ట్రిబుల్‌ ‘టి’ ఏమైంది?

ABN , First Publish Date - 2022-01-25T07:14:37+05:30 IST

మూడో వేవ్‌లో అందరినీ తాకుతున్నది ఒమైక్రాన్‌ వేరియంట్‌ అవునో కాదో తెలియదు కానీ, బాధితుల ప్రాణాలకు మాత్రం ముప్పు తేవడం లేదు.

ట్రిబుల్‌ ‘టి’ ఏమైంది?
రుయాస్పత్రి ముందు పరీక్షల కోసం ఎగబడుతున్న జనం

కొవిడ్‌ కట్టడికి చర్యలు శూన్యం


పట్టించుకోని ప్రజాప్రతినిధులు


మొక్కుబడిగా అధికార యంత్రాంగం


తిరుపతి సిటీ, జనవరి 24: మూడో వేవ్‌లో అందరినీ తాకుతున్నది ఒమైక్రాన్‌ వేరియంట్‌ అవునో కాదో తెలియదు కానీ, బాధితుల ప్రాణాలకు మాత్రం ముప్పు తేవడం లేదు. ఈ ఒక్క కారణంతో కొవిడ్‌ నియంత్రణను గాలికొదిలేశారు.ప్రాణాలు తీయని కొవిడ్‌ కోసం అనవసర వ్యయప్రయాసలు ఎందుకనుకున్నారేమో కానీ వైరస్‌ కట్టడికి కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. తొలి రెండు వేవ్‌ల సమయంలో తీసుకున్న చర్యలకు, ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరుకు పొంతనే లేదు. పాలకపెద్దలు పట్టనట్లు ఉండడంతో జిల్లాలోని ప్రజా ప్రతినిధులు కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో గతంలోలా భాగం కావడం లేదు. వీరు పట్టించుకోకపోవడంతో అధికార యంత్రాంగం కూడా హడావుడి చేయడం లేదు. వీరితో నిమిత్తం లేకుండా కొవిడ్‌ వైరస్‌ మాత్రం రోజురోజుకీ అల్లుకుంటూ పోతోంది. కరోనా తొలి రెండు వేవ్‌ల కాలంలో అన్ని విభాగాల అధికారులు పరుగుల మీదే పనిచేశారు. సిబ్బందితో పని చేయించారు. ప్రజాప్రతినిధులు సైతం వారి నియోజకవర్గాల్లో నిరంతరం సమీక్షలు చేస్తూ, లోటుపాట్లు గుర్తిస్తూ, అధికార యంత్రాంగానికి అండగా నిలుస్తూ పరుగులు పెట్టించారు. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆదేశాలను జారీ చేస్తూ వైరస్‌ కట్టడికి కఠిన చర్యలే తీసుకున్నది. కొవిడ్‌ నియంత్రణకు గతంలో అనుసరించిన ట్రిబుల్‌ ‘టి’ ( టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌) విధానాన్ని మూడో వేవ్‌లో ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావడం లేదు.


గతంలో...

టెస్ట్‌లు: తొలి రెండు వేవ్‌ల్లో టెస్ట్‌లు విస్తృతంగా చేశారు. ప్రతి రోజూ ఈ సంఖ్యను పెంచుతూ పోయారు.

ట్రేసింగ్‌: టెస్ట్‌ల్లో పాజిటివ్‌ అని తేలిన వెంటనే వారి కాంటాక్ట్‌లను ట్రేస్‌ చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసేవారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించి కొవిడ్‌ కేంద్రాలకు తరలించారు. లేదా ఇళ్లలోనే ఉండేలా చూసేవారు. ఇందు కోసం పాజిటివ్‌లు ఉన్న ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించి, రాకపోకలు నియంత్రించారు. 

ట్రీట్‌మెంట్‌: పాజిటివ్‌ అయినవారికి జాగ్రత్తలు చెప్పి మందులు ఇచ్చేవారు.కాస్త నలతగా ఉంటే ఆస్పత్రులకు తరలించి అన్ని పరీక్షలూ చేసేవారు.పూర్తిగా నయమయ్యాక మాత్రమే ఇళ్లకు పంపేవారు. కొవిడ్‌ కేంద్రాల్లోనూ, ఆస్పత్రుల్లోనూ పోషకాహారం ఇచ్చేవారు. ఇందుకోసం ఖర్చుకు వెనకాడేవారు కాదు. ఇటువంటి సందర్భంలోనే ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి దాతల సాయంతో కావలసినవి ఏర్పాటు చేసేవారు.

కఠిన నిబంధనలు: లాక్‌డౌన్‌లతో స్తంభింపజేశారు. కర్ఫ్యూలు విధించారు.విద్యాసంస్థలు మూసేశారు. ఆంక్షలు పెట్టి దుకాణాల వేళలు నియంత్రించారు.మాస్క్‌ లేకపోతే జరిమానాలు వేశారు. వేళదాటి తిరుగుతుంటే కఠినంగా హెచ్చరించారు.గుంపులు కడితే కేసులు పెట్టారు. భౌతికదూరం పాటించండని పదే పదే హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు సైతం వీధుల్లో తిరుగుతూ కొవిడ్‌ నిబంధనలు పాటించండంటూ ప్రజలను వేడుకునేవారు. 


ప్రస్తుతం...

టెస్టింగ్‌: వెంటబడ్డా టెస్ట్‌లు చేయడం లేదు.   సాధారణ జ్వరమో, జలుబో ఉంటుందని రెండు మూడు రోజులు మందులు వాడి అప్పటికీ తగ్గకపోతే అప్పుడు రాండని చెప్పి పంపేస్తున్నారు. తిరుపతిలో రుయా, మెటర్నటీ ఆస్పత్రుల సూపరిటెండెంట్లు బహిరంగంగానే పూర్తి లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేస్తామంటున్నారు.అధికారికంగానే ప్రభుత్వ పీహెచ్‌సీలో రోజుకి పది టెస్ట్‌లకు మించి చేయద్దని ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లాస్థాయి ఆసుపత్రుల్లోనూ 40 కి మించి చేయడం లేదు. 


ట్రేసింగ్‌:   

వైరస్‌ ఎవరి నుంచి ఎలా సోకిందనే ఆలోచనే వదిలేశారు.ఇంట్లో ఒక్కరికి పాజిటివ్‌ వచ్చినా మిగిలిన వారికి పరీక్ష చేయడం లేదు. ‘మీరు కూడా స్వీయ నిర్భంధంలో ఉంటే చాలు’ అని ప్రభుత్వ  మార్గదర్శకాలను ఉదహరించి ఉన్నతాధికారులే చెబుతున్నారు. అదే విషయాన్ని ఆస్పత్రుల ముందు నోటీసుల్లో కూడా పెడుతున్నారు. 

ట్రీట్‌మెంట్‌: ఒమైక్రాన్‌తో ముప్పు లేదు. మామూలుగా వచ్చే జలుబూ, జ్వరం వంటిదే. ఇంట్లోనే ఉండి మందులు వేసుకోండి అని ప్రచారం చేస్తున్నారు.ఆస్పత్రులకు వచ్చినా జ్వరం మాత్రలు ఇచ్చి పంపేస్తున్నారు. సీఆర్జీలు, డి-డైమర్‌లు పెరిగినా మందులు రాసిచ్చేసి తగ్గిపోతుందని చెబుతున్నారు.  ఊపిరి అందక అవస్థపడే స్థితిలో ఉన్నవారిని మాత్రమే ఆస్పత్రుల్లో చేర్చుకుంటున్నారు. కొవిడ్‌ కేంద్రాలే అరకొరగా తెరిచారు. తెరిచిన వాటిలోనూ, ఆస్పత్రుల్లోనూ భోజనం దారుణంగా ఉంటోంది. దీంతో బాధితులు ఇళ్లనుంచి తెప్పించుకుని తింటున్నారు. 

నిబంధనలే లేవు: ఇప్పుడు కొవిడ్‌ నిబంధనలు కాగితాల్లో తప్ప కనిపించడం లేదు. పార్టీల మీటింగుల్లో వందలు, వేలమంది గుంపులు కడుతున్నారు. ఒకప్పుడు ప్రజలను వేడుకున్న నాయకులే కబడ్డీ క్రీడలంటూ జనాన్ని పోగేస్తున్నారు. మాస్క్‌ ధరించకుండా బైకుల మీద ముగ్గురేసి తిరుగుతున్నా ఆపి ఆడిగేవారు లేరు. టీచర్లకు, పిల్లలకు వైరస్‌ వ్యాపిస్తున్నా బడులు నడుస్తున్నాయి. కొవిడ్‌ నిబంధనల అమలు బాధ్యత అసలు తమది కాదన్నట్టుగా పోలీసు యంత్రాంగం ఉంది. 


ప్రతి ఇద్దరిలో ఒకరు పాజిటివ్‌

 జిల్లాలో వారం రోజులుగా కొవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పరీక్ష చేసిన ప్రతి ఇద్దరిలో ఒకరు పాజిటివ్‌ అని తేలుతోంది. శనివారం ఒక్క రోజే జిల్లాలో 3008 పరీక్షలు చేయగా 1566 పాజిటివ్‌  కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్‌  కేసుల సంఖ్య 10,973కి చేరింది.గడిచిన వారం రోజుల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా 20,556 పరీక్షలు చేయగా 12,426 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.తిరుపతి అర్భన్‌ పరిధిలోనే రోజూ దాదాపు 500 కేసులు నమోదవుతున్నాయి.  సాధారణ లక్షణాలతో, అనధికారికంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో పరీక్షలు చేసుకుని పాజిటివ్‌ వచ్చినా బయట తిరుగుతున్న వారి సంఖ్య లెక్కకు మిక్కిలిగా ఉంది. 

Updated Date - 2022-01-25T07:14:37+05:30 IST