మాస్క్‌ తప్పనిసరి!

ABN , First Publish Date - 2021-12-05T05:21:34+05:30 IST

కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ వ్యాప్తితో మళ్లీ మాస్కులు ధరించడం తప్పనిసరిగా మారింది. కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో కొందరైతే మాస్కుల సంగతినే మరిచిపోయారు. కానీ ఒమైక్రాన్‌ వ్యాప్తిపై ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మాస్క్‌ తప్పనిసరి!
ఆదిలాబాద్‌లో మాస్కులను కొనుగోలు చేస్తున్న దృశ్యం

నిర్లక్ష్యం చేస్తే రూ.వెయ్యి జరిమానా

నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్న జిల్లా పోలీసు శాఖ  

బహిరంగ మార్కెట్‌లో మాస్కులకు మళ్లీ పెరిగిన గిరాకీ

ఒమైక్రాన్‌ నూతన వేరియంట్‌ వ్యాప్తితో అధికార యంత్రాంగం అప్రమత్తం

జిల్లాలో ప్రస్తుతం అదుపులోనే ఉన్న కరోనా 

ఆదిలాబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ వ్యాప్తితో మళ్లీ మాస్కులు ధరించడం తప్పనిసరిగా మారింది. కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో కొందరైతే మాస్కుల సంగతినే మరిచిపోయారు. కానీ ఒమైక్రాన్‌ వ్యాప్తిపై ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మొదటి వేవ్‌లో పెద్దగా ప్రభావం కనిపించకపోయినా.. సె కండ్‌వేవ్‌లో మాత్రం ప్రాణనష్టం జరిగింది. థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే అప్రమత్తమైన ప్రభుత్వం వ్యాక్సినేషన్‌, మాస్కులే రక్షగా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ జిల్లాలో పర్యటించి అధికారులను అప్రమత్తం చేశారు. ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లలో ఎంతో మంది బాధితులు కరోనా బారీన పడి ప్రాణాలు పొగొట్టుకున్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమై పో యాయి. కుటుంబపెద్ద దూరం కావడంతో బాధిత కుటుంబాలు అల్లాడుతున్నాయి. జిల్లాలో కరోనా బారీన పడి వందలోపే బాధితులు మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా.. వాస్తవానికి 200లకు పైగానే కరోనా మరణా లు జరిగినట్లు తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితులు పునరావృతంకాకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లను చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఒక్క రు తప్పనిసరిగా మాస్కు ధరించాలనే నిబంధన విధించింది.

ఫ ఇప్పటికే ఉత్తర్వుల జారీ

మాస్కు ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా విధించాలనే నిబంధనతో ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌ యాక్ట్‌ 2005 ప్రకారం మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాలు, రోడ్లపైకి వచ్చిన వారికి జరిమానా విధించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. నిర్లక్ష్యం గా వ్యవహరించిన వారికి ఈ చలాన్‌ల ద్వారా జరిమానా విధించనున్నారు. మొదలి రెండు, మూడురోజుల పాటు అవగాహ న కల్పించి ఆ తర్వాత ఫైన్‌ వేసేందుకు చర్యలు తీసు కుంటారు. సామాన్యులకు రూ.వెయ్యి జరిమానా కొంత భారమే అయినప్పటికీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తప్పడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. మొదట పట్టణ, మండల కేంద్రాలలో అవగాహ న కార్యక్రమాలను నిర్వహించి ఆతర్వాత గ్రామాలలో ప్రచా రం చేపట్టాలని పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖాధికారులు భావిస్తున్నారు. ప్రతీఒక్కరు బాధ్యతగా ఉంటేనే ఎలాంటి వేరియంట్‌నైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మరో రెండు రోజుల్లో సోమ, మంగళవారం నుంచి జిల్లావ్యాప్తం గా ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేందుకు పోలీసు శాఖ అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేసోంది. అయితే జరిమానా విధింపు, చెల్లింపులపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు.

ఫ మాస్కుల ధరలు పైపైకి..

వైద్యుల హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రజలు మళ్లీ మాస్కులను కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. దీంతో మాస్కులకు భారీగా గిరాకీ పెరిగింది. వివిధ రకాల డిజైన్లు, రంగులతో మార్కెట్‌లో మాస్కులు దర్శనమిస్తున్నాయి. కొందరు వ్యాపారులు మాస్కులను విక్రయిస్తూ అదనంగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అయితే నాణ్యతను బట్టి వాటి ధరలను నిర్ణయించాల్సి ఉండగా.. కొందరు వ్యాపారులు అడ్డగోలు ధరల తో అమ్మేసుకుంటూ అందినకాడికి దండుకుంటున్నారు. ఒక్కో మాస్కు రూ.10 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నా రు. అయినా అధికారులు ధరల నియంత్రణపై దృష్టి సారించ డం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వస్త్ర దుకాణా లు, జనరల్‌ స్టోర్స్‌, బుక్‌ స్టోర్స్‌లలో మాస్కుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్కువ మంది రెడీమెడ్‌ మాస్కులను మాత్రమే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు మాస్కులను సరఫరా చేసింది. దీంతో దర్జీలకు ఉపాధి కలిగింది. కానీ, ప్రస్తుతం  స్థానిక దర్జీలకు ఉపాధి లేకుండానే పోయింది.

మాస్కు ధరించడం బాధ్యతగా భావించాలి

: ఎం.రాజేష్‌చంద్ర, ఎస్పీ, ఆదిలాబాద్‌

కొత్త వేరియంట్‌ వ్యాప్తిపై హెచ్చరికలు రావడంతో అందరూ మాస్కులు ధరించడం బాధ్యతగా భావించాలి. వ్యక్తిగత రక్షణతో పాటు ఇతరులకు హాని కలిగించకుండా జాగ్రత్త పడాలి. వైరస్‌ వ్యాప్తి కాకుండా మాస్కుతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలి. ముఖ్యంగా వాహనదారులు మాస్కు లేనిదే బయటకు రాకూడదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాస్కు ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా మాస్కుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. త్వరలోనే జరిమానాలు విధించేందుకు చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2021-12-05T05:21:34+05:30 IST