మోదీ నేతృత్వమే ఒక సంజీవకరణి

ABN , First Publish Date - 2021-01-19T09:48:04+05:30 IST

కొవిడ్‌పై పోరులో మన దేశం విజయం సాధించింది. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే మనకు మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తోంది...

మోదీ నేతృత్వమే ఒక సంజీవకరణి

కొవిడ్‌పై పోరులో మన దేశం విజయం సాధించింది. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే మనకు మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తోంది. గత ఏడాది కరోనా మహమ్మారి మూలంగా నెలకొన్న భయానక పరిస్థితులు ఇప్పుడు ఏ మాత్రం కనిపించడం లేదు. ప్రారంభదశలో మాస్కులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, పిపిఇ కిట్లు, పడకల విషయంలో కొరతను అనుభవించి, ఇతర దేశాలపై ఆధారపడిన  భారత్ అనతికాలంలోనే ఆ కొరతను అధిగమించి స్వయంసమృద్ధిని సాధించింది. కేంద్రప్రభుత్వం మొత్తం బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రజలకు సరైన మార్గదర్శకత్వం అందించింది. 2020 జనవరి 30న భారత్‌లో తొలి కరోనా వ్యాధిగ్రస్థుడిని గుర్తించారు. అయితే అంతకు రెండు వారాల ముందే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. గత ఏడాది జనవరి 17న తొలి అడ్వైజరీని జారీ చేసి విమానాశ్రయాల్లో ప్రయాణీకులను తనిఖీ చేసిన తొలిదేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. జనతా కర్ఫ్యూ వంటివి విధించి ప్రజలను మానసికంగా సన్నద్ధం చేసింది. విదేశాల్లో చిక్కుకున్న వారిని పెద్ద ఎత్తున  భారత్‌కు తరలించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, సామాజిక సంస్థలు అన్నీ ఒకే తాటిపై పని చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ  స్ఫూర్తి నిచ్చారు.  బయోటెక్నాలజీ, ఆరోగ్య , వైద్య మంత్రిత్వశాఖ, నీతీ ఆయోగ్‌తో పాటు అనేక సంస్థల మధ్య సమన్వయాన్ని ఏర్పర్చి వివిధ వర్గాలకు మోదీ సర్కార్ దిశానిర్దేశం చేసింది. దేశంలో మొత్తం వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఏకమై కరోనాను ఎదుర్కొనేందుకు నడుం కట్టారు.  ఈ ఏడాది అంతటా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రధానమంత్రి  ప్రజల మధ్య గడిపారు.  వీటన్నింటి మూలంగా  భారతదేశంలో కరోనా మహమ్మారి అంతరించే క్రమం ఈ సంక్రాంతి నాటికి ప్రారంభమైంది. పంట చేతికి వచ్చాక రైతుల కళ్లలో ఆనందం కనిపించినట్లు దేశంలో కోట్లాదిమంది వాక్సిన్ తీసుకుంటుంటే భారత ప్రజల హృదయాల్లో ఆనందం వెల్లివిరిసింది. వారందరూ కలిసికట్టుగా ఎటువంటి ఘోరవిపత్తునైనా ఎదుర్కోగలమని నిరూపించారు. 


సాధారణంగా వాక్సిన్ తయారీకి అనేక సంవత్సరాలు పడుతుంది. కానీ భారతదేశం ఈ విషయంలో ఎలాంటి జాప్యం చేయదలుచుకోలేదు. ప్రపంచంలో తయారైన మూడు వాక్సిన్‌లలో రెండు వాక్సిన్లను భారతీయ కంపెనీలు కేవలం ఆరునెలల్లోనే ఉత్పత్తి చేసేందుకు కేంద్రం అన్ని రకాల అండదండలు అందించింది. వాక్సిన్ కార్యక్రమంలో అపారమైన అనుభవం ఉన్న బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి విజయ రాఘవన్ కరోనా వాక్సిన్ రూపకల్పనకు కీలక తోడ్పాటును అందించారు. ఆయన సారథ్యంలోనే గతంలో భారతదేశంలో వేలాది శిశువుల మృతికి కారణమవుతున్న డయేరియా నిర్మూలనకు రోటావైరస్ వాక్సిన్ తయారీకి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కరోనా వైరస్  నిర్మూలనకు కోవాగ్జిన్‌ను రూపొందించిన హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీయే రోటావైరస్ వాక్సిన్‌ను ఉత్పత్తి చేసింది. 2015లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొట్టమొదటిసారి దేశీయంగా తయారీ అయిన రోటావైరస్ వాక్సిన్‌ను ప్రారంభించి మార్కెట్లో విడుదల చేశారు. కనుక వాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్‌కు ఉన్న అనుభవం, నైపుణ్యం దృష్టిలో ఉంచుకుని అదే కంపెనీ తయారు చేసిన కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతించింది. పుణేలో ఉన్న మరో కంపెనీ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన ఆస్ట్రాజెనికాతో కలిసి తయారుచేసిన కోవిషీల్డ్‌ను కూడా కేంద్రం అనుమతించడంతో భారత్‌లో తయారైన రెండు వాక్సిన్లు రెండు డోసులుగా తీసుకుంటే దేశ ప్రజలు రోగనిరోధక శక్తిని సంతరించుకుని కరోనా నుంచి పూర్తిగా విముక్తి కాగలుగుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. విదేశాల్లో తయారైన టీకా మందులకంటే మన కంపెనీల టీకామందుల ధర అతి చవక అన్న విషయం తెలుసుకోవాలి. విదేశీ వాక్సిన్ల ధర ఒక డోసుకు రూ. 5వేల వరకు ఉంటే, భారత  కంపెనీలు తమ వాక్సిన్లను ప్రభుత్వానికి దాదాపు రూ.200కే ఇచ్చేందుకు ముందుకు రావడం గొప్ప విషయం. ఈ రెండు కంపెనీలు ఎన్నో ఏళ్ల పాటు పరీక్షలు జరిపి, అనేక ప్రయోగాలు పూర్తి చేసిన అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం పై ఆధారపడి ఈ వాక్సిన్లు రూపొందించాయి.


ఈ నేపథ్యంలో జనవరి 16న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన కొవిడ్ -19 వాక్సినేషన్ ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమమే కాదు, అత్యంత చరిత్రాత్మకమయిన ఘట్టంగా అభివర్ణించవలిసి ఉంటుంది. దేశంలోని  అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో 306 కేంద్రాలను వర్చ్యువల్‌గా అనుసంధానం చేసి 3 కోట్ల మందికి ఎటువంటి హడావిడి లేకుండా  వాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించడం ఒక అపురూప ఘట్టం. ప్రపంచంలోని సుమారు వంద దేశాల జనాభా కంటే ఎక్కువ జనాభాకు మనం అవలీలగా ఒకటి రెండు రోజుల్లోనే వాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాం. మొదటి రోజు వాక్సినేషన్ లభించిన 2 కోట్లమందికి పైగా జనాభాలో కేవలం ముగ్గురు మాత్రమే అస్వస్తతకు గురయి తర్వాత కోలుకోవడంతో వాక్సినేషన్‌పై ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారంలో ఏ మాత్రం పస లేదని స్పష్టమైంది. దుర్మార్గమేమంటే భారత ప్రజలను ప్రయోగశాలల్లో గినీపందుల్లా చూసి వారిపై ప్రయోగాలు చేస్తున్నామని కాంగ్రెస్ ఆరోపించింది. గడచిన సంవత్సరకాలంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు జరిపిన పోరులో  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ మాత్రం విశ్రమించలేదు. ప్రతి దశలోనూ ప్రత్యక్షంగా ఈ పోరాటంలో ఆయన పాల్గొన్నారు. ఆఖరుకు స్వయంగా తాను దేశంలోని ప్రయోగశాలల్ని సందర్శించి శాస్త్రవేత్తలతో మాట్లాడారు. కరోనా వాక్సిన్‌కు సంబంధించిన పుకార్లను, కుట్రలను ఏమాత్రం నమ్మవద్దని ఆయన పదే పదే ప్రజలకు పిలుపునిచ్చారు.  మన వాక్సిన్‌ల పనితీరును అనుమానించడం అంటే, భారత శాస్త్రవేత్తల నైపుణ్యం, వైద్యవిధానాలు, వ్యవస్థాగత యంత్రాంగం, అంతర్జాతీయంగా లభించిన విశ్వసనీయతను శంకించినట్లే అవుతుంది. ఈ విశ్వసనీయతలను ఒకటి రెండు రోజుల్లో వచ్చింది కాదు. అనేక సంవత్సరాల కృషి మూలంగా లభించింది.


మొదటి దశ తర్వాత రెండో దశలో 30 కోట్లమంది ప్రజలకు వాక్సిన్ ఇచ్చే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత దేశమంతటా దశలవారీగా వాక్సిన్ లభిస్తుంది.  ముందుగా కరోనా పోరాటంలో ముందువరుసలో నిలిచిన యోధులకు ప్రాధాన్యతను ఇవ్వాలన్న ప్రధానమంత్రిని అందరూ గౌరవించడం హర్షణీయం. డాక్టర్లు, నర్సులు, ముందు వరుసలో ఉన్న లక్షలాది సిబ్బంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. వీరిలో కొందరు కరోనాపై పోరాటంలో ఇంటికి కూడా తిరిగి వెళ్లలేదు. అందుకే వీరికి ముందుగా వాక్సిన్ వేయించడం వల్ల దేశం వారి సేవలను కృతజ్ఞతాపూర్వకంగా గుర్తించినట్లు అవుతుందని ప్రధానమంత్రి భావించారు. తద్వారా ప్రతి భారతీయుడిలో గల ఆత్మవిశ్వాసాన్ని సడలకుండా చూడడం తన సంకల్పమని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని కూడా రాజకీయం చేశాయి. ముందుగా ప్రధానమంత్రి వాక్సిన్ ఎందుకు తీసుకోలేదని ఒక కాంగ్రెస్ నాయకుడు ప్రశ్నించారు. అదే ప్రధాని ముందుగా వాక్సిన్ తీసుకుని ఉంటే, ఆయన తన ప్రాణాలను ముందుగా కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారన్న విమర్శలు కూడా వచ్చేవి. ప్రధాని పిలువు మేరకు కోట్లాది వైద్య, ఆరోగ్య సిబ్బంది ముందుకు వచ్చి వాక్సిన్ తీసుకునే సరికి ప్రతిపక్షాల నోళ్లు మూత పడ్డాయి. ఈ ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసమే దీపాలు వెలిగించాలని, చప్పట్లు కొట్టాలని ప్రజలను మొదట్లో ప్రధాని ప్రేరేపించిన విషయం మరిచిపోరాదు. మరి వారినే ముందుగా మనం కాపాడుకోవాలని ప్రధాని నిర్ణయించడంలో ఆశ్చర్యం ఏమున్నది?


భారత ప్రజలకు వాక్సిన్ అందించే సువర్ణఘట్టాన్ని ప్రధాని ప్రారంభిస్తూ, ‘దేశమును ప్రేమించుమన్నా’ అని గురజాడ అప్పారావు రాసిన కవితను ఉటంకించి ఆ మహాకవి ప్రతిభను ప్రపంచానికి తెలియజేసి తెలుగువారు గర్వపడేలా చేశారు. దేశమంటే బండరాళ్లు, నీరు కాదని, దేశమంటే ప్రజలని, ఆ ప్రజల కోసం నిస్వార్థంగా రాజకీయాలకు అతీతంగా పని చేయాలని ప్రధాని చెప్పిన మాటలు ఇప్పటికైనా ప్రతిపక్షాలకు వివేకాన్ని తెప్పించాలని కోరుకుందాం.


వై. సత్యకుమార్

బిజెపి జాతీయ కార్యదర్శి

Updated Date - 2021-01-19T09:48:04+05:30 IST