వీడిన ముగ్గురి హత్య కేసు మిస్టరీ

ABN , First Publish Date - 2022-01-24T06:42:10+05:30 IST

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తండ్రీ, కొడుకుల హత్య కేసు మిస్టరీ వీడింది.

వీడిన ముగ్గురి హత్య కేసు మిస్టరీ
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ఆర్‌. ప్రకాశ్‌

ఆరుగురు నిందితులను అరెస్ట్‌...

పరారీలో మరో 18 మంది నిందితులు

9లక్షల నగదు..5 బరిసెలు,  కత్తి స్వాధీనం 

వివరాలు వెల్లడించిన డీఎస్పీ ప్రకాశ్‌

జగిత్యాలరూరల్‌, జనవరి 23 : జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తండ్రీ, కొడుకుల హత్య కేసు మిస్టరీ వీడింది. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతోనే కుల సంఘ సభ్యులు పథకం పన్ని మరీ అంతమొందించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో 18 మంది నిందితులు పరారీలో ఉన్నారు. జగిత్యాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ప్రకాశ్‌ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..  

టీఆర్‌నగర్‌ గ్రామానికి చెందిన జగన్నాథం నాగేశ్వర్‌రావు పదేళ్లుగా కుంచెరుకల సంఘానికి అధ్యక్షుడిగా ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. దీంతో పాటు నాగేశ్వర్‌రావు మంత్రాలు చేస్తున్నాడనే అనుమానం కుల సంఘ సభ్యుల్లో నెలకొంది. గ్రామంలో ఎవరికీ జ్వరం వచ్చినా నాగేశ్వర్‌రావు మంత్రాలు చేయడం వల్లనే అని అందరూ అనుమానపడేవారు. దీంతో ఎలాగైనా నాగేశ్వర్‌రావు కుటుంబాన్ని అంతమొందించాలని టీఆర్‌నగర్‌ గ్రామానికి చెందిన తమ కులస్థులైన వనం దుర్గయ్య, వనం చిన్నగంగయ్య, వనం మధు, వనం పోషయ్య, వనం శేఖర్‌, దాసరిరాములు, బల్లనిసారయ్య, కండెల శ్రీనివాస్‌లతో పాటు మరి కొంత మంది పథకం పన్నారు. దీనిలో భాగంగా జనవరి 19వ తేదీ నాడు రాత్రి కండెల శ్రీనివాస్‌ ఇంటి వద్ద సమావేశమయ్యారు. అక్కడ మద్యం తాగుతూ ఎలాగైన నాగేశ్వర్‌రావు కుటుంబాన్ని చంపాలని నిర్ణయించుకున్నారు. అందుకయ్యే ఖర్చులను కులం చీటి డబ్బుల నుంచే భరించాలని తీర్మానం చేసుకుని కులసంఘ రిజిష్టర్‌లో సంతకాలు చేశారు. 

అనుకున్నట్లుగానే 20వ తేదీ మధ్యాహ్నం సంఘ సమావేశం జరుగుతుండగా పథకం ప్రకారం నాగేశ్వర్‌రావును కండెల శ్రీనివాస్‌, వనం శేఖర్‌, వనం చిన్నదుర్గయ్యలు బరిసెలతో పొడిచి చంపారు. రాంబాబును దాసరిరాములు, వనం శ్రీనివాస్‌, వనం చిన్నగంగయ్యలు బరిసెలతో పొడిచి చంపారు. రమేష్‌ను బల్లని సారయ్య, వనం మధుకర్‌, భూమయ్యలు కత్తులతో పొడిచి చంపారు. నాగేశ్వర్‌రావు మరో కుమారుడు రాజేష్‌ను చంపేందుకు యత్నించినా అతను తప్పించుకు వెళ్లి జగిత్యాల రూరల్‌స్టేషన్‌ ఫిర్యాదు చేశాడు. కేసును  రూరల్‌ సీఐ కృష్ణకుమార్‌, టౌన్‌ సీఐ కిషోర్‌ ఆధ్వర్యంలో రూరల్‌ ఎస్సై అనిల్‌, మల్యాల ఎస్పై చిరంజీవి, సారంగాపూర్‌ ఎస్సై రామకృష్ణ, బీర్‌పూర్‌ ఎస్సై శ్రీకాంత్‌ ఐదు బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నట్లు డీఎస్పీ ప్రకాశ్‌ తెలిపారు. ఆదివారం తమకు వచ్చిన సమాచారం మేరకు మల్యాల మండలంలోని ఓ లాడ్జీలో తలదాచుకున్న ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 9లక్షల42వేల 770 రూపాయలను, 5 బరిసెలు,  కత్తి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును చాకచక్యంగా చేధించిన పోలీసులకు ఎస్పీ రివార్డులు ప్రకటించినట్లు డీఎస్పీ తెలిపారు.


Updated Date - 2022-01-24T06:42:10+05:30 IST