అనకాపల్లిలో బైక్ ర్యాలీ చేస్తున్న నాయకులు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నరసింగరావు
అనకాపల్లిలో భారీ బైక్, ట్రాక్టర్ ర్యాలీ
అనకాపల్లి టౌన్, జనవరి 26: కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకూ ఉద్యమం ఆగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్.నరసింగరావు స్పష్టం చేశారు. ఢిల్లీలో రైతులకు పోరాటానికి సంఘీభావంగా మంగళవారం ఏఐకేఎస్‌సీసీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీగా ట్రాక్టర్, బైక్ ర్యాలీ జరిగింది. అనంతరం నెహ్రూచౌక్‌లో జరిగిన బహిరంగ సభలో నరసింగరావు మాట్లాడారు. మూడు చట్టాలు అమలులోకి వస్తే రైతుల నోట్లో మట్టి కొట్టినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాల వల్ల కార్పొరేట్ సంస్థలకు తప్ప రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరదన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం మాట్లాడుతూ, చట్టాలు రద్దు చేయాలని రెండు నెలలుగా రైతులు పోరాడుతున్నా కేంద్రం స్పందించకపోవడం విచారకరమన్నారు. కార్యక్రమంలో పలు పార్టీలు, సంఘాల నాయకులు ఐఆర్ గంగాధర్, పీఎస్ అజయ్‌కుమార్, వైఎన్ భద్రం, ఎ.బాలకృష్ణ, మోహనరావు, వెంకటరావు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్వ వాగ్వాదం జరిగింది. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ర్యాలీ నిర్వహించుకుంటామని ఆందోళనకారులు చెప్పడంతో పోలీసులు అంగీకరించారు.