్కొంటున్నారు. గురువారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో... అధికారిక అజెండాలోని అంశాలపై చర్చ ముగిసిన తర్వాత... మొత్తం 24 మంది మంత్రులతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాజీనామా చేయించారు. వారికి వివరణ ఇచ్చేలా ప్రసంగించారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారిని కూడా తొలగిస్తున్నందుకు బాధ పడుతున్నానని తెలిపారు.


‘‘2019 జూన్‌ 8వ తేదీన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడే.. సమర్థత, పనితీరు ఆధారంగా రెండున్నరేళ్ల  తర్వాత 50 శాతం మందిని తొలగిస్తానని చెప్పాను. ఇప్పుడు పనితీరు ఆధారంగా ఎవరినీ తొలగించడం లేదు. అందరూ సమర్థంగా పని చేశారు. అయితే.. పార్టీని,  ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవాల్సి ఉన్నందునే ఇప్పుడు మంత్రులందరినీ తొలగించాల్సి వచ్చింది’’ అని తెలిపారు.  ‘‘2024 ఎన్నికల్లో విజయం సాధించాలంటే.. అనుభవం కలిగిన నేతల సేవలు పార్టీకి అవసరం. ఈ బాధ్యతను మీరైతేనే సమర్థంగా నిర్వర్తిస్తారన్న విశ్వాసం ఉంది. మంత్రివర్గంలోనూ సీనియర్ల సేవలు కావాలి. సామాజిక సమీకరణలూ చూడాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని మంత్రులుగా కొంతమంది పాతవారికీ అవకాశం ఉంటుంది’’ అని జగన్‌ తెలిపారు. ‘మాజీల’కు పార్టీ పదవులను అప్పగిస్తామని... వారి గౌరవానికి ఏమాత్రం భంగం కలుగదని చెప్పారు. జిల్లా అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేసి... వాటికి మాజీ మంత్రులను చైర్మన్లుగా నియమించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ‘‘2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను మీరు నెత్తికెత్తుకోవాలి. కొందరు సీనియర్లకు పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతలు అప్పగిస్తాం. 2024లో వైసీపీని గెలిపించి వస్తే.. మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకుంటాను’’ అని మంత్రులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి చెప్పారు.


మంత్రులుగా పదవులు చేపట్టిన వారిపట్ల సహచర ఎమ్మెల్యేలకు కాస్త కుళ్లు ఉంటుందని వ్యాఖ్యానించారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించేవారికి పదవులు మోయడం ఏమంత సులభం కాదని జగన్‌ అన్నారు. ఒకవైపు ప్రభుత్వ విధాన నిర్ణయాలను అమలు చేయడంలో కీలక భూమిక వహిస్తూనే.. పార్టీని బలోపేతం చేసే బాధ్యతనూ చేపట్టాలని తెలిపారు. 




అంతర్గతంగా అలకలు, అసంతృప్తి

‘కొందరు సీనియర్లకు మళ్లీ అవకాశం ఉంటుంది’ అని సీఎం చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొందరు మంత్రులలో నెలకొన్నఅసంతృప్తి చల్లార్చేందుకే  జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పార్టీ అధ్యక్షునిగా జగన్‌ ఏ బాధ్యతలను అప్పగించినా చేస్తామని చెబుతున్నా.. పలువురు ‘మాజీ’లు అంతర్గతంగా తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. కేబినెట్‌ భేటీ తర్వాత చాలామంది మీడియాతో మాట్లాడకుండా ముభావంగా వెళ్లిపోయారు. జగన్‌ నిర్ణయాన్ని చప్పట్లు చరిచి ఆహ్వానించామంటూ కొడాలి నాని చెప్పారు. కానీ... మంత్రి పదవులు కోల్పోయిన పలువురిలో ఆ బాధ బాగా కనిపించింది.

Updated Date - 2022-04-08T08:43:24+05:30 IST