తదనంతరం అంటే...

ABN , First Publish Date - 2021-09-17T05:30:00+05:30 IST

లౌకిక ప్రపంచంలోని ప్రతి కుటుంబంలో ‘తదనంతరం’ అనే మాట వినబడుతూనే ఉంటుంది. ‘నా తరువాత జరగాల్సిందేమిటి?’ అనే ప్రశ్న ప్రతి మనిషిలోనూ ఉత్పన్నం అవుతుంది. ముఖ్యంగా స్థిరాస్తులున్న చోట ఇది చర్చనీయాంశంగా...

తదనంతరం అంటే...

లౌకిక ప్రపంచంలోని ప్రతి కుటుంబంలో ‘తదనంతరం’ అనే మాట వినబడుతూనే ఉంటుంది. ‘నా తరువాత జరగాల్సిందేమిటి?’ అనే ప్రశ్న ప్రతి మనిషిలోనూ ఉత్పన్నం అవుతుంది. ముఖ్యంగా స్థిరాస్తులున్న చోట ఇది చర్చనీయాంశంగా మారుతుంది. సర్వసాధారణంగా ప్రతి మనిషి తాను కష్టపబడి సంపాదించినది పిల్లలకు చెందాలనుకుంటాడు. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం ధన సంపాదనే ముఖ్య కర్తవ్యంగా జీవితాంతం శ్రమపడతాడు. ఆ కృషికి తగినట్టు పిల్లలు ప్రయోజకులు, నిస్వార్థపరులు, బుద్ధిమంతులు అయితే అతని శ్రమను గుర్తిస్తారు. వారికి వృద్ధాప్యంలో లోటు లేకుండా, ప్రశాంతంగా జీవించేలా చూస్తారు. వారి ఆశీస్సులు అందుకుంటారు. తండ్రులు తమ తదనంతరం ఆస్తిపాస్తులను వారికి వీలునామా రాస్తారు. తల్లితండ్రులపై ఆధారపడని పిల్లలు కూడా వారి తదనంతరం ఆస్తిపాస్తులు తమవే అని నిశ్చింతగా ఉంటారు. తల్లితండ్రుల సంరక్షణ బాధ్యత తీసుకున్నట్టు నటిస్తూ, వారి దగ్గర ఉన్నవన్నీ తీసుకొని, నడిరోడ్డుపై వదిలేసే పిల్లలు ఉన్నారు. తల్లితండ్రుల మరణాల కోసం ఎదురుచూసే పిల్లలు కూడా మనకు కనిపిస్తారు. ఈ ధనసంపదలు, పదవులు శాశ్వతం కావని ప్రతి ఒక్కరికీ తెలుసు. 

అయితే, తన ఆత్మ గురించి విస్మరించి, దేహం, దేహపరమైన సంబంధాల్లోనే బుద్ధిని చొప్పించి, వ్యామోహంలో ఉండే మానవుడు ‘తదనంతరం’ అనే మాటలోని సూక్ష్మమైన అర్థం తెలియక బాధపడుతూ ఉంటాడు. తాను పుణ్యకర్మలు చేసి సంపాదించుకున్న ఫలమే తప్ప... ఏదీ, ఎవరూ తన వెంట రారని తెలిసి కూడా ‘తదనంతరం’ అంటూ అందరి గురించీ ఆలోచిస్తూ, ఆత్మ జాగృతి పొందలేని దుస్థితికి దిగజారుతాడు. బతికినంతకాలం తానొక చైతన్యవంతమైన, నాశనంలేని ఆత్మనని మరచిపోతాడు. దైహిక భ్రమలో ఉంటూ, మరణానంతరం తన వెంట ఏమీ రాదని చివర్లో తెలిసి పశ్చాత్తాపం చెందుతాడు.  జీవితమంతా అలజడులతో గడిపిన వ్యక్తి అంతిమ క్షణాల్లో సుఖంగా శరీరాన్ని వదలలేకపోవడంతో... అతని ఆత్మ వేదన చెందుతుంది.. జీవితమంతా విషయవాసనలలో, భవబంధాలలో చిక్కుకున్నవారు.. తదనంతరం జరిగే దాని గురించి చనిపోయేవరకే కాదు, చనిపోయాక కూడా పరితపించవలసిందే. ఈ అంతరార్థాన్ని తెలుసుకొని, తనకు ఎదురయ్యే అవరోధాలను అధిగమించి, ఇహాన్నీ, పరాన్నీ సమన్వయం చేసుకున్న వ్యక్తే అనంతర జన్మలను కూడా సార్థకం చేసుకోగలుగుతాడు. ఆధ్యాత్మిక చింతనా మార్గంలో ‘తదనంతరం’ అనేది ఎంతో విలువైన విషయం. శరీరంలో ఉన్నప్పుడు చేసే శ్రేష్టకర్మలతోనే పరమాత్మ ప్రేమమయమైన ఒడికి ఆత్మ చేరుకొని, ఆనందానుభూతిని పొందగలుగుతుంది. పరమాత్మ ప్రేమలో అతీంద్రియ సుఖాన్ని పొందే ఆత్మ సచేతనమై... జీవన్ముక్తి స్థితిని చేరి ధన్యమవుతుంది. కాబట్టి ‘తదనంతరా’న్ని భౌతికమైన విషయంగా భావించకూడదు. మోహంతో ఎలాంటి ప్రలోభాలకూ లోనుకాకుండా... అనంతుడైన పరమాత్మతో సర్వ సంబంధాలనూ జోడించి, సర్వశక్తులనూ తన సొంతం చేసుకొనే ఆత్మ జన్మజన్మలకూ తరిస్తుంది. 

- బ్రహ్మకుమారీస్‌ 

7032410931

Updated Date - 2021-09-17T05:30:00+05:30 IST