Advertisement
Advertisement
Abn logo
Advertisement

అధిష్ఠానం మనిషి!

  • ఢిల్లీ అండతో సంక్షోభాలను ఈదిన రోశయ్య
  • ముఖ్యమంత్రిగా ఉండగా జగన్‌, తెలంగాణ కాక
  • తెలంగాణ, సమైక్య ఉద్యమాలను తట్టుకొని నిలబడిన నేత
  • సీఎంగా ఉండగా జగన్‌, తెలంగాణ కాక
  • ఎంపీగాను ఢిల్లీలో తనదైన ముద్ర


న్యూఢిల్లీ, డిసెంబరు4 (ఆంధ్రజ్యోతి): ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా  ఆయన చెక్కు చెదరలేదు. కాంగ్రెస్‌ అధిష్ఠానంతో ఆయనకున్న అనుబంధం అత్యంత ప్రత్యేకమైనది. 1994-96 మఽధ్య పీసీసీ అధ్యక్షుడిగా, 1998-99లో లోక్‌సభ సభ్యుడిగా, ఏడాదికి పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఆయన కాంగ్రెస్‌ అధినాయకత్వంతో ప్రత్యేక సంబంఽధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సీఎం కావాలన్న జగన్మోహన్‌రెడ్డి ఆకాంక్షను కాంగ్రెస్‌ అధిష్ఠానం మొగ్గలోనే తుంచేసి, రోశయ్యను ముఖ్యమంత్రిని చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పరిణామాలను రోశయ్య ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు. జగన్‌ శిబిరం ఒత్తిడిని.. కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ఉద్యమ వేడిని తట్టుకున్నారు. ఈ రెండు విషయాల్లో కాంగ్రెస్‌ అధిష్ఠానం సూచించిన విధంగా రోశయ్య నడుచుకున్నారు.


డిసెంబరు 9 ప్రకటన రోజు

2009 డిసెంబరు 9న  కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణపై ప్రకటన చేసిన రోజు రోశయ్య ఢిల్లీలో ఉన్నారు. ఆ పర్యటన ప్రత్యేకమైనది. నవంబరులో కేసీఆర్‌ నిరాహార దీక్ష తర్వాత రాజకీయ పరిణామాలు తీవ్రతరం కావడంతో అధిష్ఠానం రోశయ్యను ఢిల్లీకి పిలిపించింది. డిసెంబరు 7న అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. సీపీఎం, మజ్లిస్‌ తప్ప అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం ఆమోదించాలని చెప్పాయి. అదే సందేశాన్ని తీసుకొని ఆయన డిసెంబరు 9న ఢిల్లీకి వచ్చారు. రష్యా పర్యటన నుంచి అప్పుడే తిరిగి వచ్చిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌, హోంమంత్రి చిదంబరం, కాంగ్రెస్‌ ముఖ్యనేత వీరప్ప మొయిలీతో రోశయ్య ఆంతరంగిక చర్చలు సాగించారు. అప్పట్లో మీడియా రోశయ్యను వెంబడించింది. ఆయన ఎవర్ని కలుసుకున్నా క్షణాల్లో తెలుసుకోగలిగేది. డిసెంబరు 9న మధ్యాహ్నం ఆయన చిదంబరంను నార్త్‌ బ్లాక్‌ వెనుక వైపు ద్వారం గుండా వచ్చి కలుసుకున్నారు. ఈ చర్చల తర్వాతే తెలంగాణపై చిదంబరం ప్రకటన సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చిదంబరం ప్రకటన చేసే సమయానికి రోశయ్య హైదరాబాద్‌ చేరిపోయారు. చిదంబరం ప్రకటనతో రాష్ట్రంలో తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది.


ఆంధ్ర ప్రాంత నేతల రాజీనామాల పర్వం మొదలైంది. దీనితో తెలంగాణపై మరింత విస్తృత చర్చలు అవసరమంటూ చిదంబరం డిసెంబరు 23న మరో ప్రకటన చేశారు. దీంతో తెలంగాణ నేతలూ రాజీనామా చేశారు. నవంబరు 2009 నుంచి ఏప్రిల్‌ 2010 వరకు రోశయ్య పాలనలో మొత్తం ఆంధ్రప్రదేశ్‌ అన్ని రకాల ఉద్యమాలతో అట్టుడికి పోయినా ఆయన తట్టుకోగలిగారు. 2010 ఫిబ్రవరిలో జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి 11 సీట్లను గెలుచుకోవడంతో ఆ పార్టీకి మరింత రాజకీయ ఊపు లభించింది. రాష్ట్రంలో జగన్‌ను, తెలంగాణ ఉద్యమాన్ని ఎదుర్కొని,కాంగ్రె్‌సను బలోపేతం చేసేందుకు రోశయ్య బదులు యువకుడైన నేత అవసరమని భావించిన అధిష్ఠానం 2010 నవంబరులో కిరణ్‌ కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించింది. రోశయ్యను 2011 ఆగస్టు 31న తమిళనాడు గవర్నర్‌గా నియమించింది. 


లోక్‌ సభ సభ్యుడిగా

1998లో 12వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నుంచి 22 మంది హేమాహేమీలైన ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు. వారిలో  కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి,  వై.ఎ్‌స.రాజశేఖర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి, జైపాల్‌రెడ్డి, బాగారెడ్డి, నాదెండ్ల భాస్కరరావుతో పాటు కొణిజేటి రోశయ్య కూడా ఉన్నారు. కేవలం 13 నెలల పాటే వాజపేయి ప్రభుత్వం కొనసాగినప్పటికీ ప్రతిపక్షంలో ఏపీ ఎంపీలు కీలక పాత్ర పోషించారు. రోశయ్యకు కాంగ్రెస్‌ అధిష్ఠానం లోక్‌సభలో ప్రభుత్వాన్నెదుర్కొనేందుకు కీలక అవకాశాలను ఇచ్చింది. మాతృభాషపై అమితమైన ప్రేమ ఉన్న రోశయ్య సాధ్యమైనపుడల్లా తెలుగు భాషలో మాట్లాడతానని నోటీసులు ఇచ్చేవారు. 1998 మార్చిలో రైల్వే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ చర్చను ఆయనే ప్రారంభించారు.


న్యాయవ్యవస్థపై విమర్శలు

న్యాయమూర్తుల నియామకానికి జ్యుడీషియల్‌ కమిషన్‌ వేయడమే సరైన మార్గమని రోశయ్య సూచించారు. న్యాయమూర్తుల నియామకాన్ని న్యాయమూర్తులకే వదిలివేయడం సరికాదని 1998 డిసెంబరులో జరిగిన చర్చలో వ్యాఖ్యానించారు. చట్టసభల అధికారాల్లో న్యాయవ్యవస్థ మితిమీరి జోక్యం చేసుకుంటే ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పారు. న్యాయమూర్తులు కోడ్‌ మరచి రిబ్బన్‌ కటింగ్‌లకు, అవార్డు ప్రదానాలకు వెళుతున్నారని దుయ్యబట్టారు. జ్యుడీషియల్‌ కమిషన్‌పై మీడియాతో మాట్లాడినందుకు రోశయ్య అప్పటి పట్టణాభివృద్ధి మంత్రి రాంజెత్మలానీనే సభలో నిలదీశారు. 


చిల్లర ఎందుకు వదలాలి?

సెంట్రల్‌ హాలులో అల్పాహారం సరఫరా చేసే సిబ్బంది ఎంపీల నుంచి బిల్లు డబ్బులు తీసుకున్న తర్వాత మిగతా చిల్లర ఇవ్వరు. ఓసారి రోశయ్య రూ. 500 ఇవ్వగా.. వెయిటర్‌ ఆ డబ్బు తీసుకుని, మళ్లీ కనిపించలేదు. దీంతో.. అప్పటి నుంచి క్యాంటీన్‌ వెళ్లేప్పుడు ఆయన సరిపడా చిల్లరను వెంట తీసుకెళ్లేవారు.


ఢిల్లీ రాజకీయాలు గిట్టవు

ఢిల్లీలో సౌత్‌ బ్లాక్‌ వెనుక కామరాజ్‌ లైన్‌లో రోశయ్యకు బంగళా కేటాయించారు. అయితే, ఏ మాత్రం అవకాశం వ చ్చినా ఆంధ్రప్రదేశ్‌ వెళ్లిపోయేవారు. మీరు ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించవచ్చు కదా అని అడిగితే నాకు రాష్ట్ర రాజకీయాలే ఇష్టం, ఢిల్లీ రాజకీయాలు గిట్టవు.. అని రోశయ్య నవ్వుతూ చెప్పారు. 


రోశయ్య వంటి ఆధునికుడు లేడు: వైఎస్‌ 

రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీ వచ్చినపుడు ఆర్థిక మంత్రిగా ఎవర్ని నియమిస్తారని విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. ఇంకెవరు రోశయ్య ఉన్నారు కదా అని వైఎస్‌ బదులిచ్చారు. ఆర్థిక సంస్కరణలు వేగంగా అమలవుతున్న సమయంలో మీరు కూడా మన్మోహన్‌ సింగ్‌ లాంటి వారిని పెట్టుకోవాలి కదా, రోశయ్య మరీ పాతకాలం మనిషి కాదా అని అడిగితే వైఎస్‌ పెద్దగా నవ్వారు. ‘‘రోశయ్య కంటే ఆధునికుడు ఈ దేశంలోనే లేడు. గ్యాట్‌, ప్రపంచ ఆర్థిక సంస్థ చర్చల గురించిఆయన నాకు ఎంతో వివరించారు. పన్ను సంస్కరణలపై కేంద్ర కమిటీలో రోశయ్య ఎంత కీలక పాత్ర పోషించారో మీకు తెలుసా? చిదంబరం కూడా రోశయ్యను గౌరవిస్తారు’’ అని చెప్పారు. 


లాయర్‌ కావాలనుకున్నా. రాజకీయాల్లోకి వచ్చాక ఆ సంగతి మరిచిపోయాను. పెద్ద పదవులు అధిష్టించాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, పెద్ద వాళ్లతో కలిసి పని చేయాలని ఉండేది. అప్పట్లో శ్రీనగర్‌లో నాటి ప్రధాని నెహ్రూను కొందరు రైతులు కలిశారు. వారికి హిందీ, ఇంగ్లీషు రావు. అప్పుడు అనుకోకుండా నేను నెహ్రూకు దుబాసీలా వ్యవహరించాను. మాది ఆంధ్రా అంటే గుర్తుపట్టలేదు. మదరాసీ అంటేనే నెహ్రూ గుర్తుపట్టారు! - రోశయ్య


సంక్షోభానికి ‘సమాధానం’

అసెంబ్లీలో ప్రభుత్వానికి ఏదైనా గట్టి సంక్షోభం ఎదురైతే... దానికి సానుకూల ‘ముగింపు’ పలికే బాధ్యతను రోశయ్యకే అప్పగించేవారు. మరీ ముఖ్యంగా... వైఎస్‌ హయాంలో రోశయ్య ‘క్రైసిస్‌ మేనేజర్‌’గా వ్యవహరించారు. సంబంధిత శాఖ మంత్రితో కాకుండా... రోశయ్య చేత ప్రకటన ఇప్పించేవారు. ఆ వివాదానికి సంబంధించి... అంటీ అంటనట్లు, నొప్పించక తానొవ్వక, లౌక్యంగా... విపక్షానికి చురకలు వేస్తూనే ఒక ప్రకటన చేసి దానికి అంతటితో ముగింపు పలికేలా చేయడం రోశయ్య స్టైల్‌!


కోపమూ ఎక్కువే..

రోశయ్య సౌమ్యుడు, లౌక్యుడు! అంతేకాదండోయ్‌... ఆయనకు కోపం కూడా ఎక్కువ. కానీ, బాగా అరుదుగా మాత్రమే ఆయన ఆగ్రహం ప్రదర్శిస్తారు. ఆయన ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు విపక్ష నేతల విమర్శలతో విపరీతమైన కోపంతో ఊగిపోయారు. ‘చెయ్యి తీసేస్తా జాగ్రత్త’ అని హెచ్చరించారు. అయితే... రోశయ్య ఎంత ఆగ్రహంతో ఊగిపోయినా, ఆయన పెద్దరికాన్ని దృష్టిలో పెట్టుకుని విపక్షమే వెనక్కి తగ్గేది.  


 చురకలు... చురకత్తులు

రోశయ్య రాజకీయాల్లో పాదరసంలాంటివాడని.. ఎక్కడా, ఎవరికీ చిక్కరని ఒక పేరు!  రోశయ్య మంత్రిగా ఉండగా... ఆయన అల్లుడు పేకాట ఆడుతూ, డ్యాన్సులు చూస్తూ దొరికిపోయారని శాసనసభలో తెలుగుదేశం సభ్యులు ఆరోపణలు చేశారు. దానికి రోశయ్య స్పందిస్తూ.. ‘‘ఏం చేస్తాం అధ్యక్షా! ఆ భగవంతుడు ఎన్టీఆర్‌కు, నాకూ మంచి అల్లుళ్లను ఇవ్వలేదు’’ అని అన్నారు. అంతే... సభలో ఒక్కసారిగా నవ్వులు!

Advertisement
Advertisement