ధర్మయుద్ధానికి చిహ్నమిది

ABN , First Publish Date - 2020-08-28T05:30:00+05:30 IST

ఇస్లాం క్యాలెండర్‌లోని మొదటి మాసం మొహర్రం. ఈ నెలలోని పదో రోజును ‘యౌమె ఆషురా’ అంటారు. ఆ రోజును ‘మొహర్రం’గా ముస్లింలు జరుపుకొంటారు. ధర్మాన్ని కాపాడడం కోసం హజ్రత్‌ హుస్సేన్‌ చేసిన మహోన్నత త్యాగానికి గుర్తుగా, ఆయన వీర మరణానికి సంతాపాన్ని పాటించే రోజు ఇది...

ధర్మయుద్ధానికి చిహ్నమిది

ఇస్లాం క్యాలెండర్‌లోని మొదటి మాసం మొహర్రం. ఈ నెలలోని  పదో రోజును ‘యౌమె ఆషురా’ అంటారు.  ఆ రోజును ‘మొహర్రం’గా ముస్లింలు జరుపుకొంటారు. ధర్మాన్ని కాపాడడం కోసం హజ్రత్‌ హుస్సేన్‌ చేసిన మహోన్నత త్యాగానికి గుర్తుగా, ఆయన వీర మరణానికి సంతాపాన్ని పాటించే రోజు ఇది.


  •                ఈ నెల 30న మొహర్రం


అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్‌ మక్కా నగరం నుంచి మదీనా నగరానికి వలస వెళ్ళిన సందర్భాన్ని ‘హిజ్రీ’ అంటారు. దాన్ని నూతన శక ఆరంభంగా పరిగణిస్తారు. ఇస్లాం క్యాలెండర్‌లోని పన్నెండు మాసాల్లో నాలుగు నెలలు అత్యంత పవిత్రమైనవి. వాటిని ‘నిషిద్ధ మాసాలు’గా కూడా వ్యవహరిస్తారు. ఆ నాలుగు మాసాల్లో మొహర్రం ఒకటి. ప్రధానంగా ఈ నెలల్లో యుద్ధాలు నిషిద్ధమని ఖురాన్‌ చెబుతోంది. దానికి కారణం కర్బలా మైదానంలో సాగిన అద్వితీయ సంగ్రామం. అది ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి జరిగిన పోరాటం.

ఇస్లాం ధర్మంలో రాచరిక వ్యవస్థ లేదు. అనువంశికంగా పాలకుడిని నియమించే సంప్రదాయమూ లేదు. ఖలీఫాల ద్వారా రాజ్య పాలన సాగుతుంది. ఖలీఫా ఎంపికకు మూడు సూత్రాలు నిర్దేశితమై ఉన్నాయి. వాటిలో మొదటిది... మహా ప్రవక్త మహమ్మద్‌ ప్రవేశపెట్టిన విధానం. దీని ప్రకారం ప్రజలే ఖలీఫాను ఎన్నుకోవాలి. రెండోది... మొదటి ఖలీఫా హజ్రత్‌ అబూబకర్‌ అనుసరించిన పద్ధతి. దాని ప్రకారం ఒక ఖలీఫా తనకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని తదుపరి పాలకుడిగా (ఖలీఫాగా) సూచించవచ్చు. మూడోది... రెండో ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ పాటించిన విధానం. దీని ప్రకారం కొందరు మేధావులతో కూడిన సంఘానికి ఖలీఫా ఎంపికను అప్పగించవచ్చు. అంతిమ మహా ప్రవక్త మహమ్మద్‌ తరువాత హజ్రత్‌ అబూబకర్‌ సిద్ధిఖ్‌, ఉమర్‌, ఉస్మాన్‌, ఆ తరువాత అలీ ప్రజా ప్రతినిధులు (ఖలీఫా)గా పరిపాలన సాగించారు. ఖలీఫా అలీ తరువాత ప్రజలు తమ పాలకునిగా మహా ప్రవక్త మనుమడు హజ్రత్‌ హుస్సేన్‌ను ఎన్నుకున్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా ఆయన స్వచ్ఛందంగా అధికారాన్ని వదులుకున్నారు. అనంతరం వ్యసనపరుడు, దుర్వర్తనుడు అయిన యజీద్‌ తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. అది ఇస్లాం ధర్మసూత్రాలకు పూర్తిగా విరుద్ధం. 


ప్రజాస్వామ్య ప్రియులు యజీద్‌ బలవంతపు రాచరికానికి వ్యతిరేకంగా ఎదురు తిరిగారు. అప్పట్లో హజ్రత్‌ హుస్సేన్‌ మక్కాలో ఉండేవారు. హుస్సేన్‌ తిరిగి రావాలనీ, ఆయనను ఖలీఫాగా గుర్తిస్తామనీ కుఫా నగర ప్రజలు అసంఖ్యాకంగా ఉత్తరాలు రాశారు. దీనితో యజీద్‌తో ముఖాముఖి చర్చలు జరపడానికి తన డెబ్భై రెండు మంది ప్రత్యక్ష సహచరులతో, కుటుంబ సభ్యులతో మక్కా పట్టణం నుంచి కుఫా నగరానికి హుస్సేన్‌ బయలుదేరారు. ఈలోగా తనను పాలకుడిగా గుర్తించాలంటూ హుస్సేన్‌కు యజీద్‌ కబురు పంపాడు. కానీ ఆయన ఒప్పుకోలేదు. అధర్మానికి వ్యతిరేకంగా సాగే పోరాటంలో తన ప్రాణాలు పోయినా పరవాలేదని స్పష్టం చేశారు. హుసేన్‌ ప్రదర్శించిన ధిక్కారానికీ యజీద్‌ ఆగ్రహించాడు. అతని సైన్యం హజ్రత్‌ హుస్సేన్‌నూ, ఆయన పరివారాన్నీ కర్బలా అనే స్థలం వద్ద అటకాయించింది. వారికి తగడానికి నీరు సైతం అందకుండా ఫరాత్‌ నది ఒడ్డు మీద కాపలా పెట్టింది. అది మొహర్రం మాసం పదోరోజు - శుక్రవారం.



యజీబ్‌ సేనలకూ, హుస్సేన్‌ అనుచరులకూ మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. శత్రువులు వేల సంఖ్యలో ఉండడంతో హుస్సేన్‌ సేనలో చాలామంది మరణించారు. కర్బలా మైదానం వారి రక్తంతో తడిసిపోయింది. చివరకు హుస్సేన్‌ ఒక్కరే మిగిలారు. ఒంటరిగానే శత్రువులతో పోరాడుతూండగా ఆయనకు దాహం వేసింది. నీటి కోసం ఫరాత్‌ నదివైపు నడిచారు. ఈలోగా పిల్లలూ, మహిళలూ తలదాచుకుంటున్న తమ గుడారాలకు శత్రు సైనికులు నిప్పు పెట్టారన్న పుకారు ఆయన చెవిన పడింది. నీరు తాగకుండానే అటువైపు హుస్సేన్‌ పరుగులు తీశారు. గుడారాలన్నీ బాగానే ఉన్నా హుస్సేన్‌ కుమారుడు అలీ అస్గర్‌ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తన కుమారుడికి గుక్కెడు నీళ్ళివ్వమని ప్రత్యర్థులను అర్థించారు. కానీ వారు కనికరం చూపకుండా ఆ బాలునిపై బాణాలు కురిపించారు. ఒక బాణం ఆ పసికందు గొంతులోకి దిగి రక్తం చిమ్మింది. ఆగ్రహించిన హుసేన్‌ శత్రుసైన్యం మీద విరుచుకుపడ్డారు. వారిని నేలకూల్చుతూ ఆయన ముందుకు సాగారు. ఈలోగా నమాజ్‌ సమయం కావడంతో తనకు కాస్త సమయం ఇవ్వాలని శత్రు సైన్యాధికారిని కోరారు. హుస్సేన్‌ సాష్టాంగపడి నమాజ్‌ చేస్తూండగానే శత్రువులు ఆయనపై దాడి చేసి హతమార్చారు. హుస్సేన్‌ శిరస్సునూ, చేతులనూ ఖండించారు. వాటిని బల్లేలకూ, బరిసెలకూ తగిలించి నృత్యాలు చేశారు. విందులు చేసుకున్నారు. 


ఇస్లామీయ రాజకీయ వ్యవస్థకు ఆత్మలాంటి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హుస్సేన్‌ చేసిన త్యాగానికి గుర్తుగా ఆనాటి నుంచీ ముహర్రం మాసంలోని పదో రోజును ఈ మాసం పేరిట మొహర్రంగా ముస్లింలు పాటిస్తారు. ఈ మాసంలో సవార్ల (పీరీలు)కు ముస్లింలు మొక్కుతారు. నిజానికిది సంతాపాన్ని పాటించే రోజు అయినప్పటికీ ‘పీర్ల పండుగ’ అని వ్యవహరిస్తారు. ఈ రోజున హుస్సేన్‌ చేసిన త్యాగానికి ప్రతీకగా మొహర్రం రోజున రక్తాన్ని చిందించడం, గుండెలను బాదుకుంటూ ఊరేగింపు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. పీరీలకు  పూజలు నిర్వహించి, వాటిని పదవ రోజున ఊరేగిస్తారు. భక్తి శ్రద్ధలతో కొలిస్తే కోరిన కోర్కెలను పీరీలు తీరుస్తాయనే విశ్వాసం ఉంది. 


ఎన్నో ప్రత్యేకతలు!

మొహర్రం మాసంలోని పదో రోజైన ‘యౌమె అషురా’కు ఎనలేని ప్రాధాన్యం ఉంది. ప్రథమ దైవ ప్రవక్త స్వర్గంలోకి ప్రవేశించిన రోజు ఇది. అలాగే దైవ ప్రవక్త హజ్రత్‌ నూహ్‌నూ, ఆయన అనుచరులనూ నావలో దైవం రక్షించి, దుష్టులకు బుద్ధి చెప్పిన రోజు. చేప గర్భం నుంచి దైవ ప్రవక్త యూనుస్‌ ఈ రోజే విముక్తి పొందారు. దైవ ప్రవక్తలు మూసాస హజ్రత్‌ ఇబ్రహీంలకు రక్షణ కలిగిన రోజు కూడా ఇదే. ఫిరౌన్‌ రాజునూ, అతని లక్షలాది సైన్యాన్నీ సముద్రపు నీటిలో ముంచేసి... దైవ ప్రవక్త మూసానూ, ఆయన అనుచరుల్నీ కాపాడింది కూడా ఈ రోజునే. హుస్సేన్‌ వీరోచిత మరణంతో పాటు ఇస్లాం మతంలో అనేక చారిత్రాత్మక ఘట్టాలు ఈ రోజే జరిగాయి. ప్రళయం కూడా అషురా రోజే వస్తుందని విశ్వాసం.


- మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2020-08-28T05:30:00+05:30 IST