గమకాల మర్మం

ABN , First Publish Date - 2022-01-17T06:01:27+05:30 IST

కెలైడో స్కోప్‌ (చిత్రదర్శిని)లో దృశ్యాల లాగా, ఆకృతుల్లాగా కళాకారుని, భావుకుని ‘మనస్థితి’ క్షణక్షణం మారిపోతూ ఉంటుంది. మహాగాయకుని గానంలో గమకాలు అలాగే క్షణక్షణం ఊహాతీతంగా...

గమకాల మర్మం

కెలైడో స్కోప్‌ (చిత్రదర్శిని)లో దృశ్యాల లాగా, ఆకృతుల్లాగా కళాకారుని, భావుకుని ‘మనస్థితి’ క్షణక్షణం మారిపోతూ ఉంటుంది. మహాగాయకుని గానంలో గమకాలు అలాగే క్షణక్షణం ఊహాతీతంగా మారిపోతూ ఉంటాయి. ప్రతి గమకం, ప్రతి సూక్ష్మాతిసూక్ష్మ గమకం ఆ క్షణంలోని కళాకారుని ‘మనస్థితి’ని వ్యక్తీకరిస్తుంది. నీటిలోని చేప, ఆకాశంలోని పక్షి ఏ క్షణంలో ఎటువైపు ఎలా కదులుతుందో తెలియదు. గమకాలూ అంతే. ఐతే కచేరీలో గాయకుడు, వాద్యకారుడు ప్రయోగించే గమకాలన్నీ సద్యఃకల్పితాలు కావు; నిజానికి ముందుగా సిద్ధం చేసుకున్నవీ, బాగా అలవాటైపోయినవే ఎక్కువ ఉంటాయి. కాని, వాటి కంటే అలవోకగా అప్పటికప్పుడు ఆశువుగా గానం చేసేవే అతి మనోహరంగా ఉంటాయి. అవి మార్మిక కవితల్లాంటివి; మాటలకు లొంగేవి కావు.


భావం పూర్తిగా గానం (music)లోకి ఒదగదు, గానం పూర్తిగా వాద్యంలోకి ఒదగదు-గాత్రం కూడా వాద్యమేసుమా!భావానికి వున్న విస్తృతి (expanse), సాంద్రత (density), గాంభీర్యం (depth) భాషకులేదు. భాషాశక్తి అతిపరిమితం. గమకాలు - కొన్ని, ఒక్కొక్కప్పుడు - అప్రయత్నంగా, అలవోకగా దొర్లివస్తాయి.


సరోవరంపై - ఎంత సూక్ష్మమైనవైనా - అలలులేకుండా ఉండవు. అలజడి వల్లనే అలలు ఏర్పడతాయి. జలతలంపై ఎప్పుడూ ఎంతోకొంత అలజడి ఉంటుంది. కనుకనే అలలు ఉంటాయి. అలాగే స్వరంపై ఎప్పుడూ ఎంతో కొంత కంపనం ఉంటుంది. కంపనం లేకుండా గమకం ఉండదు. And every గమకం should be contextually appropriate - సందర్భోచితంగా ఉండాలి. కంపనం లేకుండా అసలు నాదమే ఉండదు. గమకం అనేది controlled vibration (కంపనం). గమకాలను extempore/extemporized micrograce notes అనవచ్చునేమో!


గమకాలు స్వరాశ్రితాలు. అవి ఎన్నెన్ని ఆకృతులు దాల్చినా స్వరావరణను దాటిపోవు; రాగావరణను దాటిపోవు. ఒక స్వరం నుంచి బయలుదేరిన గమకం అదే రాగంలోని మరో స్వరానికి- పక్కనున్న స్వరానికి మాత్రమే కాదు-దూరస్వరాలపైకి కూడా జంప్‌ చేసి/లంఘించి-చిత్ర విచిత్ర విన్యాసాలు చేయవచ్చు/చేస్తుంది. ఆ విన్యాసాలు ఔచిత్యవంతంగా (appropriate), అర్థవంతంగా (meaningful), సందర్భోచితంగా, మనోహరంగా (beautiful) ఉండాలి; ఉంటాయి. కళావంతంగా ఉంటాయి.


రెండు స్వరాల మధ్య జరిగే గమకాల అల్లిక (knitting)ను సంగీత పరిభాషలో ‘స్వర్‌ సంగత్‌’ అంటారు. రాగంలోని రెండు, లేక ఇంకా ఎక్కువ నిర్దిష్ట (particular) స్వరాల మధ్య సంబంధం ఆ రాగస్వభావ, స్వరూపాలను వ్యక్తం చేస్తుంది.


ఇప్పుడు నేను చెప్పినదంతా మనోధర్మం సంగీతంలోని గమకాల సంగతి. Here I am not speaking about precomposed Gamakas. రచనలలోని-అంటే కృతి, కీర్తన, పదం వంటి రచనల లోని గమకాల సంగతి కాదు. ‘రచన’లలోని గమకాలు ‘శిల్పం’లోని స్థిరమైన ఒంపులు, సొంపుల లాంటివి. వాటిలో ‘కదలిక’లుండవు. అందుకే చిత్ర, శిల్ప, వాస్తు కళలను, కావ్య కళను plastic arts అంటారు. కాగా, గాన, నర్తన కళలను performing arts అంటారు.


గాయకుడు కచేరీలో ఒకానొక రచనను ఉన్నదున్నట్లుగా గానం చేస్తే అది చాలా వరకు-దాదాపు 90శాతం ఆ రచయిత/ కృతికర్త/ వాగ్గేయకారుని propertyనే అవుతుంది. కాని, నిజానికి భారతీయ సంగీతంలో ఏ వాగ్గేయ రచననైనా నూరుశాతం కాగితం మీద ఉన్నట్లే పాడడం సాధ్యం కాదు. పాశ్చాత్య సంగీతంలో అది దాదాపు 90 శాతం సాధ్యం - ఎందుకంటే ఆ సంగీతమంతా ముందుగా రాసి పెట్టుకున్నదే (precomposed).


ఇందాక గమకాల గురించి చెప్పినదంతా కూడా భారతీయ శాస్త్రీయ సంగీతానికి సంబంధించినదే. గమకాలకు సంబంధించిన ఆ వర్ణన పాశ్చాత్య సంగీతానికి వర్తించదు.


స్వేచ్ఛావిహంగాల స్వేచ్ఛకూ పరిమితులుంటాయి. ఇక్కడి పక్షులు -ఎంత ఎత్తుకు ఎగిరినా- ఇక్కడి ఆకాశంలోనే ఎగురుతాయి. సైబీరియా నుంచి మన కొల్లేరుకు ఎగిరివచ్చే పక్షులు ఒకానొక ఋతువులోనే, ఒకానొక దారిలోనే బారులు బారులుగా ఎగిరివస్తాయి. అవి అటూ ఇటూ పక్కకు పోవు. అది వలసపక్షుల లక్షణం. గమకాల స్వేచ్ఛ అటువంటిదే. 


గమకాలను గురించి ఎంత చెప్పినా, ఎంత ఆలోచించినా ఇంకా చెప్పాల్సిందేదో, ఆలోచించాల్సిందేదో, అర్థం చేసుకోవాల్సిందేదో మిగిలి పోయిందనిపిస్తుంది.


రంగులు ఎన్ని ఉన్నాయో, శ్రుతులు ఎన్ని ఉన్నాయో, గమకాలు ఎన్ని ఉన్నాయో, రసాలు ఎన్ని ఉన్నాయో, స్వరసందర్భాలు ఎన్ని ఉన్నాయో చెప్పడం సాధ్యం కాదు. ఎన్ని భావాలున్నాయో అన్ని శ్రుతులు, అన్ని రంగులు, అన్ని గమకాలు, అన్ని రసాలు (రసఛాయలు) ఉంటాయి. గమకాలకు మల్లేనే భావాలకూ పరిధులుంటాయి. వాటిని దాటితే అవి పిచ్చివాడిప్రేలాపనల్లా ఉంటాయి.


ఆత్మాశ్రయ చిత్రకళ - Impressionist art; ఒక కథకు వేసే బొమ్మ- Illustration; ఒక పురాణ పాత్ర బొమ్మ; ఒక ప్రకృతి దృశ్యం ఫొటోగ్రాఫ్‌ - ఇలాంటివి కాకుండా extempore art, మనోధర్మ చిత్ర కళ - ఇలాంటివెన్నో ఉంటాయి.


కచేరీ సంగీతంలోనైనా - ఎంత అద్భుతంగా, విశృంఖలంగా ఆలాపన చేసినా, వాయించినా రికార్డ్‌ చేసిన తర్వాత అది plastic art అయిపోతుంది. రికార్డును విన్న ప్రతిసారీ కొత్తగా వినిపిస్తుంటే అది మళ్ళీ extempore గా అనిపిస్తుంది. చిత్ర కళలోనైనా అంతే. ఎస్‌.ఎం. పండిట్‌ వేసిన ఊర్వశి వర్ణ చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా ప్రతిసారీ ఏదో కొత్తదనం కనిపిస్తుంది, కొత్త అర్థం స్ఫురిస్తుంది. సంగీతంలో గమక చిత్రాలూ అంతే. ఇదంతా కెలైడో స్కోపిక్‌ మాయా జాలంలా అనిపిస్తుంది. ఇది మన ‘అవగాహన’ లక్షణం కూడా.


గమకాలు సందర్భోచితంగా ఉండాలి. గమకాలు సందర్భం (context)పై ఆధారపడి ఉంటాయి. సందర్భ శుద్ధి (ఔచిత్యం) లేని గమక ప్రయోగాలు అసందర్భ ప్రేలాపనల్లా ఉంటాయి.


గమకాలు శుద్ధ ఆలాపనలోనే ఎక్కువగా వినిపిస్తాయి.


వాక్యాధారలో ఒక్క పదం, ఒక్క దీర్ఘం, ఒక్క పొల్లు, ఒక్క కొమ్ము, ఒక వత్తు జారిపోతే, మారిపోతే - అది చాలు అర్థం అపభ్రంశమై పోవడానికి. రాగధారలో ఒక్క స్వరం, ఒక్క శ్రుతి, ఒక్క గమకం, ఒక్క గమక శకలం జారిపోయినా, మారిపోయినా, భ్రష్టమైనా - అది చాలు ఉద్దిష్ట భావం వికలమైపోవడానికి.


కళా జగత్తులో-ప్రతిరేఖ, ప్రతిరంగు, ప్రతి అక్షరం, ప్రతిస్వరం (నాదబిందువు), ప్రతి ముద్ర భంగిమ, చాలనం (movement), ప్రతి దృశ్యం, ప్రతి శబ్దం కూడా ఒకానొక అనిర్వచనీయ అనుభూతికి, అవగాహనకు అభిజ్ఞ (సంకేతం-symbol). దానిని గుర్తించగలిగిన వారికే ఆ అనుభూతి అనుభూతవుతుంది. అదే ‘రసజ్ఞత’. కళాలోచన (కళాదృష్టి) గలవారికి సృష్టిలోని ప్రతి వస్తువు, ప్రతి శబ్దం, రూపం ఒక అభిజ్ఞగా, సంకేతంగానే కనిపిస్తుంది. కళాసృష్టి యావత్తూ సంకేతాలతోనే జరుగుతుంది. కళారచనలోని ఏ రూపం, ఏ శబ్దం పైకికనిపించే, వినిపించే మామూలు ‘విషయం’, ‘సంగతి’ కాదు. అవన్నీ మరేవో నిగూఢ విషయాలకు సంకేతాలు. ఆ నిగూఢ విషయాలు ఆ సంకేతాల ద్వారా కాక మరే విధంగా అభివ్యక్తం కావు.

నండూరి పార్థసారథి

99597 34534


Updated Date - 2022-01-17T06:01:27+05:30 IST