న్యూఢిల్లీ: నార్వేకు చెందిన క్రూయిజ్ నౌక ఒకటి నడి సముద్రంలో మంచుకొండ (Iceberg)ను ఢీకొట్టింది. అయినప్పటికీ క్షేమంగా బయటపడడంతో అందులోని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన గగుర్పొడిచే వీడియో (Chilling Video) ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 9 రాత్రుల ట్రిప్‌లో భాగంగా నార్వేకు చెందిన సన్ షిప్ (Sun ship) అలాస్కాలోని హుబ్బర్డ్ గ్లేసియర్ (Hubbard Glacier)కు బయలుదేరింది. ఈ క్రమంలో శనివారం అలాస్కా సమీపంలో ఓ ‘గ్రోలర్’ (చిన్నమంచుకొండ)ను నౌక ఢీకొట్టింది. ఆ సమయంలో నౌకలోని వారు భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో కేకలు వేశారు. మంచుకొండను నౌక ఢీకొన్న తర్వాత అది నౌకకు ఒకవైపునకు వచ్చి నీటిపై తేలుతూ కనిపించింది.
గ్రోలర్ (Growler)ను చిన్న మంచుకొండగా పిలుస్తారు. ఇది రెండు మీటర్ల కంటే తక్కువ ఉంటుంది. నీటి ఉపరితలం నుంచి పైకి ఒక మీటర్ వరకు ఉండి తేలుతూ ఉంటుంది. మంచుకొండను నౌక ఢీకొన్న తర్వాత దాని ట్రిప్‌ను రద్దు చేసి వెనక్కి పిలిచారు. ఆ తర్వాత అది క్షేమంగా పోర్ట్ ఆఫ్ జునీయు చేరుకుంది. మంచుకొండను ఢీకొనడంతో నౌక ముందు భాగం కొంత దెబ్బతింది. దీంతో మరమ్మతుల కోసం దానిని హోం పోర్ట్ అయిన సీటెల్‌కు తరలించనున్నారు.
తక్కువ వేగంతో సీటెల్‌కు తిరిగి వచ్చేందుకు అమెరికా కోస్టు గార్డ్ (United States Coast Guard), స్థానిక సముద్ర అధికారులు అనుమతి ఇచ్చినట్టు నార్వేయన్ క్రూయిజ్ లైన్ (NCL) పేర్కొంది. అందులోని పర్యాటకులందరూ సియాటెల్‌లో దిగినట్టు పేర్కొంది. ప్రమాదం కారణంగా ఏ ఒక్కరు గాయపడలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని తెలిపింది.
ఇవి కూడా చదవండి