సమస్యలపై ఎమ్మెల్యేకు ఏకరువు

ABN , First Publish Date - 2022-08-11T06:36:35+05:30 IST

మండలంలో పేటమాలపల్లిలో తాగునీటికి పలు ఇబ్బందులు పడుతున్నామని, బోరు ఏర్పాటు చేయాలని, శ్రీరాంపురం గ్రామాల్లో పింఛ న్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ను గ్రామస్థులు కోరారు.

సమస్యలపై ఎమ్మెల్యేకు ఏకరువు
రైతు భరోసా నగదు అందలేదని ఎమ్మెల్యే గణేష్‌ తెలియజేస్తున్న మహిళా రైతు

గొలుగొండ, ఆగస్టు 10: మండలంలో పేటమాలపల్లిలో తాగునీటికి పలు ఇబ్బందులు పడుతున్నామని, బోరు ఏర్పాటు చేయాలని, శ్రీరాంపురం గ్రామాల్లో పింఛ న్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ను గ్రామస్థులు కోరారు. మండలంలో బుధవారం గొలుగొండ గ్రామ పంచాయతీ శివారు పేటమాలపల్లి, శ్రీరాం పురం, కొత్తజోగంపేట గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కొత్తజోగంపేట గ్రామానికి చెందిన బీనాతల నాగరత్నానికి మూడేళ్లుగా రూ.27 వేల రైతు భరోసా నగదు జమ అయ్యాయని ప్రభుత్వం అందిస్తున్న పథకాల వివరాలతో పుస్తకాన్ని ఆమెకు ఎమ్మెల్యే అందించారు. రైతు భరోసా నగదు తన ఖాతాలో జమకాలేదని, సమస్య పరిష్కరించాలని ఆమె కోరింది. దీంతో సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు సుర్ల వెంకట గిరిబాబు, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, మండల వైసీపీ అధ్యక్షుడు లెక్కల సత్యనారాయణ, స్థానిక సర్పంచ్‌ చినఅప్పారావు, ఎంపీటీసీ సభ్యురాలు చేపల చినపాప. సర్పంచ్‌లు లోచుల సుజాత, పత్తి రమణ, నాయకులు పెద్దిరాజు, శానాపతి రమేష్‌, తదితరులు పాల్గొన్నారు. కాగా శ్రీరాంపురం గ్రామం నుంచి కొత్తజోగంపేట మీదుగా గొలుగొండకు ఎమ్మెల్యే కారుపై బయలు దేరారు. కొత్తజోగంపేటలో ఇజ్జుపు నాగేశ్వరరావు అనే వ్యక్తి ఎమ్మెల్యే కారును అడ్డగించాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తమ వీధిలో సమస్యలు ఎమ్మెల్యేకు విన్నవించేందుకుగాను కారును అడ్డగించానని పోలీసులకు ఆ వ్యక్తి వివరించాడు.


Updated Date - 2022-08-11T06:36:35+05:30 IST