గంగమ్మా.. మమ్మేల రావమ్మా..!

ABN , First Publish Date - 2022-05-18T07:10:07+05:30 IST

కరోనాతో రెండేళ్ల విరామం తర్వాత మంగళవారం చిత్తూరులోని నడివీధి గంగమ్మ జాతర మొదలైంది. పోటెత్తిన భక్తులతో సందడిగా మారింది.

గంగమ్మా.. మమ్మేల రావమ్మా..!

 తొలిపూజ చేసి జాతర ప్రారంభించిన సీకే బాబు దంపతులు 

 నేడు నిమజ్జన వేడుకలు 


చిత్తూరు(కల్చరల్‌), మే 17: కరోనాతో రెండేళ్ల విరామం తర్వాత మంగళవారం చిత్తూరులోని నడివీధి గంగమ్మ జాతర మొదలైంది. పోటెత్తిన భక్తులతో సందడిగా మారింది. ఉదయం 5 గంటలకు వంశపారంపర్య ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, ఆయన సతీమణి సీకే లావణ్య ఊరేగింపుగా జాతర మండపం వద్దకు చేరుకున్నారు. గంగమ్మకు సారె సమర్పించాక తొలిపూజ చేసి జాతర ప్రారంభించారు. అప్పటికే క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు గంగమ్మను దర్శించుకుని.. అంబళ్లు పోశారు. అమ్మవారికి ముక్కుపుడకలు, కమ్మలు, సారె ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్లలో వచ్చి అమ్మవారికి అంబళ్లు పోసి దర్శించుకున్నారు. సాయంత్రం నైవేద్యం సమర్పించారు. ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, జిల్లా అధికారులు, పలువురు న్యాయమూర్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 


నగరమంతా సందడి 

వివిధ వేషధారణలతో కొందరు.. నడుముకు వేపాకు చుట్టుకుని మరికొందరు అమ్మవారి దర్శనానికి రావడంతో నగరంలో సందడి నెలకొంది. పలుచోట్ల ప్రతిష్ఠించిన గంగమ్మల దర్శనానికి వచ్చే భక్తులతో ఆయా ప్రాంతాలు సందడిగా మారాయి. ఇక, ఇటు తమిళనాడు, అటు కర్ణాటకకు మధ్యలో చిత్తూరు ఉండటం వల్ల జాతరకు ఈ రెండు రాష్ట్రాల భక్తుల తాకిడి ఎక్కువే. వీరంతా సోమవారం రాత్రే చిత్తూరుకు చేరుకున్నారు. అసలే ఇరుకుగా ఉండే వీధులకు తోడు తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేయడంతో భక్తుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకోసం చలివేంద్రాలు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. 


ఆకట్టుకోనున్న ఓం శక్తి  భక్తుల విన్యాసాలు

చిత్తూరు నడివీధి గంగమ్మ నిమజ్జన వేడుకలు బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా ఓంశక్తి భక్తుల విన్యాసాలు అలరించనున్నాయి. వీరు అగస్త్యీశ్వరాలయం వద్ద ఓంశక్తి భక్తులు శూలధారణ చేసుకుని జిల్లా ప్రభుత్వాస్పత్రి నుంచి చర్చివీధి, పొన్నియమ్మ కోవిల్‌ స్ట్రీట్‌ మీదుగా వివిధ విన్యాసాలతో హైరోడ్డుకు చేరుకుంటారు. అక్కడ నిమజ్జనానికి వెళుతున్న గంగమ్మకు చివరగా పూలమాలలను సమర్పిస్తారు.





Updated Date - 2022-05-18T07:10:07+05:30 IST