పద్ధతిలేని మనిషి!

ABN , First Publish Date - 2020-06-05T06:03:59+05:30 IST

‘భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు’ అని వేమన కవి ఏనాడో చెప్పాడు. ఈ సృష్టి శాశ్వతం. మనం ఈ సృష్టికి అతిథులం. మరి... అతిథులన్నవారు అణకువగా ఉండాలి. ఉన్నన్ని రోజులు ఉండి... సృష్టిలో అందాలను ఆస్వాదించి... తదుపరి తరానికి జాగ్రత్తగా అప్పగించాలి. అలా చేస్తున్నామా...

పద్ధతిలేని మనిషి!

‘భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు’ అని వేమన కవి ఏనాడో చెప్పాడు. ఈ సృష్టి శాశ్వతం. మనం ఈ సృష్టికి అతిథులం. మరి... అతిథులన్నవారు అణకువగా ఉండాలి. ఉన్నన్ని రోజులు ఉండి... సృష్టిలో అందాలను ఆస్వాదించి... తదుపరి తరానికి జాగ్రత్తగా అప్పగించాలి. అలా చేస్తున్నామా...?


సౌరభములేల చిమ్ము పుష్ప వ్రజంబు?

చంద్రికల నేల వెదజల్లు చందమామ?

ఏల సలలింబు పారు? గాడ్పేల విసరు?

ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను...

మావిగొన్న కొమ్మను మధుమాస వేళ

పల్లవము మొక్కి కోయిల పాడుటేల?

పరుల తనియించుటకొ? తన బాగు కొరకొ?

గాన మొనరింపక బ్రతుకు గడవబోకో!!

కృష్ణశాస్త్రి

పుష్పాలు ఎందుకు సువాసనలు వెదజల్లుతాయి?... తనకోసమేనా? చంద్రుడు వెన్నెల విరజిమ్మేదెందుకు? ఆయనగారికి మరో పనేం లేదా? నీరు కిందికే పారుతుంది ఎందుకు? పైకి వెళ్లడం చేతకాదా? మావి చిగురు తిన్న కోకిల ఎందుకు తియ్యగా కూస్తుంది? అలా కూస్తేకానీ తనకేమీ తోచదా? ఎందుకు? ఎందుకు? అని కవితాత్మకంగా ప్రశ్నించిన కృష్ణశాస్త్రే చెప్పారు... అది వాటి సహజ స్వభావం అని! ఇక్కడ ఆయనది ప్రకృతి బాధ! ప్రపంచం బాధను తన బాధగా ఆందోళన చెందిన వారు శ్రీశ్రీ అయితే... తన బాధను ప్రపంచ బాధగా ఆలపించిన వారు కృష్ణశాస్త్రి అని నానుడి! ఆ ఇద్దరూ ఇప్పుడు ఉండి ఉంటే... ‘ప్రకృతిని చెడగొట్టి ప్రపంచమంతా బాధపడుతోంది’ అని కవితలు కట్టేవారు కాబోలు! నక్షత్ర కాంతులు ఎందుకు తగ్గాయి? తియ్యగా కూసే కోయిలలు ఎందుకు తగ్గాయి? గలగల పారిన ఏరు ఎందుకు ఎండింది? గాడ్పులు ఎందుకు వేడెక్కాయి? అని ఆవేదన వ్యక్తం చేసేవారేమో! దీనికి కారణం...


మనం, మనుషులమే అని తేల్చేసేవారు కూడా! ఈ సృష్టిలో అంతా పద్ధతి ప్రకారమే జరుగుతుంది. ప్రతి జీవీ ప్రకృతి ధర్మాన్ని పాటిస్తుంది. చీమలు బారులుగానే వెళతాయి. తేనెటీగలు శ్రమించి మధురాన్ని సేకరిస్తాయి. చెట్లు కాలానుగుణంగా ఆకులు రాల్చుతాయి. కొత్త చివుళ్లు తొడుగుతాయి. కానీ... ఒక్క మనిషికి మాత్రమే ఫలానా అనే ఒక ‘పద్ధతి’ లేదు. ఒక్కో మనిషిది ఒక్కో తీరు. ప్రకృతికి నోరు లేదు కాబట్టి మనిషిని నిలదీయలేదు. చేతులు లేవు కాబట్టి... మనిషి చేతలను అడ్డుకోలేదు. ‘ఈ నేల మనదిరో! ఈ నీరు మనదిరో’ అని పాడినప్పుడు... ‘ఈ నేల, నింగి, నీరు మీవి మాత్రమే కాదు! సృష్టిలోని సమస్త జీవ రాశులవీ’ అని గట్టిగా నొక్కి వక్కాణించేవేమో! ‘భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు’ అని వేమన కవి ఏనాడో చెప్పాడు. ఈ సృష్టి శాశ్వతం. మనం ఈ సృష్టికి అతిథులం. మరి... అతిథులన్నవారు అణకువగా ఉండాలి. ఉన్నన్ని రోజులు ఉండి... సృష్టిలో అందాలను ఆస్వాదించి... తదుపరి తరానికి జాగ్రత్తగా అప్పగించాలి. అలా చేస్తున్నామా... లేక, తదుపరి తరాలకు ఆస్తులతోపాటు కొత్త రోగాలు, వేడి గాడ్పులు అందిస్తున్నామా? ఆధునిక మానవుడి దెబ్బకు ప్రకృతి సమస్తం విలవిల్లాడుతోంది కదా! మరీ ఒళ్లు మండితే... ప్రకృతి ఒక్కసారిగా ప్రకోపిస్తుంది. అప్పుడు వలవలా ఏడ్చే మనిషి, మరునాటికి మళ్లీ మామూలే! 


మనిషికి ‘ఆక్రమణ’ అంటే మహా ఇష్టం! కన్ను పడిందంటే దున్నేస్తాడు. మనిషి కాలు పెట్టిన చోట... ఇతర జీవజాలానికి చోటెక్కడ? కరోనా పుణ్యమా అని చెట్టూ, పిట్టా, పులీ పుట్రా తాత్కాలికంగా సంతోషంగా ఉన్నాయి. ఆ మధ్య పచ్చటి అడవిలో నల్లని తార్రోడ్డును దాటుతున్న ఏనుగుల గుంపు దృశ్యాలు కనువిందు చేశాయి. ‘రోడ్డు మీదికి వచ్చిన ఏనుగులు’ అని అంతా అన్నారు. కానీ... ‘మేం రోడ్డు మీదికి రాలేదురా! మీ రోడ్డే మా అడవిలోకి వచ్చింది’ అని ఏనుగులు మౌనంగా ఘీంకరించాయి. అడవులను నాశనం చేసేదీ మనమే! వాటిని పొలాలుగా మార్చేదీ మనమే! ఆహారం కోసం అడవి దాటిన ఏనుగులను తరిమికొట్టేదీ మనమే. ఏనుగులను చంపేందుకు అనాస పండులో పేలుడు పదార్థాలు కూర్చి పెట్టిన వాడినేమనాలి? పశువులు ఇలాంటి క్రూరానికి పాల్పడవు కాబట్టి... కచ్చితంగా ‘మనిషే’ అనాలి.


పాపం... పండును కొరకగానే తొండమూ, నోరు ఛిద్రమైన ఆ ఏనుగు, కడుపులోని గున్న ఏనుగూ రెండూ మరణించాయి. 2015–18 మధ్య మన దేశంలో 373 ఏనుగులు మనిషి కారణంగా మరణించాయట. ఏనుగుల చేతిలో 1713 మంది మనుషులు చనిపోయారు. ఎవరి హద్దుల్లో వారుంటే... ఈ ఘర్షణ ఎందుకుంటుంది? ఈ మనుషులున్నారే... ఎప్పటికీ జంతువులకు అర్థం కారు. పొలాలను ప్లాట్లు చేసి ఇళ్లు కట్టుకుంటారు. ఏ పామో వచ్చిందంటే... పాము ‘ఇంట్లోకొచ్చింది’ అని అరుస్తారు. ‘నాయనలారా... మీ ఇంట్లోకి నేనొచ్చానా! మేమున్న చోట మీరు ఇళ్లు కట్టుకున్నారా!’ అని అడిగేలోపే కొట్టి చంపేస్తారు. నిజమే మరి! ఎవరి ఇంట్లోకి ఎవరు వచ్చినట్లు?


ప్రకృతి మనిషి అవసరాలను తీర్చుతుంది, కానీ... అత్యాశను మాత్రం తీర్చలేదు! అని ఆంగ్లంలో ఒక నానుడి. మంచి మాటలు వింటే మనం మనుషులం ఎందుకవుతాం! ఆశకు, అత్యాశకు, పేరాశకే పోతాం! చేతలకూ, మాటలకూ పొంతనే ఉండదు. అంతా వింత! ఈ విషయం తెలియక మూగజీవాలు మనిషిని నమ్మి మోసపోతుంటాయి. ఆ మధ్య నాగుల పంచమి మరుసటిరోజున పిల్లపాము బిరబిరా పుట్టలోంచి బయటికి బయలుదేరిందట! ‘ఎక్కడికి బుజ్జీ పోతున్నావు’ అని అడిగితే... అలా బయటికెళ్లి పైరగాలి పీల్చొస్తొ అని తల్లికి చెప్పింది. ‘‘పిచ్చి కన్నా! నిన్న పుట్టలో పాలూ, గుడ్లూ వేసి పూజలు చేశారని సంబరపడుతున్నావేమో! ఈరోజు మనిషి కంటపడితే చిన్నపామువైనా పెద్ద కర్రతో కొడతారు’’ అని తల్లిపాము బుజ్జగించి పుట్టలోనే బజ్జోపెట్టింది. లేకుంటే అంతే సంగతులు కదా! మనిషి తెలివైన వాడు కదా! సంప్రదాయాలనైనా, ఆదేశాలనైనా తనకు అనుకూలమైనవి మాత్రమే పాటిస్తాడు.


ఉదాహరణకు... కరోనా సమయంలో ప్రధాని మోదీ గంటలు కొట్టమంటే కొట్టారు. దీపాలు వెలిగించమంటే వెలిగించారు. అదే ప్రధాని మోదీ... మొక్కలు నాటండి. చెట్లు నరకొద్దు. ప్రకృతిని కాపాడండి. పర్యావరణాన్ని రక్షించండి... అని చెప్పి చూడమనండి! ఒక్కడూ వినడు. అంతెందుకు... కరోనా వస్తుంది, భౌతిక దూరం పాటించాలంటే పట్టించుకుంటున్నారా? అదే మోదీ, అదే మనుషులు! ఒకటి చెబితే వింటారు. ఒకటి చెబితే వినరు. కాశీలో గంగను నెత్తిన చల్లుకునేదీ మనిషే! అదే గంగను కలుషితం చేసేదీ మనిషే! మురుగు కాల్వల నుంచి సముద్రం వరకు కొత్త చెత్తను నింపుతూనే ఉంటాడు. కరోనా సమయంలో మూతికి కట్టుకునే మాస్కులూ చేతులకు తొడుక్కునే గ్లవుజులూ ఇప్పుడు సముద్రంలో తేలుతున్నాయంటే... ఎంత ‘చెత్త’ విషయం! వెరసి... మనిషి ఆశాజీవి మాత్రమే కాదు. ఫక్తు అవకాశవాది కూడా! సంఘజీవి మాత్రమే కాదు! తన స్వలాభం కోసం సంఘాన్ని చెడగొట్టే జీవి కూడా! అసలు విషయమేమిటంటే... మనిషికి అన్నీ తెలుసు. జూన్‌ 5... ఈ శుక్రవారం పర్యావరణ దినమని తెలుసు. కానీ... దానిని కాపాడుకునేందుకు ఏమీ చేయడు. ఈ సృష్టిలోని పక్షులు, జంతువులు, నింగి, నేల, నీటికి ‘పర్యావరణం గురించి’ ఏమీ తెలియదు. అందువల్ల... అవి ఏమీ చేయలేవు! పర్యావరణ పరిరక్షణ కోసం కొంత, ఎంతో చేస్తున్న వారెందరో ఉన్నారు. వారు మనుషులు కాదు..... మహానుభావులు! అందరికీ వందనములు!

తొమ్మండ్రు సురేష్‌ కుమార్‌

Updated Date - 2020-06-05T06:03:59+05:30 IST