చేరువైన ‘కారు’

ABN , First Publish Date - 2022-06-25T04:56:51+05:30 IST

సొంత కారు ఒకనాడు స్టేటస్‌ సింబల్‌. ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమయ్యేది. కాలానుగుణంగా పరిస్థితులు మారాయి. దశాబ్దం కిందట కారు కొనుక్కునే ప్రక్రియ మధ్య తరగతి వర్గాల్లో రెండు శాతానికి పరిమితం కాగా, ఇటీవల 30 శాతానికి పెరిగింది.

చేరువైన ‘కారు’

ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా కార్ల కొనుగోలు

ఆసక్తి చూపుతున్న మధ్య తరగతి వర్గాలు

కొవిడ్‌ నేపథ్యంలో సొంత కారులో ప్రయాణానికే మొగ్గు

సులభతర వాయిదాలతో కొనుగోలుకు రుణాలు

సెకండ్‌ హ్యాండ్‌ కార్లకు పెరిగిన గిరాకీ


 సొంత కారు ఒకనాడు స్టేటస్‌ సింబల్‌. ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమయ్యేది. కాలానుగుణంగా పరిస్థితులు మారాయి. దశాబ్దం కిందట కారు కొనుక్కునే ప్రక్రియ మధ్య తరగతి వర్గాల్లో రెండు శాతానికి పరిమితం కాగా, ఇటీవల 30 శాతానికి పెరిగింది. కొవిడ్‌ అనంతర పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి విముఖత చూపుతున్న మధ్య తరగతి వర్గాలు అప్పు చేసి అయినా, సొంత కారు కొనుగోలు చేయడం పట్ల ఆసక్తి చూపుతున్నారు. కొత్త కార్లు కొనుగోలు చేస్తున్న వారిలో టీచర్లు, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో పని చేస్తున్న భార్యాభర్తలు అధికంగా ఉండడం గమనార్హం. వలసల ప్రాంతంగా పేరొందిన మహబూబ్‌నగర్‌ జిల్లాలో మూడేళ్లలో కార్ల వినియోగం, కొనుగోలు విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తిగొల్పుతున్నాయి.

- నాగర్‌కర్నూల్‌(ఆంధ్రజ్యోతి)


మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలో కార్ల వినియోగం పెరుగుతోంది. సెకండ్‌ హ్యాండ్‌తో పాటు కొత్త కార్ల కొనుగోలు అధికమవుతోంది. కొవిడ్‌ తర్వాత కార్ల కొనుగోలు, విక్రయాల పరిస్థితిపై కొంత అధ్యయనం చేయగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వనపర్తి జిల్లాలోని పెబ్బేరు, వనపర్తిలలో 2019లో 8,718 ద్విచక్ర వాహనాలు, 462 కార్లు రిజిస్ర్టేషన్‌ అయ్యాయి. 2020లో  7,593 ద్విచక్ర వాహనాలు, 436 కార్లు రిజిస్ర్టేషన్‌ కాగా, 2021 నాటికి ఆ సంఖ్య బాగా పెరిగింది. 653 కొత్త కార్లు గతేడాది రిజిస్ట్రేషన్‌ కావడం గమనార్హం. మూడు రోజుల కిందటి గణాంకాలను పరిశీలించగా, ఈ జిల్లాలో 6,108 కార్లు, 59,590 బైకులు ఉన్నాయి.

మహబూబ్‌నగర్‌ జిల్లా ఆర్టీఏ పరిధిలో 2020-21లో 3,687 కార్లు, ఈ ఏడాది 4,887 కార్లు కొత్తగా రోడ్లపైకి వచ్చాయి. నారాయణపేట వంటి చిన్న జిల్లాలో 4,554 కార్లు ఉండడం గమనార్హం.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తిలో ఆర్టీఏ కార్యాలయాలు ఉండగా 2019లో 651 కార్లు, 2020లో 813, 2021లో 857, ఈ ఏడాది జూన్‌ 20 వరకు 1,373 కార్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. ఈ లెక్కలను బట్టి చూస్తే మధ్య తరగతి కుటుంబానికి కార్లు ఎంత చేరువయ్యాయో తెలుస్తోంది. మూడేళ్లు వరుసగా ఆదాయ పన్ను చెల్లించిన వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు కార్లకు సంబంధించిన రుణాలను అందించడంలో సరళీకృతమైన విధానాలను అవలంభించడం కారణంగా కూడా సొంత కార్లు మధ్య తరగతి వర్గాలకు చేరువవుతున్నాయి. ఆర్టీసీ చార్జీలు పెరగడం, ఆ తర్వాత హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లో తిరగాలంటే ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లే ఖర్చు సొంత కారులో వెళ్లే ఖర్చుకు సమానంగా ఉండడంతో కార్లను కొనుగోలు చేయడానికే ఉమ్మడి జిల్లా మధ్య తరగతి ప్రజానీకం ప్రాధాన్యం ఇస్తున్నారు. 


కరోనా కాలంలో కారు కొన్నా

నేను వ్యవసాయం చేస్తా. కరోనా సమయంలో బస్సులో ప్రయాణం చేయాలంటే ఇబ్బందిగా ఉండేది. కరోనా బారిన పడకుండా సురక్షిత ప్రయాణం చేయడానికి సొంత కారు కొన్నా. కారును సొంత అవసరాలకు వాడుకోవడంతోపాటు ట్యాక్సీగా నడపడం ద్వారా ఆదాయం కూడా పొందుతున్నా. 

- రాఘవేంద్ర, సింగవరం గ్రామం, పెంట్లవెల్లి మండలం

సొంత కారే బెటర్‌

ఆర్టీసీ బస్సు చార్జీలు రోజురోజుకు విపరీ తంగా పెరుగుతున్నాయి. కుటుంబం అంతా ఏదైన శుభకార్యానికి ప్రయాణం చేయాలంటే అద్దె కారులో వెళ్తే రవాణా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఆ ఖర్చుల భారం కన్నా సొంత కారే బెటరని ఈ మధ్యే కొత్త కారు కొన్నాను.

- వి.శివశంకర్‌, టీచర్‌, నాగర్‌కర్నూల్‌

Updated Date - 2022-06-25T04:56:51+05:30 IST