ముహూర్తం మారింది కేసీఆర్‌ జాతీయ పార్టీ డిసెంబరులో?

ABN , First Publish Date - 2022-09-22T08:21:23+05:30 IST

సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం మారింది! ముందుగా అనుకున్నట్టుగా దసరాకు కాక..

ముహూర్తం మారింది కేసీఆర్‌ జాతీయ పార్టీ డిసెంబరులో?

  • దసరాకు కాదు.. మరో రెండు నెలలు ఆలస్యంగా!
  • రాష్ట్రాల్లో సమావేశాలు, మేధావులతో సమాలోచనలు 
  • జెండా, అజెండా, విధివిధానాలపై తీవ్ర కసరత్తు

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం మారింది! ముందుగా అనుకున్నట్టుగా దసరాకు కాక.. మరో రెండు నెలలు ఆలస్యంగా డిసెంబరులో ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పోరాటానికి సొంత పార్టీ పెడుతున్నట్లు కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. పార్టీ ప్రకటన ఎప్పుడు ఉంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మంచి ముహూర్తం చూసుకుని డిసెంబర్‌ నెలలో ప్రకటించే విధంగా కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు.. వివిధ రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించడం, ఆయా రంగాలకు చెందిన మేధావులతో చర్చలు జరిపి, తాను అనుకున్న అంశాలకు తుది మెరుగులు దిద్దడం.. ఇలా నిత్యం జాతీయ పార్టీకి సంబంధించిన విధి విధానాలపైనే కేసీఆర్‌ పనిచేస్తున్నట్లు సమాచారం. దేశ రాజకీయాలపై కేసీఆర్‌ పక్కా వ్యూహంతో ఉన్నారని.. జాతీయ రాజకీయాల్లోకి  రైతు ఎజెండాతో వెళ్తున్నట్లు పలుసార్లు ప్రకటించినప్పటికీ.. దాంతోపాటు దళిత, గిరిజనుల అంశాన్ని కూడా ఉద్యమ రూపంలో తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారని సమాచారం. 


  కొత్తగా ఏర్పాటు చేయనున్న జాతీయ పార్టీకి సంబంధించి.. జెండా, ఎజెండా (మేనిఫెస్టో), విధి విధానాల రూప కల్పనలో.. సీఎం కేసీఆర్‌ సహా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అంతా సిద్ధం చేసి దసరాకు పార్టీని ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ.. ఇప్పటికి ఇంకా తుది దశకు రాలేదని, కాబట్టి అన్ని విధాలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాక, డిసెంబర్‌లోనే పార్టీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఓ ముఖ్య నాయకుడు తెలిపారు. కాగా.. కేసీఆర్‌ జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సైతం ఇంకా ప్రారంభించలేదని తెలుస్తోంది. ప్రతిపాదిత జాతీయ పార్టీలో టీఆర్‌ఎస్‌ను విలీనం చేసే తీర్మానం కాపీని కూడా ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సి ఉన్నందున.. ఆ అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉందని, కాబట్టి ఆ అంశంపైనా దృష్టి సారించినట్లు సమాచారం.

Updated Date - 2022-09-22T08:21:23+05:30 IST