Abn logo
Oct 28 2021 @ 01:23AM

విలీనం వికంటించే!

ప్రభుత్వంలో విలీనం కానున్న ఒంగోలులోని సెయింట్‌ థెరిస్సా స్కూలు

ఎయిడెడ్‌ స్కూళ్లు ఉండాల్సిందే

బలవంతపు చర్యకు చుక్కెదురు

కోర్టును ఆశ్రయించిన యాజమాన్యాలు

యథాతథంగా ఉంచాలంటూ  మధ్యంతర ఉత్తర్వులు  

డీఈవో కార్యాలయానికి లేఖలు

పాఠశాలలు నిర్వహిస్తామని వస్తున్న కరస్పాండెంట్లు 

ఎయిడెడ్‌ విలీనం వికటించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నిరసనలతో వ్యవహారం రచ్చకెక్కింది. నయానో, భయానో ప్రభుత్వం చాలావరకు ఎయిడెడ్‌ స్కూళ్ల యాజమాన్యా లను విలీనానికి ఒప్పించింది. ఇది రాష్ట్రవ్యాప్తం గా పెనుదుమారం రేపుతుండటంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పోరుబాట పట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బలవంతపు చర్యపై యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్‌ స్కూళ్ల యాజమాన్యాలు తమ పాఠశాలలను తామే నడుపుకుంటామంటున్నా ప్రభుత్వ జోక్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. డీఈవోకు అభ్యంతర పత్రాలను అందజేశారు. సజావుగా సాగిపో తున్న స్కూళ్లను ఇంకేదో ఆశించి ఇలాంటి చర్య లకు దిగుతుందని బాహాటంగానే మండిపడు తున్నారు. ఎయిడెడ్‌ స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు  సైతం ఈ నిర్ణయం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల  క్రితం దాతల సహకారంతో నిలదొక్కుకున్న పాఠశాలలపై ప్రభుత్వం ఈవిధంగా వ్యవహరించడం సరైన చర్య కాదని సామాన్య ప్రజలు సైతం విమర్శిస్తున్నారు.

ఒంగోలు విద్య, అక్టోబరు 27 : ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం బెడిసికొట్టింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో ఎయిడెడ్‌ యాజమాన్యాలు కూడా తిరుగుబాటు జెండా ఎగురవేశాయి. జిల్లాలోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆదేశాలు, అధికార యంత్రాంగం బలవంతపు చర్యలతో ఆరంభంలో విలీనానికి ఆమోదం తెలిపిన యాజమాన్యాలు సైతం ఇప్పుడు నేరుగా డీఈవోను కలిసి దానిని ఉపసంహరించుకుంటామని తేల్చిచెబుతున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఎయిడెడ్‌ పాఠశాలల మూసివేతతో విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట విలీనం చేసేందుకు అంగీకరించి తర్వాత న్యాయస్థానాలను ఆశ్రయించి తద్వారా విలీనం నిలుపుదల ఉత్తర్వులను కొన్ని యాజమాన్యాలు పొందాయి. ఈ నేపఽథ్యంలో ఎయిడెడ్‌ పాఠశాలల విలీన ప్రక్రియలో గందరగోళం నెలకొంది.

 

విలీనానికి 106 పాఠశాలలు అంగీకారం

ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు జిల్లాలోని 106 ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాలు తమ స్కూళ్లను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఆమోదం తెలిపాయి. వీటిలో 98 యాజమాన్యాలు కేవలం ఉపాధ్యాయులను, బోధనేతర సిబ్బందిని మాత్రమే విలీనానికి ఆమోదం తెలిపాయి. మిగిలిన ఎనిమిది మాత్రం మాత్రం పాఠశాల ఆస్తులతో సహా ఉపాధ్యాయులను ప్రభుత్వంలో కలిపేందుకు సమ్మతించాయి.  


ఇతర పాఠశాలలకు 4 వేలమంది పిల్లలు 

ప్రభుత్వంలో విలీనానికి ఆమోదం తెలిపిన 85 ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న 4వేల మంది విద్యార్థులను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేసే ప్రక్రియ మొదలైంది. అయితే తల్లిదండ్రుల ఆమోదం కోసం ఉపాధ్యాయులను వారి ఇళ్లకు పంపుతున్నారు. మీ విద్యార్థులు టీసీలు తీసుకోవాలంటూ వారు అడుగుతుం డటంతో తల్లిదండ్రులకు విషయం అర్థమైంది. ప్రభుత్వం నిర్ణయంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో ఉన్న స్కూలును కాదని ఎక్కడో దూరం గా ఉన్న స్కూల్‌కు ఎలా మార్చుతామంటూ అడ్డం తిరుగుతున్నారు. ఉదాహరణకు టంగుటూరు మండలం రాయవారిపాలెం ఎయిడెడ్‌ పాఠశాల విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు సర్దుబాటు చేయాలంటే ఆ పిల్లలు కనీసం 3 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఒంగోలు నగరం నడిబొడ్డున ఉన్న ఆర్సీఎం మేనేజ్‌మెంట్‌లో ఉన్న సెయింట్‌థెరిస్సా హైస్కూలు, ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కిలో మీటరు దూరంపోతే కానీ మరో పాఠశాలకు చేరుకోలేని పరిస్థితి. ఎయిడెడ్‌ పాఠశాలల మూసివేతతో విద్యార్థు లకు తీవ్ర కష్టాలు ఎదురవుతున్నాయి. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోకుండా ప్రభుత్వం ఎయిడెడ్‌ పాఠశాల మూసివేత నిర్ణయం తీసుకోవడం దురదృష్ణకరమని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎయిడెడ్‌ పాఠశాలలను యథాతథంగా కొనసాగించి తమపిల్లలకు అందుబాటులో చదువులు అందేలా చర్యలు తీసుకోవాలని  తల్లిదండ్రులు కోరుతున్నారు. 


కోర్టును ఆశ్రయించిన యాజమాన్యాలు 

ప్రభుత్వంలో ఉపాధ్యాయులను విలీనం చేసేందుకు మొదట అంగీకరించిన యాజమాన్యాలు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించాయి. భయపెట్టి బలవంతంగా తమ పాఠశాలలు లాక్కుంటున్నారని, ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు జారీచేసిన ఉత్తర్వులను కొట్టి వేయాలని వారు కోర్టును అభ్యర్థించారు. స్పందించిన న్యాయస్థానం ఈ పాఠశాలలను యథాతథంగా నిర్వహించేందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలాఉండగా తమ ఆధ్వర్యంలోని 22 పాఠశాలలను గంపగుత్తగా ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అంగీకారం తెలిపిన ఆర్‌సీఎం యాజమాన్యం తర్వాత మనసు మార్చుకొని పాఠశాల నిర్వహణకు ముందుకొచ్చింది. దీంతో విషయం తెలిసి పాఠశాల విద్య డైరెక్టర్‌ ఆ యాజమాన్యంతో చర్చలు జరిపి ప్రభుత్వంలో విలీనానికి తిరిగి వారిని ఒప్పించడం గమనార్హం. అదేవిధంగా మరికొన్ని యాజమాన్యాలు కూడా తమ పాఠశాలలను నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి.  ఈ మేరకు డీఈవోకు అభ్యర్థన లేఖలను అందజేస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు తమను మొదట భయభ్రాంతులకు గురిచేయడంతో తాము అంగీకరించామని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు వాపోతున్నాయి.