రోడ్డును కమ్మేస్తున్న మట్టి

ABN , First Publish Date - 2022-05-16T05:16:30+05:30 IST

అది అత్యంత రద్దీ రహదారి. ప్రతీనిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఆ రోడ్డుపై పూర్తిగా మట్టి కమ్మేయడంతో ప్రమాదకరంగా మారింది.

రోడ్డును కమ్మేస్తున్న మట్టి
పాత హైవేపై పేరుకుపోయిన మట్టి

అదుపుతప్పి పడిపోతున్న ద్విచక్రవాహనదారులు

అత్యంత రద్దీ రహదారిపై నిత్యం ప్రమాదాలు 

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

రామాయంపేట, మే 15: అది అత్యంత రద్దీ రహదారి. ప్రతీనిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఆ రోడ్డుపై పూర్తిగా మట్టి కమ్మేయడంతో ప్రమాదకరంగా మారింది. రామాయంపేట-కామారెడ్డి రహదారిపై సుమారు పావు కిలో మీటర్‌ మేర బీటీ రోడ్డుపైకి మట్టి వచ్చి చేరింది. అసలే చిన్నదిగా ఉన్న ఈ పాత హైవేపై అక్కడక్కడా రోడ్డు ధ్వంసం కాగా... మరో పక్క మట్టంతా రహదారిని కమ్మేయడంతో ద్విచక్రవాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారు. దీనికి తోడు  భారీ వాహనాల వెనక దుమ్ము లేస్తుండడంతో వాహన చోదకుల కళ్లల్లో దుమ్ము చేరి మరింత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఇక రాత్రి వేళ అయితే సరైన వీధి దీపాలు లేక రోడ్డుపై చేరిన మట్టిని గమనించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇంతటీ రద్దీ రోడ్డును ఆర్‌ఆండ్‌బీ, మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. 



హైవేపై పూడ్చని భగీరథ గుంతలు

రోడ్డుపై ఉన్న మట్టి చాలదన్నట్లూ ఇటీవల మిషన్‌ భగీరథ పనుల కోసం పాత హైవేపై తవ్విన గుంతలను అలాగే వదిలేశారు. ఇరుపక్కల పెద్ద పెద్ద గుంతలు తీసి పైపులు వేసి వదిలేయడంతో, వాహనాదారులు గుంతల్లో పడిపోతున్నారు. 

Updated Date - 2022-05-16T05:16:30+05:30 IST