Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

కరుణించని వరుణుడు

twitter-iconwatsapp-iconfb-icon
కరుణించని వరుణుడు

జిల్లాలో ఆశించన మేర కురవని వర్షాలు

ఎండుతున్న పంటలు

ఆందోళనలో అన్నదాతలు

బోర్ల సాయంతో పంటలను కాపాడుకుంటున్న జిల్లా రైతులు

నిజామాబాద్‌, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వానాకాలం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా ఇప్పటికీ చెప్పుకోదగ్గ వర్షాలు కురవక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం మొదలైనా సగటు వర్షపాతం నమోదు కాలేదు. చెదురు మొదురు జల్లులు, ఓ మోస్తార్‌ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల ఆశలతో పంటలు వేస్తున్న రైతులు సకాలంలో వానలు పడకపోవడంతో ఇబ్బం దులు పడుతున్నారు. బోర్లను వినియోగిస్తూ పంటలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సీజన్‌ మొదలై నెలరోజులు దగ్గరపడుతున్న ఇప్పటి వరకు మాత్రం అన్ని మండలాల్లో గత సంవత్సరంలాగా వర్షాలు పడలేదు. నదులతో పాటు వాగులు పొంగలేదు. అయితే జిల్లాలో భూగర్భ జలాలు ఉండ డంతో ఎక్కువ మొత్తంలో రైతులు పంటలను వేస్తున్నారు. 

ఓ మోస్తారు వర్షాలు..

జిల్లాలోని కొన్ని మండలాల పరిధిలో ఓ మోస్తారు వర్షాలు పడుతున్నా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో సగటు వర్షపాతం నమోదు కాలేదు. కొన్ని మండలాల్లో సగటు వర్షపాతం కన్న తక్కువగా వర్షం పడింది. జిల్లాలో ప్రతి సంవత్సరం 1042మి.మీలకు పైగా వానాకాలంలో వర్షం పడుతుంది. జూన్‌ నుంచి అక్టోబరు వరకు వర్షం నమోదవుతుంది. జూన్‌ ఆరంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 150.5 మి.మీల వర్షం పడాల్సి ఉండగా ప్రస్తుతం 121.4 మీ.మీల వర్షం పడింది. జిల్లాలోని 5మండలాల పరిధిలో మాత్రమే సగటు వర్షపాతానిమి మించి వర్షం పడింది. బాల్కొండ, మోర్తాడ్‌, జక్రాన్‌పల్లి, నవీపేట మండలాల పరిధిలోనే సగటుకంటే ఎక్కువ వర్షం పడింది. జిల్లాలోని 10 మండలాలు కోటగిరి, కమ్మర్‌పల్లి, ఆర్మూర్‌, రేంజల్‌, నందిపేట, డిచ్‌పల్లి, వర్ని, మాక్లూర్‌, ముప్కాల్‌, ఎడపల్లి మండలాల పరిదిలో సగటు వర్షపాతం పడింది. జిల్లాలోని ధర్పల్లి, వేల్పూర్‌, బోదన్‌, మెండోరా, చందూర్‌, ఏర్గట్ల, రుద్రూర్‌, భీంగల్‌, సిరికొండ, నిజామాబాద్‌ సౌత్‌, నార్త్‌,  మోపాల్‌ మండలాల పరిధిలో సగటుకంటే తక్కువ వర్షం పడింది. జిల్లాలో ఇందల్‌వాయి, మోస్రా మండలాల్లో అతి తక్కువగా వర్షం పడింది. గత సంవత్సరం జూన్‌ నెలలోనే భారీ వర్షాలు పడగా ఈ సంవత్సరం మాత్రం తక్కువ వర్షం పడింది. నైరుతి ఋతుపవనాల్లో కదలిక లేకపోవడం వల్ల ఈ సంవత్సరం అనుకున్నవిధంగా వర్షాలు పడలేదు. వాగులు, మంజీరా, గోదావరి కూడా వరద రావడంలేదు. ఎగువ ప్రాంతంలో పడే వర్షాల వల్ల స్వల్ప వరద కొనసాగుతోంది.  ఎస్సారెస్పీకి జూన్‌ ఆరంభం నుంచి ఇప్పటి వరకు 3.913 టీఎంసీల నీళ్లు వచ్చాయి. గత సంవత్సరం ఇదే సమయానికి 7 టీఎంసీల వరకు నీళ్లు వచ్చి చేరాయి. జిల్లాలో 20 శాతానికి పైగా చెరువుల్లో నీళ్లు చేరాయి.

భారీ ఆశతో పంటల సాగు..

జిల్లాలో జూన్‌ ఆరంభం నుంచే రైతులు భారీ వర్షాల ఆశతో పంటల సాగు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు సుమారు లక్షన్నర ఎకరాల్లో పంటలను వేశారు. ప్రతి రోజూ ఈ పంటల విస్తీర్ణం పెరుగుతోంది. ఆరుతడి పంటలతో పాటు వరినాట్లను కొనసాగిస్తున్నారు. సోయా, మొక్కజొన్న, పసుపు, కంది, పెసర సాగు కొనసాగిస్తున్నారు. వీటితో పాటు కూరగాయల సాగుకు మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో భూగర్భ జలాలు అందుబాటులో ఉండడంతో ఎక్కువ మంది రైతులు ఈ పంటలను వేస్తున్నారు. గత సంవత్సరంలాగానే జూన్‌ నుంచి భారీ వర్షాలు పడతాయని ఆశతో ఈ పంటలను సాగుచేస్తున్నారు. అయితే భూగర్భ జలాలు ఉన్నా.. వర్షాలు భారీగా పడకపోవడం, ఎండలు కూడా ఉండడంతో వేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బం దులు పడుతున్నారు. కొన్నిచోట్ల డ్రిప్‌, స్ర్పింక్లర్‌ల ద్వారా నీటిని అందిస్తుండగా మరికొన్ని చోట్ల నేరుగానే నీటిని పెడుతున్నారు. వరిసాగు చేస్తు న్న రైతులు తమకున్న భూముల్లో ముందు కొన్ని ఎకరాలు నాట్లు వేస్తూ భారీ వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కొన్నిచోట్ల నకిలీ విత్తనాల వల్ల సోయా మొలకెత్తలేదు. మోర్తాడ్‌, వేల్పూర్‌, కమ్మర్‌పల్లి మండలా ల పరిధిలో వం ద ల ఎకరాల్లో మొ లవకపోవడం తో రైతులు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. 

 నేటి నుంచి రైతుబంధు

జిల్లాలో మంగళవారం నుంచి రైతు బంధును రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. జిల్లాలో గత యాసంగిలో వచ్చిన రైతులతో పాటు కొత్త రైతులకు కూడా అవకాశం ఇవ్వనున్నారు. విడతల వారీగా రైతుల ఖాతాలో నేటి నుంచి ఈ డబ్బులను జమచేయనున్నారు. మొదట సన్న, చిన్నకారు రైతుల్లో ఈ డబ్బులు జమకానున్నాయి. జిల్లాలో ఎకరంలోపు ఉన్న రైతులకు నేడు ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి. ఎకరంలోపు ఉన్న రైతులవి పూర్తికాగానే 2 ఎకరాలు అదే రీతిలో పెంచుతూ ఈ డబ్బులను ఖాతాలో ట్రెజరీ ద్వారా జమచేయనున్నారు. జిల్లాలో వానాకాలంలో మొత్తం 2లక్షల 74వేల 522 మంది రైతుల ఖాతాలో ఎకరాకు 5వేల చొప్పున పెట్టుబడి కింద ఈ డబ్బులు జమచేస్తారు. గత యాసంగిలో జిల్లాలో 2లక్షల 54వేల 774 మంది రైతులకు ఖాతాల్లో 266.15 కోట్లను జమచేశారు. ఈ వానాకాలం సీజన్‌లో కూడా కొత్త రైతులను కలుపుకుని ఈ డబ్బులు జమకానున్నాయి. గత రెండు సీజన్‌లో రాని రైతులు ఈ మధ్యనే భూమి పట్టాలు పొందిన వారు జూలై10 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. వారు దరఖాస్తు చేసుకున్న రీతిలో వారి ఖాతాలో డబ్బులు జమకానున్నాయి. జిల్లాలో ఏ రైతుకైనా సమస్య ఉండి డబ్బులు జమకాకపోతే జిల్లా  వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే పరిస్కరిస్తామని శాఖ అధికారులు తెలిపారు. కొత్త రైతులు నిర్ణీత షెడ్యూల్‌కు అనుగుణంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.