ఆ తల్లికి ఓర్పు నశించి.. బంధువుల సాయంతో సుపారి ఇచ్చి మరీ..

ABN , First Publish Date - 2020-08-15T11:13:05+05:30 IST

మద్యానికి బానిసై కుటుంబాన్ని దూరం చేసుకొని..

ఆ తల్లికి ఓర్పు నశించి.. బంధువుల సాయంతో సుపారి ఇచ్చి మరీ..

కేసును ఛేదించిన పోలీసులు

తొమ్మిది మంది అరెస్ట్‌, ఒకరు పరారీ

సుపారీ రూ. 1.70 లక్షలు

కన్నప్రేమను చంపుకొని.. తనయుడిని హత్య చేయించిన తల్లి

వివరాలు వెల్లడించిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌


ఒంగోలు(ఆంధ్రజ్యోతి): మద్యానికి బానిసై కుటుంబాన్ని దూరం చేసుకొని పెడదారి పట్టాడు. అంతటితో ఆగకుండా కన్న తల్లిదండ్రులను కూడా వేధిస్తుండడంతో ఆ తల్లికి ఓర్పు నశించింది. బంధువుల సాయంతో సుపారి ఇచ్చి మరీ హత్య చేయించింది. పేగు బంధాన్నే అవమానపరచాలని చూస్తున్న ఓ వ్యసనపరుడైన కుమారుడిని కన్నతల్లే కిరాయి రౌడీలతో హత్యచేయించిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. కందుకూరు మండలం పొన్నలూరులో ఈ ఘటన జరిగింది. వివరాలను ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ శుక్రవారం వెల్లడించారు. నాలుగున్నర నెలల క్రితం కందుకూరు మండలం దూబగుంట వద్ద ఓవ్యక్తిని హత్య చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీనిపై లోతుగా విచారించిన వారికి విస్తుపోయే నిజాలు తెలిశాయి. తల్లే కుమారుడిని హత్య చేయించిందని విచారణలో తేలింది.


పొన్నలూరుకు చెందిన కుంచాల నరసింహారావుకు పదమూడేళ్ల క్రితం వివాహం అయ్యింది. అయితే దురలవాట్లకు బానిస కావడంతో ఆరేళ్లగా భార్య ఈయనకు దూరంగా హైదరాబాద్‌లో ఉంటోంది. తల్లిదండ్రుల వద్దే ఆయన ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో నరసింహారావు తండ్రి పక్షవాతానికి గురయ్యాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఆసరాగా ఉండకపోగా తిరిగి వారినే వేధిస్తుండడంతో ఆ మాతృమూర్తిలో ఓర్పు నశించింది. తన కుమారుడిని హత్య చేయించేందుకు పథక రచన చేసి రూ.1.70 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. 


హతమార్చిందిలా..

కిరాయి హంతకుల్లో ఒకడైన చుండి పేరయ్య ఏప్రిల్‌ 13న మద్యం తాగుదాం రమ్మని నరసింహరావును పథకం ప్రకారం హతమార్చేందుకు పిలిచాడు. తన మోటరు సైకిల్‌పై ఎక్కించుకుని కందుకూరు ఓవీ రోడ్డులోని వెంకటాద్రినగర్‌కు వెళ్లే దారిలో రాత్రి ఏడున్నరగంటలకు తీసు కెళ్లాడు. అప్పటికే అక్కడ రౌడీషీటర్‌ పాలడుగు రాఘవరావు, షేక్‌ షరీఫ్‌, ఇంటూరు మహేంద్ర, నిమ్మగడ్డ కరుణాకర్‌, గాలంకి కిరణ్‌, ఉప్పుటూరి రమణయ్య, ఒలేటి చినమాలకొండయ్య, తన్నీరు మాల్యాద్రి ఉన్నారు. ముందుగా అనుకున్న ప్రకారం రాఘవరావు తన వెంట తెచ్చిన కత్తిని షరీఫ్‌కిచ్చాడు. షరీఫ్‌ వెంటనే నర సింహరావును కత్తితో పొడిచాడు. దీంతో ఆయన కింద పడిపోయాడు. వెంటనే రాఘవరావు గొడ్డలితో నడుం మీద తల వద్ద నరికాడు. దీంతో నరసింహరావు మృతి చెందాడని నిర్ధారించుకున్న తరువాత అక్కడే ముళ్లపొదల్లో గొయ్యి తీసి పూడ్చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, గొడ్డలితో పాటు చెలగపార ముళ్లపొదల్లో దాచిపెట్టి వెళ్లిపోయారు.


కేసు ఛేదించిందిలా..

సుమారు నాలుగు నెలల క్రితం దూబగుంట వద్ద ఓ వ్యక్తిని హత్య చేశారనే సమాచారం పొన్నలూరు, కందుకూరు రూరల్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆదేశాల మేరకు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి ఆ పరిసర ప్రాంతాల్లో అదృశ్యం కేసులు గుర్తు తెలియని మృతదేహాల వివరాలను సేకరించారు. అంతే కాకుండా దోబగుంట పరిసర ప్రాంతంలో ఉన్న రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలోనే నరసింహరావు తల్లిని కూడా విచారణ చేశారు. అయితే తన కుమారుడు హైదరాబాద్‌ వెళ్లాడని అతని దగ్గర సెల్‌ఫోన్‌ కూడా లేదని ఆమె చెప్పింది. దీంతో పోలీసులు అనుమానించి  సమగ్ర విచారణ చేపట్టారు.  నరసింహ రావును దోబగుంట సమీపంలో హత్య చేసినట్లు కిరాయి హంతకులు రౌడీషీటర్‌ పాలడుగు రాఘవరావు, చుండి పేరయ్యలు అంగీకరించారు. దీంతో నరసింహరావు హత్య వెల్లడైంది. 


తొమ్మిది మంది అరెస్ట్‌, పరారీలో ఒకరు

ఈ హత్య కేసులో ఆయన తల్లి, మేనమామ తన్నీరు మల్యాద్రి, మృతుడికి బాబాయి వరసైన ఉప్పుటూరి రమణయ్యలతో పాటు కిరాయి హంతకులు దోబగుంటకు చెందిన పాలడుగు రాఘవరావు, వలేటి చినమాలకొండయ్య, పొన్నలూరుకు చెందిన చుండి పేరయ్య , కావలికి చెందిన షేక్‌ షరీఫ్‌, నిమ్మగడ్డ కరాణాకర్‌, ఇంటూరి మహేంద్రలను అరెస్ట్‌ చేశారు. గాలంకి కిరణ్‌ పరారీలో ఉన్నారని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తెలిపారు.


ఈ కేసును ఛేదించడంలో కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసరావు, కందుకూరు, కనిగిరి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు ఎం.విజయ్‌కుమార్‌, కే.వెంకటేశ్వర్లు, ఎస్సైలు కె. అంకమ్మ, బి.బ్రహ్మనాయుడు, హెడ్‌ కానిస్టేబుల్‌ కె.రమణయ్య, కానిస్టేబుళ్లు మాలకొండయ్య, తిరుపతి స్వామి, దుర్గాబాబు, చక్రవర్తి, కే.వెంకట్రావు మహిళా కానిస్టేబుళ్లు ఎస్‌కే. రేష్మలతో పాటు ఐటీ కోర్‌ టీంలను ఎస్పీ అభినందించారు. 

Updated Date - 2020-08-15T11:13:05+05:30 IST