ఆధునిక ద్రోణాచార్యుడు

ABN , First Publish Date - 2021-11-30T06:23:12+05:30 IST

గత యాభైయేళ్ళుగా మన దేశ ప్రాచీన యుద్ధకళలను వేలాది మందికి బోధిస్తున్న మహాగురువు గల్లా ప్రకాశ్‌ రావు. మన పూర్వీకులు కనిపెట్టిన ప్రాచీన విద్యలు బయటికి తెలిసినవాటి కంటే రహస్యంగా...

ఆధునిక ద్రోణాచార్యుడు

గత యాభైయేళ్ళుగా మన దేశ ప్రాచీన యుద్ధకళలను వేలాది మందికి బోధిస్తున్న మహాగురువు గల్లా ప్రకాశ్‌ రావు. మన పూర్వీకులు కనిపెట్టిన ప్రాచీన విద్యలు బయటికి తెలిసినవాటి కంటే రహస్యంగా మిగిలిపోయినవి అనేకం ఉన్నాయి. ఎవరికీ తెలియని విద్యలు, కేవలం గురుపరంపరగా సంక్రమించే విద్యలు అందరికీ తెలిసే అవకాశం లేదు. అలాంటి విద్యలు ఎరిగిన మహాగురువు గల్లా ప్రకాశ్‌ రావు.గత యాభై సంవత్సరాలుగా ప్రాచీన భారత యుద్ధకళలను దేశంలోనూ, విదేశాలలోనూ బోధిస్తున్న మహాగురువు గల్లా ప్రకాశ్‌ రావు.


ప్రతీ దేశానికి అతి ప్రాచీనమైన యుద్ధవిద్యల చరిత్ర ఉంది. చైనా నేడు యుద్ధకళలకు కేంద్రంగా వుంది. మార్షల్‌ ఆర్ట్స్‌ను ఆ దేశం అధికారికంగా గుర్తిస్తుంది. ప్రపంచమంతా కుంగుఫూ, తాయిచీ వంటి విద్యలను వ్యాపార కళలుగా చైనా మార్చేసింది. తద్వారా వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆ దేశం సమకూర్చుకుంటుంది. మన ప్రాచీన విద్యలలో యోగా అంతటి ప్రాచుర్యం పొందింది. అయితే, అసలైన యుద్ధవిద్యలు మన దేశంలోనే పుట్టాయనీ, అవి చైనా సహా యితర దేశాలకు వ్యాపించాయని గల్లా ప్రకాశ్‌ రావు అంటారు. 


యుద్ధవిద్యలు, ఆయుర్వేదం రెండూ అతి ప్రాచీనమైనవి. మన ఇతిహాసాలు, పురాణాలు గొప్ప వీరుల గురించీ, భీకర యుద్ధాల గురించీ తెలుపుతున్నాయి. రామాయణంలో రాముడి ధనుర్విద్య ప్రావీణ్యత, మహాభారతంలో పాండవులు, కౌరవులకు ద్రోణాచార్యుడు నేర్పిన యుద్ధవిద్యలు మనకు తెలుసు. ఏ విద్యనైనా నేర్చుకొనే వాళ్ల శరీరాన్ని బట్టి నేర్పాలనేది గల్లా ప్రకాశ్ రావు అభిప్రాయం. అలాంటి అవగాహన రామాయణ, మహాభారతంలో కనిపిస్తుందని ఆయన అన్నారు. పరశురాముడు గండ్రగొడ్డలి విద్యలో నిపుణుడు. రాముడు విలువిద్యలో అగ్రగణ్యుడు. అర్జునుడికి విలువిద్యను, భీముడికి గదా విద్యను ద్రోణుడు నేర్పాడు. అందరికీ ఒకటే నేర్పటం సాధ్యం కాదు. వాళ్ల శరీరం స్వభావం, వాళ్ళ మానసిక స్థితిని బట్టి విద్యలు నేర్పాలంటాడు గల్లా ప్రకాశ్‌ రావు. మానవ శరీర నిర్మాణం, దాని ధర్మం తెలిసిన గురువులు మాత్రమే సరైన విద్యను నేర్పగలరు. అయితే, యుద్ధకళలు కూడా వ్యాపారంగా మారిన వాతావరణం మనకు కనిపిస్తూనే వుంది. అసలైన విద్యలు ఈ వాతావరణంలో ఎవరికీ కనిపించకుండా పోతున్నాయనేది కూడా నిజం.


బోధి ధర్మ చైనాకు వెళ్ళి కుంగుఫూ, ధ్యానం నేర్పించాడు. అక్కడి ‘షావోలిన్‌ టెంపుల్‌ ఆయన విద్యకు ఆలవాలం. బోధిధర్మ ఆ దేశంలోనే మరణించాడు. అనేక వందల యేళ్ళ తర్వాత మళ్లీ మనదేశంలో కుంగుఫూ గల్లా ప్రకాశ్‌రావు ద్వారా పునరుజ్జీవనం చెందింది. కరాటే బాగా ప్రచారమై వెలిగిపోతున్న కాలంలో గల్లా ప్రకాశ్‌ రావు ఒక్కడే కుంగుఫూ మాస్టర్‌. షావోలిన్‌ టెంపుల్‌ నుండి వచ్చిన గురువు దగ్గర అస్సాంలో కుంగుఫూ నేర్చుకున్నాడు. తనకు పద్దెనిమిదేళ్లు వచ్చేనాటికే కుంగుఫూ మాస్టరయ్యాడు. ఆ రకంగా ఆయన అతిచిన్న వయసులోనే యుద్ధవిద్యలకు అంకితమై పోయాడు.


ప్రాచీన యుద్ధకళల పట్ల అవగాహనను కలిగించేందుకు గల్లా ప్రకాశ్‌ రావు తన రచనా వ్యాసంగం ద్వారా కూడా కృషి చేస్తున్నారు. యుద్ధకళల ప్రచారానికి అంకితమై, ప్రజల ఆరోగ్యం కోసం పరితపిస్తున్న సమాజ హితుడు గల్లా ప్రకాశ్‌రావు. తెలుగువాళ్లు గర్వించదగ్గ మహాగురువు. మన దేశ ఘనమైన వారసత్వ సంపదలో అతికీలకమైన ప్రాచీన యుద్ధకళల పునరుజ్జీవానికి కృషి చేస్తున్న జ్ఞానయోగి. ‘రుద్రమదేవి సేవారత్న నంది అవార్డు’ను ఆయనకు ప్రకటించడం చాలా గొప్ప విషయం. నేడు, రవీంద్రభారతీలో గల్లా ప్రకాశ్ రావుకు రుద్రమ దేవి సేవా రత్న నంది అవార్డు ప్రదానం చేయనున్నారు.

దక్షిణాది శ్రీనివాస్‌ 

Updated Date - 2021-11-30T06:23:12+05:30 IST