లాంతర్లను ఆర్పేశారు!

ABN , First Publish Date - 2020-05-23T10:04:15+05:30 IST

ఒకప్పుడు ఎన్నో వేల మంది బాటసారులకు దారిచూపిన దీపాలవి. ఎంతోమంది జీవితాల్లో విద్యాకాంతులు నింపిన దీపాలవి.

లాంతర్లను ఆర్పేశారు!

మూడులాంతర్ల స్తంభం కూల్చివేత

విజయనగరంలో చారిత్రక కట్టడం కనుమరుగు

అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు


విజయనగరం టౌన్‌, మే 22: 

ఒకప్పుడు ఎన్నో వేల మంది బాటసారులకు దారిచూపిన దీపాలవి. ఎంతోమంది జీవితాల్లో విద్యాకాంతులు నింపిన దీపాలవి. విజయనగర రాజుల వైభవానికి... విజయనగర చరిత్రకు దర్పణం పట్టిన దీపాలవి. ఎన్నో కథలు... నవలలు... నాటకాల్లో పాత్రలవి. ఇప్పుడు  ఆధునికీకరణ పేరుతో ప్రస్తుత మన పాలకులు...అధికారులు ఆ దీపాలను ఆర్పేశారు. చరిత్రను చీకటిమయం చేశారు. అవే విజయనగరం పట్టణంలోని చారిత్రక మూడులాంతర్లు. లాక్‌డౌన్‌ నిబంధనలు (కర్ఫ్యూ) అమలవడానికి కొద్దిసేపటి ముందు శుక్రవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఈ చారిత్రక కట్టడాన్ని మున్సిపల్‌ అధికారులు కూలగొట్టారు. ఎన్నో తుఫాన్లకు ఎదురునిలిచి... ప్రకృతి విపత్తులను తట్టుకొని...ఠీవీగా నిల్చున్న ఆ స్తంభం... ‘అధికార’ తుఫానుకు కూలిపోయింది. 


విద్యుత్తు దీపాల వెలుగులు పరిచయం లేని రోజుల్లో...1890 ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యానికి చివరి పట్టాభిషిక్తుడైన పీవీజీ రాజు తాత చినవిజయరామరాజు హయాంలో దీనిని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. గంటస్తంభం... కోట... మూడులాంతర్లు... ఈ మూడింటినీ విజయనగరం చరిత్ర నుంచి వేరుచేయలేం. కానీ అధికారులు ఆధునికీకరణ పేరుతో మూడులాంతర్లను ప్రజల కళ్ల ముందు లేకుండా చే శారు. అదే ప్రదేశంలో సరికొత్తగా మూడులాంతర్లను ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు చెప్పడం కొసమెరుపు.  

Updated Date - 2020-05-23T10:04:15+05:30 IST