మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించాలి

ABN , First Publish Date - 2021-02-26T03:37:04+05:30 IST

జిల్లాలోని పాఠశాలలు, అంగన్‌వాడీల్లో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ తిరుమల్‌రెడ్డి ఆదేశించారు.

మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించాలి
మాట్లాడుతున్న ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ తిరుమల్‌రెడ్డి

-రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ తిరుమల్‌రెడ్డి

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి25: జిల్లాలోని పాఠశాలలు, అంగన్‌వాడీల్లో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ తిరుమల్‌రెడ్డి ఆదేశించారు. జాతీయ ఫుడ్‌ సెక్యూరిటీ చట్టం 2013పై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాల యంలో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మిలతో కలిసి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ, పౌర సరఫరాల శాఖ, కేసీఆర్‌ కిట్‌ మెటర్నటీ విభాగం అనేవి ఫుడ్‌ సెక్యూరిటీ కిందికి వస్తాయని తెలిపారు. వీటిలోని అంశాలను చర్చించడానికి గ్రామ, మండల, జిల్లా పరిషత్‌ సమావేశాలలో ప్రత్యేకంగా సమయం కేటాయించాలని సూచించారు. చట్టం ప్రకారం ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకలితో ఉండకూడదన్నారు.   పంచాయతీ, మండల, జిల్లా స్థాయిలో విజిలెన్స్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో కమిటీ చైర్మన్‌గా కలెక్టర్‌ వ్యవహరిస్తారని, కోచైర్మన్‌గా జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉంటా రన్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి సరుకులను మండలాల వారీగా నమునాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖా ధికారులను ఆదేశించారు. కేసీఆర్‌ కిట్‌కు సంబంధించి జిల్లాలో ముగ్గురు పిల్లలు ఉన్న గిరిజనులు కూడా అర్హులే అనే విషయాన్ని జీవో విడుదల అయినప్పటికీ అనేక మందికి ఈ విషయం తెలియక పోవడం ఏమిటని ప్రశ్నించారు. జిల్లాలో జనన మరణాలు ఎప్పటికప్పుడు నమోదు చేసి దాని ప్రకారం రేషన్‌ కార్డులు పంపిణీ ప్రక్రియ ఉండాలని ఆదేశించారు. విద్యార్థులకు సరైన ఆహారం అందిం చకుండా నిర్లక్ష్యం వహించినందుకు బెజ్జూరు మండలం సోమిని ప్రధానోపా ధ్యాయుడిని అక్కడి నుంచి తప్పించినట్లు తెలిపారు. 

జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలోని అనేక అంగన్‌వాడీ సెంటర్లకు సొంత భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భవనాలకు నిధులు మంజూరు చేసేలా చూడాలన్నారు. నాలుగు నెలల నుంచి అంగన్‌వాడీలకు సరుకులు రావడం లేదనే విషయాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ కమీషనర్‌ దృష్టికి తీసుకు పోయినట్లు వివరించారు. రేషన్‌ కార్డులకు ఆధార్‌ లింక్‌ చేయడం వల్ల అనేక మంది మారు మూల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆధార్‌ లింకు లేకుండా రేషన్‌ ఇచ్చేలా చూడాలని కమిషన్‌ చైర్మన్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ సభ్యులు గోవర్ధన్‌రెడ్డి, భారతి, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, డీఆర్‌ఓ సురేషన్‌, సీఈఓ సాయగౌడ్‌, ఆర్డీవోలు దత్తు, చిత్రు, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, విద్యాశాఖ, పౌర సరఫరాల శాఖ, వైద్య శాఖ ఉన్నతాధికారులు, అన్ని మండలాల తహసీల్దార్‌లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-26T03:37:04+05:30 IST