Abn logo
Sep 24 2021 @ 00:40AM

మార్కెటింగ్‌ శాఖలో పొదుపు మంత్రం

పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డు

- అధికారులు, చైర్మన్లకు వాహనాల తగ్గింపు

- జిల్లాలోని మార్కెట్లలో రూ. 26.27 కోట్ల నిల్వ

- నూతన వ్యవసాయ చట్టాలతో ముందుచూపు

- కొత్తగా చేపట్టే పనులపై ఆంక్షలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

కేంద్ర ప్రభుత్వం గత ఏడాది తీసుకవచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు అనుగుణంగా మార్కెటింగ్‌ శాఖ పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నది. శాఖలో పనిచేసే అధికారులు, కార్యదర్శులు, పాలకవర్గాల చైర్మన్లు వినియోగించే వాహనాల వాడకంపై పరిమితి విధించారు. కొత్త చట్టాలను అమలుచేయాల్సి వస్తే మార్కెట్‌ యార్డుల్లో పనిచేసే అధికారులు, సిబ్బందికి జీతభత్యాలు, కార్యాలయాల నిర్వహణ కోసం కావాల్సిన నిధుల కోసం ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. మార్కెట్లలో జరిగే పంట ఉత్పత్తుల క్రయ విక్రయాలపై రైతులు చెల్లించే మార్కెట్‌ ఫీజును ఖర్చు చేయకుండా కొత్తగా చేపట్టే పనులపై ఆంక్షలు విధించారు. పంట ఉత్పత్తుల విక్రయాల ద్వారా వందకు ఒక శాతం చొప్పున మార్కెట్‌ ఫీజును వసూలు చేస్తుంటారు. తద్వారా వచ్చే ఆదాయంతో మార్కెట్ల నిర్వహణ, సిబ్బంది జీత భత్యాలు ఇవ్వడంతో పాటు మార్కెట్లలో గోదాములు, ప్లాట్‌ ఫారాలు, ఇతరత్రా అభివృద్ది పనులను చేయాల్సి ఉంటుంది. గత ఏడాది కాలంగా పనులు చేసేందుకు ప్రతిపాదనలను స్వీకరించడం లేదు. 

భారీగా నిల్వలు..

జిల్లాలో గల 8 మార్కెట్లకు ఇప్పటి వరకు సమకూరిన ఆదాయం 26 కోట్ల 27 లక్షల 87 వేల రూపాయలు ట్రెజరరీల్లో నిల్వ ఉన్నాయి. పెద్దపల్లి మార్కెట్‌లో రూ. 6.14 కోట్లు, సుల్తానాబాద్‌ మార్కెట్‌లో రూ. 8.38 కోట్లు, ధర్మారం మార్కెట్‌లో రూ. 2.07 కోట్లు, మంథని మార్కెట్‌లో రూ. 3.25 కోట్లు, జూలపల్లి మార్కెట్‌లో రూ. 64.06 కోట్లు, కమాన్‌పూర్‌ మార్కెట్‌లో రూ. 3.11 కోట్లు, కాల్వశ్రీరాంపూర్‌ మార్కెట్‌లో రూ. 1.66 కోట్లు, రామగుండం మార్కెట్‌లో రూ.99.26 లక్షలు నిల్వ ఉన్నాయి. ఈ నిధులను అత్యవసర పనులకు మినహా మరే ఇతర కొత్త పనులకు ఉపయోగించడం లేదు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం మూడు రకాల నూతన వ్యవసాయ చట్టాలను తీసుకవచ్చింది. ఈ చట్టాలను అమలు చేయడం వల్ల మార్కెట్‌ యార్డులకు ఎలాంటి ఆదాయం రాదు. రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను ఎక్కడైనా, ఎవరికైనా విక్రయించుకునే అవకాశం కల్పించింది. పంట ఉత్పత్తులకు ఎలాంటి మార్కెట్‌ సెస్‌ చెల్లించాల్సిన పరిస్థితి ఉండదు. ఈ చట్టాలు లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ, వీటిని రద్దు చేయాలంటూ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. చట్టాల అమలుపై రైతు సంఘాలతో కేంద్రం నిర్వహించిన చర్చలు విఫలం అయ్యాయి. వీటిపై కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఆ చట్టాల అమలును తాత్కాలికంగా కోర్టు నిలిపివేయాలని పేర్కొంది. దీంతో ప్రస్తుతానికి చట్టాల అమలు జరగడం లేదు. 

ముందుచూపుతోనే..

పాత పద్ధతిలోనే రాష్ట్రంలో మార్కెట్లు కొనసాగుతున్నాయి. భవిష్యత్‌లో ఆ చట్టాలను అమలు చేయాల్సివస్తే మార్కెట్లకు ఆదాయం సమకూరవని భావించిన రాష్ట్ర ప్రభుత్వం పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నది. జిల్లా మార్కెటింగ్‌ శాఖ మేనేజర్‌కు ప్రభుత్వమే నేరుగా జీతాలను చెల్లిస్తుంది. ఇప్పటి వరకు డీఎంకు ఏడాదికి గాను కారు అద్దె చెల్లించిన ప్రభుత్వం 4 మాసాలకు కుదించింది. మార్కెట్‌ యార్డుల్లో పనిచేసే కార్యదర్శులు, సిబ్బందికి జీతభత్యాలను మార్కెట్‌ ద్వారా వచ్చే ఆదాయంలో నుంచే చెల్లిస్తుంటారు. మార్కెట్‌ కార్యదర్శి, కమిటీ చైర్మన్‌కు వేర్వేరుగా కార్లను వినియోగించుకునేందుకు అద్దెను చెల్లించే వాళ్లు. కానీ ప్రస్తుతం కార్యదర్శి, కమిటీ చైర్మన్‌ ఇద్దరు కలిసి ఒకే కారును వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలోగల పెద్ద మార్కెట్లు పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో ఏడాది పాటు, మిగతా మార్కెట్‌ యార్డుల్లో కేవలం 4 మాసాలు మాత్రమే కారు అద్దె చెల్లించనున్నారు. ఈ ఆంక్షలతో పాటు మార్కెట్‌ యార్డుల్లో కొత్తగా అభివృద్ధి పనులు చేసే వెసులుబాటు లేకుండా చేయడంతో పాలకవర్గాల చైర్మన్లు ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్త చట్టాల అమలు విషయమై ఏదో ఒకటి తేలేవరకు ఈ ఆంక్షలు ఇలాగే కొనసాగవచ్చని మార్కెట్‌ శాఖ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.