మూసీని తోడేస్తున్నారు

ABN , First Publish Date - 2021-01-27T04:55:24+05:30 IST

ఇసుక పేరుతో మూసీ వాగును తోడేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల కళ్లుగప్పి ఇసుకాసురులు రాత్రి వేళల్లో వందలాది ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. నామమాత్రంగా అనుమతులు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా వంద ల ట్రాక్టర్లలో జిల్లా సరిహద్దులను దాటిస్తున్నారు.

మూసీని తోడేస్తున్నారు

అనుమతుల పేరుతో జోరుగా ఇసుక దందా

రాత్రి వేళల్లో అక్రమంగా సరఫరా

ఇతర ప్రాంతాలకు తరలించి డంప్‌లు

అర్వపల్లి:ఇసుక పేరుతో మూసీ వాగును తోడేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల కళ్లుగప్పి ఇసుకాసురులు రాత్రి వేళల్లో వందలాది ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. నామమాత్రంగా అనుమతులు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా వంద ల ట్రాక్టర్లలో జిల్లా సరిహద్దులను దాటిస్తున్నారు. రాత్రి వేళల్లో అక్కడ డంప్‌లు ఏర్పాటుచేసి, అక్కడి నుంచి లారీల్లో ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా నాగారం, అర్వపల్లిలో మూసీ వాగువద్ద ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ప్రభుత్వ పథకాల్లో భాగమైన సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, ప్రభుత్వ భవన నిర్మాణాలు, రైతు వేదికలు, స్థానికంగా ఇళ్ల నిర్మాణాలకు రెవె న్యూ అధికారులు అనుమతులు ఇస్తున్నారు. అందుకు డీడీ లేదా చలానా తీసి కొన్ని ట్రాక్టర్లకు అనుమతులు తీసుకొని వందలాది ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పలుమార్లు దాడులు నిర్వహించి కేసులు పెట్టినా ఇసుకాసురులు బెదరడం లేదు, ఈ అక్రమ దందా ఆగడం లేదు. ఇదిలా ఉండగా, నాగారం మూసీ, బిక్కేరు వాగు నుంచి ఇసుక తరలించవద్దని మూసీ పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు ఎన్నోమార్లు అడ్డుకున్నా ప్రభుత్వ అనుమతుల పేరుతో ఇసుకను తోడేస్తున్నారు. బిక్కేరు వాగు నుంచి ఇసు క తరలించడంలో వివాదం కొనసాగుతోంది. ఇదిలా ఉండ గా, దామరచర్ల విద్యుత్‌ ప్లాంట్‌ కోసం లక్ష క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తరలించేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జాజిరెడ్డిగూడెం మూసీ వాగు నుంచి థర్మల్‌ ప్లాంట్‌కు లారీల్లో ఇసుక తరలిస్తున్నారు. రోజూ 30లారీల్లో ఇసుక తరలిస్తుండగా, ఇప్పటి వరకు 50వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తోడారు. అదేవిధంగా కలెక్టర్‌ అనుమతి కారణంగా రైతు వేదికలకు ఇసుక తరలిస్తున్నారు. అయితే ఈ సమయంలో ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంతో వందల ట్రాక్టర్లలో ఇసుక అక్రమంగా తరలిం ది. మూసీ నదిలో ప్రవాహం ఉన్నా జాజిరెడ్డిగూ డెం వద్ద ట్రాక్టర్లను నదిలోకి తీసుకెళ్లి మరీ ఇసుక తోడుతున్నారు. మూసీ వాగు నుంచి నిత్యం 300 ట్రాక్టర్లల్లో ఇసుక సూర్యాపేట, తుంగతుర్తి, తిరుమలగిరి, నూతనకల్‌, అర్వపల్లి మండలాలకు తరలుతోంది.

మూసీ ఇసుకకు భలే గిరాకీ

జాజిరెడ్డిగూడెం మూసీ ఇసుకకు రాష్ట్రంలో గిరాకీ ఉంది. ఇక్కడి ఇసుక నాణ్యమైనది కావడంతోపాటు, సన్నగా ఉండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి లారీలు ఇక్కడికి వస్తున్నాయి. ఈ ఇసుకపైనే గృహ నిర్మాణదారులు, బిల్డర్లు మొక్కుచూపుతున్నారు. దీంతో జాజిరెడ్డిగూడెం ఇసుకకు డిమాండ్‌ పెరిగింది. ఒక ట్రాక్టర్‌ ఇసుకకు డిమాండ్‌నుబట్టి రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ధర చెల్లిస్తున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్లలో ఇసుక సూర్యాపేటకు తరలుతోంది.

కేసులు నమోదు చేసినా, అడ్డుకున్నా..

మూసీ వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లపై కేసులు నమోదుచేసినా ఇసుకాసురులు బెదరడంలేదు. ఒక్క అర్వపల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఆరు నెలల కాలంలో 69 ట్రాక్టర్లపై 18 కేసులు నమోదయ్యాయి. నూతనకల్‌ మండలంలో 20 కేసులు, నాగారం మండలంలో 15 కేసులు ఇసుక అక్రమార్కులపై నమోదయ్యాయి. నాగారం మండలం పేరబోయినగూడెం వద్ద బిక్కేరు వాగు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న చిన్న చిన్న రిజర్వాయర్ల నిర్మాణానికి ఇసుకను తరలిస్తున్నారు. ఐదు రోజుల క్రితం అడ్డగూడూరు మండలం లక్ష్మిదేవికాల్వ గ్రామ సమీపంలో ఇసుకను తోడుతుండగా ఆ ప్రాంత రైతులు అడ్డుకోవడంతో వివాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇసుక తరలింపునకు అనుమతులు ఉన్నాయని నచ్చజెప్పడంతో ఈ వివాదం సమసింది.

సరిహద్దులు దాటించి డంప్‌లు

నూతనకల్‌ మండలంలో బికుమళ్ల వాగు నుంచి మహబూబాబాద్‌ జిల్లా బంగ్లాకు, మాచినపల్లి-పాలేరు వాగు నుంచి ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయికి రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుకను ట్రాక్టర్లలో తరలించి అక్కడ డంప్‌లు ఏర్పా టు చేశారు. అక్కడి నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు లారీల్లో ఇసుక తరలుతోంది.గుండ్లసింగారం, తాళ్లసింగారం వాగు ల నుంచి సైతం ఇసుకను తరలిస్తున్నారు. మద్దిరాల మండలం ము కుందాపురం, కొత్తప ల్లి, మామిళ్లమడవ నుంచి సైతం అక్రమ దందా కొనసాగుతోంది. తిరుమలగిరి మండలం అనంతారం గ్రామస్థులు బిక్కే రు వాగు నుంచి ఇసుకను తరలించవద్దని అడ్డుకుంటున్నా ప్రభుత్వ పథకాల కోసం అంటూ అక్రమం గా ఇసుక తరలిస్తున్నారు. నాగారం, తిరుమలగిరి మండలాల్లో అధికార పార్టీకి చెందినవారే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నార న్న ఆరోపణలు ఉన్నా యి. వీరికి పోలీసులు, రెవెన్యూ అధికారులు వత్తాసుపలుకుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, మూసీ వాగును ఇసుక పేరుతో తోడేస్తుండటంతో భూగర్భ జలా లు అడుగంటిపోతాయని మూసీ పరివాహక ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అనంతగిరి మండలంలో... 

అనంతగిరి: మండలంలోని పలు ప్రాంతాల్లో అక్రమ ఇసుక దందా జోరుగా కొనసాగుతోంది. అక్రమార్కుల్లో అధికార పార్టీ నాయకులే అధికంగా ఉండటంతో రెవెన్యూ, పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా పలుమార్లు ఫిర్యాదుచేస్తే నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి ఒకటి రెండు ట్రాక్టర్లపై కేసులు నమోదు చేస్తున్నారు. వాస్తవానికి నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుక తరలుతోంది. ఇదిలా ఉండగా, మండలానికి మూడు నెలలుగా పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ) లేకపోవడంతో అక్రమ దందాను పట్టించుకునేవారు కరువయ్యారు.


అనుమతులు లేకుంటే చర్యలు : హరిశ్చంద్రప్రసాద్‌, అర్వపల్లి తహసీల్దార్‌

ప్రభుత్వ నిర్మాణాల కోసం అనుమతులతోనే ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలించే ట్రాక్టర్లపై కేసు లు నమోదు చేస్తున్నాం. రాత్రి వేళల్లో ఇసుక ను తరలిస్తే కఠిన చర్యలు తప్పవు.


Updated Date - 2021-01-27T04:55:24+05:30 IST