మార్కెట్‌ మాంత్రికుడు ‘బిగ్‌ బుల్‌’ ఇకలేరు

ABN , First Publish Date - 2022-08-15T10:07:08+05:30 IST

భారత స్టాక్‌ మార్కెట్‌ మాంత్రికుడు, ‘బిగ్‌ బుల్‌’గా పేరొందిన ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా (62) మరిక లేరు.

మార్కెట్‌ మాంత్రికుడు ‘బిగ్‌ బుల్‌’ ఇకలేరు

  • అనారోగ్యంతో కన్నుమూసిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా
  • భారత ‘వారెన్‌ బఫెట్‌’గా పేరు
  • 36కు పైగా కంపెనీల్లో పెట్టుబడులు
  • 2022లో ఫోర్బ్స్‌ జాబితాలో 22వ స్థానం 
  • ఆయన ఆస్తుల విలువ రూ.46,000 కోట్లు


ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ మాంత్రికుడు, ‘బిగ్‌ బుల్‌’గా పేరొందిన  ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా (62) మరిక లేరు. తీవ్ర అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో కొద్ది నెలలుగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం ఆయన ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఆయన గుండెపోటుతో కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించారు. ఝున్‌ఝున్‌వాలాకు భార్య రేఖ, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం ముంబైలో బంధుమిత్రుల సమక్షంలో కుటుంబ సభ్యులు ఝున్‌ఝున్‌వాలా అంత్యక్రియలు నిర్వహించారు. బిగ్‌బుల్‌ మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 


ట్రెండ్‌ సెట్టర్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్లో ఝున్‌ఝున్‌వాలా ఒక ట్రెండ్‌ సెట్టర్‌. హైదరాబాద్‌లో ఒక రాజస్థానీ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం అంతా ముంబైలోనే జరిగింది. డిగ్రీ చదువుతున్న రోజుల్లో 1985లో ఒక బంధువు నుంచి రూ.5,000 అప్పు తీసుకుని స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు ప్రారంభించారు. అప్పుడు 150 పాయింట్లుగా ఉన్న బీఎ్‌సఈ సెన్సెక్స్‌ ఇప్పుడు 59,000 పాయింట్లు మించి పోయింది. చార్టెడ్‌ అకౌంటెన్సీ (సీఏ) పూర్తి చేసినా ఝున్‌ఝున్‌వాలా షేర్‌ మార్కెట్‌ పెట్టుబడులనే తన ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు. ఆయన ఫలానా కంపెనీ షేర్లు కొన్నారని తెలిస్తే వెంటనే ఆ షేర్లలో ర్యాలీ ప్రారంభమయ్యేది. దేశంలోని చాలా మంది మదుపరులు ఆయన పోర్టుఫోలియోని అనుసరించేవారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం రాకేశ్‌ ఝుఝున్‌వాలా రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో తన పోర్టుఫోలియోను నిర్వహిస్తున్నారు. తన పేరులో మొదటి రెండు అక్షరాలు, తన భార్య పేరులోని తొలి రెండక్షరాలతో రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ను ఏర్పాటు చేశారు. 


టాటా టీతో జాక్‌పాట్‌: ఝున్‌ఝున్‌వాలా స్టాక్‌ మార్కెట్‌ జైత్రయాత్ర టాటా టీతో ప్రారంభమైంది. 1986లో ఆయన ఈ షేర్లను ఒక్కోటి  రూ.47 చొప్పున 5,000 కొనుగోలు చేశారు. మూడు నెలలోనే ఈ షేరు ధర రూ.143కు చేరింది. మూడేళ్లు తిరిగే సరికి ఆయన పెట్టుబడుల విలువ రూ.20-25 లక్షలకు పెరిగింది. అలాగే సెసా గోవా కంపెనీ షేరు బిగ్‌బుల్‌కు భారీ లాభాలను అందించింది. రూ.27కు కొనుగోలు చేసిన ఈ షేరును ఆయన రూ.1,400కు వచ్చే వరకు ఉంచుకుని భారీ లాభాలకు అమ్మారు. 


పోర్టుఫోలియోలో 36కుపైగా కంపెనీలు: భారత వారెన్‌ బఫెట్‌గా పేరొందిన  రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు.. తొలుత ఏడెనిమిది కంపెనీలకే పరిమితం కాగా.. ఇప్పుడు మూడు డజన్లకుపైగా కంపెనీలకు విస్తరించాయి. అయితే ఇందులో 80 శాతం పెట్టుబడులు ఏడెనిమిది కంపెనీల్లోనే ఉన్నాయి. అందులో టాటా గ్రూప్‌ కంపెనీ టైటాన్‌ ఒకటి. ఈ కంపెనీ షేరు బిగ్‌బుల్‌కు బాగా కలిసొచ్చింది. ఈ కంపెనీ ఈక్విటీలో ఆయనకు ఇప్పటికీ 5.05 శాతం వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం ఈ షేర్ల విలువ రూ.11,000 కోట్లు. వీటికి తోడు ఇండియన్‌ హోటల్స్‌, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌, క్రిసిల్‌, ఆప్టెక్‌, స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌, మెట్రో బ్రాండ్స్‌ వంటి కంపెనీల షేర్లలోనూ ఝున్‌ఝన్‌వాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేశారు.


ఎన్‌సీసీలోనూ వాటా: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఎన్‌సీసీ లిమిటెడ్‌ ఈక్విటీలోనూ బిగ్‌బుల్‌కు 12.62 శాతం వాటా ఉంది. ప్రస్తుతం ఈ వాటా విలువ రూ.505.2 కోట్లు. ప్రస్తుతం రూ.64.5 వద్ద ట్రేడవుతున్న ఈ షేర్లను ఝున్‌ఝున్‌వాలా రూ.25-35 వద్ద కొనుగోలు చేసినట్టు సమాచారం. హైదరాబాద్‌కే చెందిన అపోలో హాస్పిటల్‌ షేర్లూ రాకేశ్‌కు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. 1999లో ఈ షేర్లు కొన్న ఆయన 2015 వరకు ఉంచుకుని వంద రెట్లు లాభాలు పొందారు. 


తాజాగా విమానయాన రంగంలోకి: చిన్నప్పుడు విమాన పైలెట్‌ లేదా జర్నలిస్ట్‌ కావాలన్నది ఝున్‌ఝున్‌వాలా లక్ష్యం. సీఏ పూర్తి చేశాక పూర్తిగా స్టాక్‌ మార్కెట్‌కే పరిమితం అయ్యారు. విమానయానంపై ఉన్న ఆసక్తితో ఈ నెల 7న ఆకాశ ఎయిర్‌ పేరుతో ఆ రంగంలోకి ప్రవేశించారు. ఈ విమానయాన సంస్థ సర్వీసులు ప్రారంభమైన వారం రోజులకే ఆయన కన్నుమూయడం ఇతర ప్రమోటర్లను నివ్వెరపరిచింది. 


రూ.5,000తో స్టాక్‌ మార్కెట్లోకి..

బిగ్‌ బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా 1985లో రూ.5,000తో తన షేర్‌ మార్కెట్‌ పెట్టుబడులు ప్రారంభించారు. ఇప్పుడు ఆయన మార్కెట్‌ పెట్టుబడుల విలువ 580 కోట్ల డాలర్లు. ప్రస్తుత మారకం రేటు ప్రకారం ఇది దాదాపు రూ.46,000 కోట్లకు సమానం. గత ఏడాది ఫోర్బ్స్‌ పత్రిక రూపొందించిన భారత సంపన్నుల జాబితాలో 430 కోట్ల డాలర్ల సంపదతో 36వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది 580 కోట్ల డాలర్లతో 22వ స్థానానికి ఎగబాకారు. మరోవైపు ఏటా ఆయన తన సంపాదనలో 25 నుంచి 30 శాతం వరకు దాతృత్వ కార్యకలాపాల కోసం కేటాయిస్తూ వస్తున్నారు. 


ఆర్థిక ప్రపంచంలో రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాది చెరగని ముద్ర. దేశ అభివృద్ధి కోసమూ తపించేవారు. ఆయన మరణం బాధాకరం. ఝున్‌ఝున్‌వాలా కుటుంబ సభ్యులు,ఆయన అభిమానులకు నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి.

 - ప్రధాని నరేంద్ర మోదీ


భారత ఈక్విటీ మార్కెట్‌పై ఒక తరం మొత్తానికి ఝున్‌ఝున్‌వాలా విశ్వాసం కల్పించారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా... ఎప్పటికీ మరువలేం. ఆయన అకాల మరణం అత్యంత బాధాకరం.

 - గౌతమ్‌ అదానీ,  చైర్మన్‌, అదానీ గ్రూప్‌


ఝున్‌ఝున్‌వాలా తెలివైన మదుపరి, మంచి హాస్యచతురత కలిగిన వ్యక్తి. వీటికి తోడు దయ, ముందు చూపు ఉన్న మనిషి.  మార్కెట్లపై గట్టి పట్టు ఉన్న వ్యక్తి.

 -  రతన్‌ టాటా, గౌరవ చైర్మన్‌, టాటా గ్రూప్‌



Updated Date - 2022-08-15T10:07:08+05:30 IST