దేశంలో కొవిడ్‌ కట్టడి.. వైద్యరంగం చలువే

ABN , First Publish Date - 2021-11-28T09:18:09+05:30 IST

ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలను పాటించే విషయంలో భారత వైద్యులు ముందంజలో ఉన్నారని కాళోజీ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌, ప్రొఫెసర్‌ బి.కరుణాకర్‌ రెడ్డి పేర్కొన్నారు.

దేశంలో కొవిడ్‌ కట్టడి.. వైద్యరంగం చలువే

కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌ రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలను పాటించే విషయంలో భారత వైద్యులు ముందంజలో ఉన్నారని కాళోజీ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌, ప్రొఫెసర్‌ బి.కరుణాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో అస్పత్రి ఆవరణలో శనివారం ఏర్పాటుచేసిన అపోలో మెడికల్‌ కాలేజీ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతికూల పరిస్థితుల్లో ప్రైవేటు హెల్త్‌కేర్‌ను డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డి ప్రారంభించి, విజయతీరాలకు చేర్చి ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు ఇప్పటికీ కొవిడ్‌ను ఎదుర్కొంటుంటే.. మనదేశంలో అలాంటి పరిస్థితులు లేకపోవడం వైద్యరంగం చలువేనన్నారు. అనంతరం అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ డా.ప్రతాప్‌ సి.రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం మెడికల్‌ టూరిజాన్ని ప్రోత్సహించగలిగితే భారతదేశం ప్రపంచ ఆరోగ్య సంరక్షణ సేవల గమ్యస్థానంగా మారుతుందన్నారు. వైద్య పరిజ్ఞానానికి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌లను జోడించి వర్చువల్‌ రియాలిటీ వంటి అధునాతన పరిజ్ఞానాల సహాయంతో వ్యాధులకు సరికొత్త నివారణ మార్గాలు కనుగొనవచ్చని అపోలో హాస్పిటల్స్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ సెక్రెటరీ డాక్టర్‌ సంగీతారెడ్డి తెలిపారు. ఈసందర్భంగా 2014, 2015 సంవత్సరాల్లో అపోలో మెడికల్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన 200 మందికిపైగా విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. 2014 బ్యాచ్‌కు చెందిన డాక్టర్‌ కీర్తన, 2015 బ్యాచ్‌కు చెందిన డాక్టర్‌ గణే్‌షరెడ్డిలకు ‘డా.ప్రతాప్‌ సి.రెడ్డి గోల్డ్‌ మెడల్‌’ను స్వయంగా డా.ప్రతాప్‌ సి.రెడ్డి అందజేశారు. 

Updated Date - 2021-11-28T09:18:09+05:30 IST