జగన్‌ ప్రకటిస్తేనే విశ్వసించాలి

ABN , First Publish Date - 2020-02-16T09:50:35+05:30 IST

వైసీపీ ఎన్డీఏలో భాగస్వామ్యం కావచ్చని పిచ్చాపాటిగా ఎవరైనా మాట్లాడితే అది కరెక్టు కాదని పౌరసరఫరాల మంత్రి కొడాలినాని అన్నారు. తమ పార్టీ అధినేత

జగన్‌ ప్రకటిస్తేనే విశ్వసించాలి

వైసీపీ అవసరం బీజేపీకి రావచ్చు! 

రాజ్యసభలో దానికి బలం లేదు..రేపు మా బలం పెరుగుతుంది 

అప్పుడు హోదా కోసం ఒత్తిడి తెస్తాం: మంత్రి కొడాలి నాని వెల్లడి

విజయవాడ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎన్డీఏలో భాగస్వామ్యం కావచ్చని పిచ్చాపాటిగా ఎవరైనా మాట్లాడితే అది కరెక్టు కాదని పౌరసరఫరాల మంత్రి కొడాలినాని అన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ నుంచి అలాంటి ప్రకటన వస్తేనే విశ్వసనీయతగా తీసుకోవాలని చెప్పారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పరిస్థితులను బట్టి వైసీపీ అవసరం భవిష్యత్‌లో ఏర్పడవచ్చని తెలిపారు. రాజ్యసభలో ఆ పార్టీకి బలం తక్కువగా ఉందని, రానున్న రోజుల్లో వైసీపీ సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని.. బిల్లులను పాస్‌ చేయించుకునేందుకు తమ పార్టీ మద్దతు బీజేపీకి అవసరమవుతుందని చెప్పారు.


అప్పుడు ప్రత్యేక హోదాను లేవనెత్తి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి సాకారం చేసుకునేందుకు కృషి చేస్తామనన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని నాడు బీజేపీ చెప్పిందని.. ఇవ్వాల్సిందేనని చెప్పారు. ‘ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ముగ్గురూ కలిసినప్పుడు వేదికలపై హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. తర్వాత దాని బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే వద్దంటే ఎలాగని ఇవే పార్టీలు అన్నాయి. ఇలాంటి యూటర్న్‌లు వైసీపీ ఎప్పుడూ తీసుకోలేదు. ఎన్నికల ముందు మెజారిటీ ఎంపీ సీట్లు వస్తే .. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చి హోదాను సాధించుకోవచ్చని మా అధినేత భావించారు. బీజేపీ సంపూర ్ణ మెజారిటీ సాధించడంతో వైసీపీ అవసరం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంతో ఘర్షణపడడం కంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ పోరాడదామని జగన్‌ చెబుతున్నారు’ అని తెలిపారు. 

Updated Date - 2020-02-16T09:50:35+05:30 IST