కార్మికుల గరిష్ఠ పని గంటలు..రోజులో 12 గంటలు

ABN , First Publish Date - 2020-11-21T07:18:22+05:30 IST

కార్మికుల గరిష్ఠ పనిగంటలను ఒక రోజులో 12 గంటలుగా కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. వారానికి గరిష్ఠంగా 48 గంటలకు మించి కార్మికులతో పనిచేయించరాదని పేర్కొంది

కార్మికుల గరిష్ఠ పని గంటలు..రోజులో 12 గంటలు

వారానికి గరిష్ఠంగా 48 గంటలు మించరాదు

ఓఎ్‌సహెచ్‌ కోడ్‌ ముసాయిదాలో ప్రతిపాదన


న్యూఢిల్లీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కార్మికుల గరిష్ఠ పనిగంటలను ఒక రోజులో 12 గంటలుగా కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. వారానికి గరిష్ఠంగా 48 గంటలకు మించి కార్మికులతో పనిచేయించరాదని పేర్కొంది. ఈ మేరకు వృత్తిపరమైన రక్షణ, ఆరోగ్యం, పని వాతావరణం (ఓఎ్‌సహెచ్‌) కోడ్‌-2020 ముసాయిదా నిబంధనలను కేంద్ర కార్మిక శాఖ శుక్రవారం జారీ చేసింది. గత పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించిన ఓఎ్‌సహెచ్‌ కోడ్‌కు అనుగుణంగా ఈ నిబంధనలను రూపొందించింది. ఇందులో కార్మికుల పనిగంటలు, ఆరోగ్యపరమైన జాగ్రత్తల విషయంలో కీలక ప్రతిపాదనలు చేసింది. డాక్‌ కార్మికులు, భవన-ఇతర నిర్మాణ కార్మికులు, గనుల్లో పనిచేసే కార్మికులు, అంతర్రాష్ట్ర వలస కార్మికులు, కాంట్రాక్టు లేబర్‌, వర్కింగ్‌ జర్నలిస్టులు, ఆడియో వీడియో విజువల్స్‌ కార్మికులు, సేల్స్‌ ప్రమోషన్‌ ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం తెలిపింది.


విశ్రాంతి సమయాన్ని కలుపుకొని రోజులో గరిష్ఠంగా 12 గంటల పనిని ప్రతిపాదించింది. వలస కార్మికులు పనిచేస్తున్న సంస్థ నుంచి స్వరాష్ట్రంలోని నివాసానికి వెళ్లి రావడానికి ఏడాదికి ఒకసారి ప్రయాణ అలవెన్సులు అందించాలని పేర్కొంది. సంస్థలు నియామక పత్రం ఇవ్వకుండా ఎవ్వరినీ చేర్చుకోరాదు. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన మూడు నెలల్లో ప్రతి కార్మికుడికి, సిబ్బందికి సంబంధిత సంస్థలు హోదా, నైపుణ్య విభాగం, వేతనం తదితర అంశాలతో కూడిన నియామక పత్రాన్ని ఇవ్వాలి.  ఈ ముసాయిదా నిబంధనలపై ప్రజలు, ఇతర భాగస్వాములు తమ సూచనలు, అభ్యంతరాలను తెలియజేడానికి కేంద్ర కార్మిక శాఖ 45 రోజుల సమయాన్ని ఇచ్చింది.

Updated Date - 2020-11-21T07:18:22+05:30 IST