Advertisement
Advertisement
Abn logo
Advertisement

సారీ.. తప్పయింది!!

వీఆర్వోలకు క్షమాపణ చెప్పిన మునిసిపల్‌ కమిషనర్‌

ఆందోళన విరమించాలని సబ్‌కలెక్టర్‌ సూచన

మంత్రి వ్యాఖ్యలపై తొలగని ఉత్కంఠ

(పలాస, డిసెంబరు 6)

పలాస-కాశీబుగ్గ మునిసిపల్‌ కమిషనర్‌ టి.రాజగోపాలరావు వీఆర్వోలకు క్షమాపణ చెప్పారు. ఈ నెల 1న కాశీబుగ్గలో పలాస నియోజకవర్గ స్థాయి అధికారులు, మునిసిపల్‌ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులతో ఓటీఎస్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు వీఆర్వోలు హాజరు కాగా... బయటకు వెళ్లిపోవాలని కమిషనర్‌ రాజగోపాల్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు మంత్రి సీదిరి అప్పలరాజు కూడా వీఆర్వోల సేవలు అవసరం లేదని... సచివాలయాలకు వారు వస్తే.. తరమాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి, కమిషనర్‌ వ్యాఖ్యలపై వీఆర్వోలు ఆందోళన బాట పట్టారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం మునిసిపల్‌ కార్యాలయంలో సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌ వీఆర్వోలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ రాజగోపాలరావుతోనూ ఆ రోజు జరిగిన విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ వీఆర్వోలకు క్షమాపణ చెప్పారు. ‘సారీ.. తప్పయిందంటూ’ పొరపాటును ఒప్పుకున్నారు. కలెక్టర్‌, మంత్రి వస్తున్న హడావుడిలో వీఆర్వోలను బయటకు వెళ్లమన్నానని, ఈ సంఘటన యాధృచ్ఛికంగా జరిగిందని వివరణ ఇచ్చారు. దీనిపై ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? అని సబ్‌కలెక్టర్‌ ప్రశ్నించగా.. మందస, వజ్రపుకొత్తూరు తహసీల్దారులు బి.పాపారావు, అప్పలస్వామి మాట్లాడారు. వీఆర్వోలను కసురుకున్నారని, తమను సైతం కమిషనర్‌ బెదిరించారని తెలిపారు. దీంతో కమిషనర్‌పై సబ్‌కలెక్టర్‌ మండిపడ్డారు. అలా వ్యవహరించడం సరికాదని, వీఆర్వోలకు క్షమాపణ చెప్పాలని సూచించారు. దీంతో కమిషనర్‌ క్షమాపణ చెప్పారు. అయినా వీఆర్వోలు శాంతించ లేదు. దీంతో పలాస తహసీల్దార్‌ మధుసూదనరావు కలుగజేసుకుని సమస్య పరిష్కారానికి వచ్చిన సబ్‌కలెక్టర్‌ మాటకు గౌరవం ఇవ్వాలని సూచించారు. దీంతో వీఆర్వోలు శాంతించారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ.. అధికారులు, వీఆర్వోలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లక్ష్యాలను పూర్తిచేయాలని కోరారు. 


9న కలెక్టరేట్‌ల వద్ద ఆందోళన

కమిషనర్‌ రాజగోపాలరావుతో వివాదం ముగియగా.. మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలపై మాత్రం వీఆర్వోలు గుర్రుగానే ఉన్నారు. ‘మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా సచివాలయాలకు వెళ్లడం లేదు. ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ఆందోళన చేసి కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తా’మని వీఆర్వో సంఘ నాయకుడు కె.శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. పలాస ప్రభుత్వ కళాశాల మైదానంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ..  రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు త్వరలో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అంతవరకు వీఆర్వోలు పలాస నియోజకవర్గంలో సచివాలయాలకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement