పెన్షన్లు.. పెంచేదేలే!

ABN , First Publish Date - 2022-08-01T08:55:49+05:30 IST

సామాజిక పెన్షన్ల విషయంలో జగన్‌ సర్కారు గిమ్మిక్కులు చేస్తోంది. ఊకదంపుడు ప్రచారాలకు పరిమితమై, కొత్త పెన్షన్లు పెంచడానికి ససేమిరా అంటోం ది.

పెన్షన్లు.. పెంచేదేలే!

కొత్తవి ఇవ్వాలంటే పాతవి కోయాల్సిందే 

వయోపరిమితి తగ్గించినా పెరగని లబ్ధిదారులు 

అడ్డగోలు నిబంధనలతో ఉన్న పింఛన్లకు కోతలు 

వారిస్థానంలో కొత్తవారికి మంజూరు చేసి కలరింగ్‌ 

చంద్రబాబు హయాంలో 19 లక్షల కొత్త పెన్షన్లు 

వైసీపీ మూడేళ్లలో ఇచ్చిన కొత్త పెన్షన్లు 8 లక్షలే


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సామాజిక పెన్షన్ల విషయంలో జగన్‌ సర్కారు గిమ్మిక్కులు చేస్తోంది. ఊకదంపుడు ప్రచారాలకు పరిమితమై, కొత్త పెన్షన్లు పెంచడానికి ససేమిరా అంటోం ది. వయోపరిమితి తగ్గించినా... పింఛనుదారుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క అదనపు పెన్షన్‌ కూడా పెంచకుం డా లెక్కలతో మాయ చేస్తోంది. పలు రకాల నిబంధనలు పెట్టి ఉన్న పెన్షన్లను తొలగిస్తూ, వాటి స్థానంలో కొత్తవారికి మంజూరు చేసి, పెద్దమొత్తంలో పెన్షన్లు ఇస్తున్నట్లు కలరింగ్‌ ఇస్తోంది.  


అదనపు పెన్షన్లు ఏవీ?

2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 35.32 లక్షల మంది సామాజిక పెన్షన్లు పొందేవారు. అప్పటి వరకు పెన్షన్‌దారుడికి ఒక్కొకరికి రూ.200 చొప్పున అందించేవారు. చంద్రబాబు వచ్చిన తర్వాత మొదట పెన్షన్‌ను రూ.1,000కి పెంచారు. బాబు అధికారం కోల్పోయే నాటికి రూ.2వేలు అందించారు. 2019 జూన్‌ నాటికి గత ప్రభుత్వం మొత్తం 54.47 లక్షల మందికి పెన్షన్లు అందించింది. బాబు హయాంలో మొత్తం 19.15 లక్షల మందికి అదనంగా పెన్షన్లు మంజూరు చేశారు. అయి తే జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా కొత్త పెన్షన్లు ఇవ్వకుండా లెక్కల మాయ చేస్తున్నార న్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మూడేళ్లలో 62.79 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. అంటే వైసీపీ ప్రభుత్వం అదనం గా 8.32 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారని పేర్కొంటోం ది. అయితే ఇందులో ఒక్కటి కూడా అదనంగా ఇవ్వ డం లేదని, ఇప్పటికే ఉన్న పెన్షన్లను రకరకాల నిబంధనలు పెట్టి తొలగించి, వారి స్థానంలో కొత్తవి ఇచ్చారని గణాంకాలు పరిశీలిస్తే స్పష్టమవుతోంది. 


వయోపరిమితి తగ్గించినా... 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్‌ ప్రమాణ స్వీకారం చేసే రోజున అవ్వా తాతలకు ఇచ్చే పింఛన్లను రూ.2వేల నుంచి రూ.2,250కి పెంచడంతో పాటు పింఛన్లకు అర్హత వయసును 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తూ మొదటి సంతకం చేశారు. ఈ నిబంధన 2019 జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు.


అయితే అందులో పెంచిన పెన్షన్‌ రూ.2,250 ఇచ్చారే తప్ప తగ్గించిన అర్హతా వయసును పట్టించుకోలేదు. దీంతో సీఎం చేసిన మొదటి సంతకం పాక్షికంగా మాత్రమే అమలైంది. ఆ తర్వాత ఆర్నెల్లకు పైగా వయోపరిమితి ఉత్తర్వులు అమల్లోకి రాలేదు. సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాచారం ప్రకారం 2019 జూన్‌ 1 నుంచి సెప్టెంబరు 25వరకు 60 నుంచి 65 ఏళ్ల వయసు కలిగినవారు దాదాపు 4 లక్షల మంది పెన్షన్లకు అర్హులైన వారున్నారు. వారందరికీ సీఎం మొదటి సంతకం ప్రకా రం పింఛను మంజూరుచేస్తే ఆ ఆర్నెల్ల కాలంలో అవ్వాతాతలకు రూ.540 కోట్లు చెల్లించాల్సి వచ్చేది. కానీ ప్రభుత్వం తాత్సారం చేసి వారిని నిలువునా మోసం చేసింది.


2019 జూన్‌ 1 నాటికి వృద్ధాప్య పింఛన్లకు అర్హులైన వారు 23,20,378 మంది ఉన్నారు. అయితే అదే ఏడాది సెప్టెంబరు నాటికి వీరి సంఖ్య 22,74,411కు తగ్గింది. ఈ వ్యవధిలో పింఛన్‌ పొందే వృద్ధులు 45,967 మంది తగ్గిపోవడానికి కారణం మాత్రం అధికారులు చెప్పలేదు. పెన్షన్లు పొందేందుకు 2019 జూలై 3న లేఖ రాసిన సెర్ప్‌ సీఈవో దానికి అనుగుణంగా ఆర్నెల్ల తర్వాత డిసెంబరు 13న నిబంధనలు రూపొందించడాన్ని బట్టి అవ్వాతాతల పట్ల ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం అర్థమవుతోంది. 


పాతవి తొలగిస్తేనే కొత్తవి

ఊళ్లో ఎవరైనా చనిపోతేనే కొత్తవారికి పెన్షన్‌ వస్తుందంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రతిపక్షనేత గా ఉన్నప్పుడు జగన్‌ విమర్శించేవారు. ఇప్పుడు జగన్‌ సర్కారులో ఎవరికైనా కొత్తగా పెన్షన్‌ రావాలంటే ఉన్నవాటిని తొలగించాల్సిందేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నా యి. మొదట్లో వయోపరిమితి తగ్గించిన తర్వాత 60 ఏళ్లు పూర్తయిన తర్వాత పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని, ఆ మరుసటి నెల నుంచి పెన్షన్‌ మంజూరవుతుందని చెప్పారు. అయితే ఆ హామీకి స్వస్తి చెప్పి ఏడాదిలో 2 దఫాలుగా పెన్షన్లు మంజూరు చేసేలా షెడ్యూల్‌ రూపొందించారు. ఈ వ్యవధిలో ఎన్ని దరఖాస్తులు వస్తే అన్ని పాత పెన్షన్లను తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ కారణంగానే ఆర్నెల్లకోసారి పెన్షన్లు మంజూరుచేసే సమయానికి తొలగించే వారిసంఖ్య కూడా అంతే ఉంటోంది. 2022 జనవరిలో ప్రభుత్వం భారీఎత్తున ప్రకటనలు గుప్పిస్తూ 62లక్షల పెన్షన్లు ఇస్తున్నామని, జనవరి నుంచి పింఛను మొత్తాన్ని రూ.2500కు పెంచుతున్నామని ప్రకటించుకుంది. జనవరిలో 61.72 లక్షలు, ఏప్రిల్‌లో 61.03లక్షలు, జూన్‌లో 60.75 లక్షలు, జూలైలో 60.52 లక్షల పెన్షన్లు విడుదల చేశారు.


అంటే జనవరి నుంచి జూలై నాటికి సుమారు 1.22 లక్షల పెన్షన్లను తొలగించినట్లు తేలిపోయింది. ఇక, ఆగస్టు 1న ఇచ్చే పెన్షన్ల జాబితాను మంత్రి ముత్యాలనాయుడు ఆదివారం ప్రకటించారు. ఆగస్టులో అదనంగా 3.10 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తున్నామని, మొత్తం 62.79 లక్షల పెన్షన్లు విడుదల చేసినట్లు వివరించారు. జనవరిలో 61.72 లక్షల పెన్షన్లు ఇచ్చిన సర్కారు, ఆగస్టులో 62.79 లక్షల పెన్షన్లు ప్రకటించింది. అంటే 1.07 లక్షల పెన్షన్లు పెంచింది. అయితే 3.10 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి చెప్పారు. అప్పటికే ఉన్న 2.03 లక్షల పెన్షన్లు తొలగించి వారి స్థానంలో ఇస్తేనే ఇది సాధ్యం. 

Updated Date - 2022-08-01T08:55:49+05:30 IST