అమ్మాయిల ‘వివాహ’ బిల్లు పార్లమెంటరీ కమిటీకి!

ABN , First Publish Date - 2021-12-22T10:06:38+05:30 IST

అమ్మాయిల చట్టబద్ధమైన వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచుతూ తెచ్చిన బిల్లును విపక్షాల నిరసనల నడుమ లోక్‌సభ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి..

అమ్మాయిల ‘వివాహ’ బిల్లు పార్లమెంటరీ కమిటీకి!

  • అమ్మాయిల పెళ్లి వయసు పెంపుపై లోక్‌సభలో ప్రతిపక్షాల ఆగ్రహం
  • ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
  • పర్సనల్‌ చట్టాలకు విరుద్ధం
  • లాకమిషన్‌ సిఫార్సులకు వ్యతిరేకం
  • దేశ చరిత్రలోనే నిర్ణయాత్మక చర్యన్న మంత్రి స్మృతి ఇరానీ
  • కమిటీకి పంపేందుకు అంగీకారం
  • వివిధ పార్టీల ఎంపీల ధ్వజం


న్యూఢిల్లీ, డిసెంబరు 21: అమ్మాయిల చట్టబద్ధమైన వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచుతూ తెచ్చిన బిల్లును విపక్షాల నిరసనల నడుమ లోక్‌సభ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి నివేదించింది. బాల్యవివాహాల నిషేధ (చట్ట సవరణ) బిల్లును మంగళవారం కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి స్మృతి ఇరానీ సభలో ప్రవేశపెట్టారు. పురుషులతో సమానంగా మహిళల చట్టబద్ధమైన వివాహ వయసును 21 ఏళ్లకు పెంచుతూ.. భారత క్రైస్తవ వివాహ చట్టం, పార్సీ వివాహం-విడాకుల చట్టం, ముస్లిం పర్సనల్‌ లా అమలు (షరియా) చట్టం, ప్రత్యేక పెళ్లిళ్ల చట్టం, హిందూ వివాహ చట్టం, విదేశీ పెళ్లిళ్ల చట్టం సహా ఏడు పర్సనల్‌ చట్టాలను సవరిస్తూ ఈ బిల్లు రూపొందించారు. పెళ్లిళ్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అన్ని చట్టాలు, సంప్రదాయాలు, ఆచారాల స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. దేశ చరిత్రలోనే ఇది నిర్ణయాత్మక చర్యగా అభివర్ణించారు. అయితే ఇది ప్రాథమిక హక్కులను, వివిధ వ్యక్తిగత చట్టాల (పర్సనల్‌ లా)ను ఉల్లంఘిస్తోందని, సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరపకుండా హడావుడిగా తీసుకొచ్చారని విపక్షాలు ధ్వజమెత్తాయి.


మరింత లోతైన పరిశీలనకు స్టాండింగ్‌ కమిటీకి పంపాలని డిమాండ్‌ చేశాయి. ఎవరితోనూ చర్చించకుండా బిల్లును తెచ్చిన తీరు ప్రభుత్వ దురుద్దేశాలను బహిర్గతం చేస్తోందని కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధురి అన్నారు. ఈ బిల్లులోని నిబంధనలు.. జాతీయ లా కమిషన్‌ సిఫారసులకు విరుద్ధంగా ఉన్నాయని.. పురుషులు, మహిళలకు వివాహ వయసు 18 ఏళ్లుగా ఉండాలని కమిషన్‌ సిఫారసు చేసిందని ఆ పార్టీ ఉప నేత గౌరవ్‌ గొగోయ్‌ చెప్పారు. ‘ఈ బిల్లు అవాంఛితం.. రాజ్యాంగ విరుద్ధం.. 25వ అధికరణను ఉల్లంఘిస్తోంది. ప్రాథమిక హక్కులు, పర్సనల్‌ చట్టాలపై దాడి’ అని ఐయూఎంఎల్‌ ఎంపీ ఈటీ మొహమ్మద్‌ బషీర్‌ ఆరోపించారు. ఇది తిరోగమన చర్యని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ‘18 ఏళ్ల వయసులో బాలిక తన ప్రధానిని ఎంపిక చేసుకుంటోంది. సహజీవనం, లైంగిక సంబంధాలు కలిగి ఉంటోంది. కానీ ఆమె పెళ్లిచేసుకునే హక్కును ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా నిరాకరిస్తోంది’ అని ఆక్షేపించారు. ఈ  బిల్లు చట్టమైతే ఎలా అమలు చేయదలచిందీ ప్రభుత్వం చెప్పాలని ఆర్‌ఎ్‌సపీ ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్‌ అన్నారు. దీనిని సెలెక్ట్‌ కమిటీకి పంపాలని సుప్రియా సూలే (ఎన్‌సీపీ), కనిమొళి (డీఎంకే) సహా విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. మంత్రి ఇరానీ స్పందిస్తూ.. బిల్లు పెట్టేటప్పుడు తన ప్రసంగాన్ని విపక్ష సభ్యులు ఓపిగ్గా వినిఉంటే బాగుండేదని.. స్టాండింగ్‌ కమిటీకి నివేదించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తాను చెప్పానని వ్యాఖ్యానించారు.


సంసార జీవితంలోకి ప్రవేశించేందుకు సమాన హక్కులు కల్పించడంలో దేశం 75 ఏళ్లు వెనుకబడి ఉందన్నారు. 15-18 ఏళ్ల మధ్య ఏడు శాతం బాలికలు గర్భం దాల్చుతున్నారని.. 18 ఏళ్లు రాకుండానే 23 శాతం మంది బాలికలకు పెళ్లిళ్లు జరుగుతున్నాయని తెలిపారు. కౌమార దశలోనే గర్భం దాల్చడం వల్ల మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని.. దీని ఫలితంగా అబార్షన్లు, శిశుమరణాలు, ప్రసవ మరణాల వంటివి జరుగుతున్నాయని.. వాటికి అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు. మరింత పరిశీలన కోసం స్టాండింగ్‌ కమిటీకి నివేదించాలని సభాపతి ఓం బిర్లాను ఆమె కోరారు.


సభలో అదే గందరగోళం..

లోక్‌సభలో మంగళవారం కూడా విపక్షాల గందరగోళం కొనసాగింది. లఖీంపూర్‌ ఖీరీ కేసులో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాను బహిష్కరించాలని కాంగ్రెస్‌, టీఎంసీ ఎంపీలు, కర్ణాటకలో శివాజీకి అవమానం జరిగిన ఘటనలో చర్యలు తీసుకోవాలని శివసేన సభ్యులు, నీట్‌ ఎగ్జామ్‌ నుంచి తమిళనాడును మినహాయించాలని డీఎంకే ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు కొనసాగించారు. స్పీకర్‌ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోలేదు. దాంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదావేశారు. ఆ తర్వాత కూడా గందరగోళం కొనసాగింది. ఆ సమయంలోనే వివాహ వయసు బిల్లుతో పాటు చార్టర్డ్‌ అకౌంటెంట్ల చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను స్టాండింగ్‌ కమిటీకి పంపాక స్పీకర్‌ సభను బుధవారానికి వాయిదావేశారు.

Updated Date - 2021-12-22T10:06:38+05:30 IST