మామి‘డీలా’!

ABN , First Publish Date - 2022-01-25T04:33:29+05:30 IST

ఏటా జనవరి నాటికి పూత తో మామిడి చెట్లు కళకళలాడేవి. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ఇంతవరకూ పూత అన్నది కనిపించ లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెట్లపై అంతంతమాత్రంగా పూత కనిపిస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నవం బరు, డిసెంబరులో కురిసిన వర్షాల వల్లే పూత ఆలస్య మైందని..నెలాఖరులోగా వచ్చే అవకాశముందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఐదు వేల హెక్టారు ల్లో మామిడి సాగవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

మామి‘డీలా’!
సన్యాసిపుట్టుగలో పూతలేక కళావిహీనంగా మామిడి చెట్టు


 మామిడి పూత అంతంతే..

 నవంబరు, డిసెంబరులో అకాల వర్షాలే కారణం

 దిగుబడిపై ప్రభావం

(ఇచ్ఛాపురం రూరల్‌)

ఏటా జనవరి నాటికి పూత తో మామిడి చెట్లు కళకళలాడేవి. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ఇంతవరకూ పూత అన్నది కనిపించ లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెట్లపై అంతంతమాత్రంగా పూత కనిపిస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నవం బరు, డిసెంబరులో కురిసిన వర్షాల వల్లే పూత ఆలస్య మైందని..నెలాఖరులోగా వచ్చే అవకాశముందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఐదు వేల హెక్టారు ల్లో మామిడి సాగవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా సెప్టెంబరు వరకూ వర్షాలు పడుతుంటా యి. ఆ తరువాత తగ్గుముఖం పడతాయి. ఆ సమయంలో పూతకు బీజం పడుతుంది. పూత బాగా వచ్చిన తరువాత తోటలకు నీరు పెడుతుంటారు. అయితే ఈ ఏడాది సరిగ్గా నవంబరు, డిసెంబరులో వర్షాలు పడడంతో ఒకేసా రి తేమ శాతం ఎక్కువైంది. దీంతో పూత చిగురించడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతానికి 20 శాతం మాత్రమే పూత కనిపిస్తోంది. వాతావరణంలో వేడి పెరిగితే పూత ఆశాజనకంగా రాదు. ఫిబ్రవరి నుంచి ఎండలు ముదురుతాయి. మరోవైపు గత కొద్దిరోజులుగా పొగమంచు కురుస్తోంది. ఈ పరిస్థితుల్లో పూత ప్రశ్నార్థకంగా మిగులుతోంది. నెలాఖరులోగా పూత పూస్తేనే దిగుబడి దక్కుతుందని ఉద్యానవనశాఖ అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి రెండోవారం దాటితే వాతావ రణంలో వేడి ప్రభావం  పూత  రాలిపోయే ప్రమాదముందని పేర్కొంటున్నారు. అయితే ఆందోళనకు గురవుతున్న రైతులు రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. ఎకరాకు రూ.5 వేల వరకూ ఖర్చు చేస్తున్నారు. ఒకవేళ ఆలస్యంగానైనా పూత వచ్చినా..దిగుబడిపై ప్రభావం చూపే అవకాశముంది. కాపు ఆలస్యమైనా వేసవిలో అకాల వర్షాలబారిన పడే అవకాశముందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో నష్టాలను మామిడి పంట ద్వారా అధిగమిస్తామనుకున్న రైతులకు ఈ పరిణామాలు మింగుడు పడడం లేదు.  ఇదే విషయంపై టెక్కలి ఉద్యానవనశాఖ ఏడీ ఆర్‌.ప్రసాద్‌ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా ఈ నెలాఖరు వరకూ పూతకు అవకాశముందన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన పడాల్సిన పనిలేదన్నారు.  



Updated Date - 2022-01-25T04:33:29+05:30 IST