అనుక్షణికంలో ప్రధాన పాత్ర ఒక దశాబ్దం

ABN , First Publish Date - 2021-08-09T06:32:10+05:30 IST

నవల, కథా పక్రియలలో కథాకాలానిది ద్విపాత్రాభినయం- నేపథ్యంగాను, ముఖ్య పాత్రగాను. కేవల నేపథ్యమైనప్పటికీ- మిగిలిన పాత్రలూ, అవి తిరగాడే ఘట్టాలకూ మాత్రమే ఆ కథా కాలం తనను తాను కత్తిరించుకోలేదు...

అనుక్షణికంలో ప్రధాన పాత్ర ఒక దశాబ్దం

నవల, కథా పక్రియలలో కథాకాలానిది ద్విపాత్రాభినయం- నేపథ్యంగాను, ముఖ్య పాత్రగాను. కేవల నేపథ్యమైనప్పటికీ- మిగిలిన పాత్రలూ, అవి తిరగాడే ఘట్టాలకూ మాత్రమే ఆ కథా కాలం తనను తాను కత్తిరించుకోలేదు. కథాకాలానికి ఉన్న ఈ వైశాల్యాన్ని కొందరు రచయితలే గట్టిగా గమనిస్తారన్నది వాస్తవం. కథ కంటే, నవలలో కథా కాలానిది విస్తృతమైన భూమిక. ఇతివృత్తాన్నీ, కథాకాలం నాటి సామాజిక, రాజకీయ, సాహిత్య పరిణామాలనూ సమాంతరంగా చిత్రించే నవల ‘అనుక్షణికం’. ఇతివృత్తాన్ని బలహీనపడనివ్వకుండానే, దృక్పథం మేరకు రచయిత వడ్డెర చండీదాస్‌ ఆ కాలాన్ని బోనులో నిలబెట్టారనొచ్చు. 


చండీదాస్‌ అనగానే ప్రత్యేక శైలి, అక్షర విన్యాసం, కళ్లేలను తెంచుకున్న మనోగతాలు, గాఢమైన తాత్త్వికత స్ఫురణకు వస్తాయి. ‘హిమజ్వాల’(నవల)లో ఒకరకంగా, ‘చీకట్లోంచి చీకట్లోకి’(కథా సంకలనం)లో వేరొకరకంగా ఆయన కనిపిస్తారు. ‘అనుక్షణికం’ వాటికి పూర్తిగా భిన్నం. 


‘అనుక్షణికం’ కథాకాలం 1971-1980, భారత దేశానికి గుణాత్మకమైన మార్పులను సంతరించిపెట్టిన దశాబ్దం. నేపథ్యం- ఉస్మానియా విశ్వవిద్యాలయం. విద్యాలయాల మీద ఆట్టే గౌరవం లేకున్నా, పాఠ్య ప్రణాళిక పరిమితుల లోనే అయినా, రాజనీతిశాస్త్రాన్ని (అంతకుముందు ఆంధ్ర, ఎస్వీ యూనివర్సిటీలలో చరిత్ర, ఫిలాసఫీ చేసి) ఒక అవగాహనతో చదువుతున్న విద్యార్థి శ్రీపతి ఆ మార్పులను గమనించకుండా, విశ్లేషించకుండా ఎలా ఉంటాడు? ‘‘...గత దశాబ్దం కొన్ని లక్షణాలున్న దశాబ్దంగా నాకు అనిపించింది’’ అని రచయితే అంగీకరించారు. ఆ కాలానికి నవలలో వ్యాఖ్యాత శ్రీపతే. హాస్టల్లో, కేంటీన్లో టీలు సేవిస్తూ, అవీ ఇవీ తింటూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, పుస్తకాలు, ఉద్యమాల మీద చర్చలు జరపడం ద్వారా నవల కాన్వాస్‌కి హద్దులు తొలగించారు రచయిత. నవలకు కేంద్ర బిందువు శ్రీపతి. ఈ పాత్రలో భూస్వామిక వ్యవస్థలోని సానుకూల అవశేషాలు, కుటుంబంతో అంటీముట్టనట్టు ఉండే తిరుగుబాటు స్వభావం పోటీపడుతుంటాయి. ఆ విధంగా సీతారామారావు (‘అసమర్థుని జీవితయాత్ర’, గోపీచంద్‌), దయానిధి (‘చివరికి మిగిలేది’, బుచ్చిబాబు) జాడలు--ఆ ఇద్దరిలో ఉండే జ్ఞానతృష్ణతో సహా--ఈ పాత్రలో కనిపిస్తాయి. 


ఆ రెండు పాత్రలు ఆధునిక తెలుగు సాహిత్యానికి కొత్త చూపునిచ్చినవే. ఆ పాత్రల మాదిరే శ్రీపతి పాత్ర చిత్రణ మనోవిశ్లేషణ పునాదిగానే ఉంది. మేధోపరంగా శ్రీపతి ప్రవాహశీలత ఉన్నవాడు. కానీ అదొక లోలక విన్యాసం. ఆ ప్రయాణం మనోవీధుల నుంచి వాస్తవలోకానికి పరిమితం. వాస్తవంలో చాలావాటిని- రైట్‌, లెఫ్ట్‌, విప్లవం, ప్రేమ, జ్ఞానం, నీతి- మిథ్యగానే భావిస్తాడు. కొందరు వ్యక్తులనీ, కొన్ని పరిణామాలనీ తీవ్రంగా నిరసిస్తుంటాడు, నిజానికి జుగుప్సాకరమైన రీతిలో. ఇన్నింటి మధ్య లలితకళలు, మౌన సౌందర్యారాధన అతనిలోని వైచిత్రి. రచనకు బొమ్మబొరుసు రచయితే: ‘‘నా భావాలు ఏ ఒక్క పాత్ర ద్వారానూ వ్యక్తపరచను. నా భావాలు కరిగిపోయి యితివృత్తంలో కలిసిపోతాయి. నా పాత్రలే నా భావాలను వాడుకుంటూ ఉంటారు, సక్రమంగానో, అక్రమంగానో’’ అన్నారు చండీదాస్‌.


837 పేజీల ఈ నవలలో (2005 ప్రచురణ) మొదట నుంచి చివరివరకు తరచు వచ్చేది మార్క్సిజం ప్రస్తావన. మనసులోనే ఆరాధిస్తున్న స్వప్నరాగలీనను కలసి వస్తున్న తనని ఆటపట్టించాలని చూసిన మిత్రబృందం దృష్టి మరల్చడానికి ‘‘మార్క్సిజంలో యికనమిక్‌ డెటర్మినిజం’’ అంటూ తొలిసారి ఆ ప్రస్తావన తెస్తాడు శ్రీపతి. ‘‘ఆ ఇజం నాకేం తెలుసు!’’ అంటాడు గంగారాం, ఎకనమిక్స్‌ విద్యార్థి. మార్క్స్‌ పేరు తెలియకుండా ఆ సబ్జెక్ట్‌లో డిస్టింక్షన్‌ సాధించివాళ్లున్నారని చెబుతాడు. ఇంకొక విద్యార్థి గోవర్ధన్‌ రెడ్డి, ‘‘గంగారం నక్సలైట్‌ కాదు, మంచి విద్యార్థి, దాని గురించి ఆ మోహన్‌ని అడుగు’’ అంటాడు. నిజానికి నక్సలిజం కంటే, విప్లవ రచయితల సంఘం (విరసం) గురించే ఎక్కువగా, అదీ ఘాటుగా, ప్రస్తావించారు రచయిత. మోహన్‌(రెడ్డి), గాయత్రి, వెంకటేశ్‌, విజయ్‌ కుమార్‌ వంటివారు విశ్వవిద్యా లయంలో ఈ భావాలు కలిగినవారు. పార్టీ, సిద్ధాంతం ఏదైనా ఆంధ్ర, తెలంగాణ అంతరాలూ, అభిమానాలూ కూడా కనిపిస్తూ ఉంటాయి. 16వ అధ్యాయం, ‘‘ముల్కీ నిబంధనలకు సుప్రీంకోర్టు సమర్థన’’ అన్న వార్త పేపర్లో చదవడం దగ్గర మొదలవుతుంది. ‘‘అయితే తెలంగాణకు కేటాయించిన ఉద్యోగాలన్నీ ఖాళీయే’’ అంటాడు నిరంజన్‌. అదేంలేదు, మనం ఆంధ్రాస్‌ కంటే ప్రతిభావంతులం అంటాడు ఒకడు. దీనికి శ్రీపతి ఇచ్చే ముగింపు, ‘‘ఇదేదో పీవీ చావుకొచ్చినట్లుంది’’ అని. అసలు మొదటే తెలంగాణను వేరుగా ఉంచవలసింది అంటాడొకడు. అది చెన్నారెడ్డిని అడగాలి అంటాడు ఇంకొకడు. ఆ హాస్టల్లో గోవర్ధన్‌ కాంగ్రెస్‌. రఘురాం, దయానంద భారతి అండ్‌ పార్టీ ఆరెస్సెస్‌, ఇంకా జనసంఘ్‌ బృందం ఒకటి. ఇక వీళ్లతో స్నేహంగా ఉంటూనే చదువుకే పరిమితమైన వాళ్లుంటారు. కానీ ‘విరసం’ మీద చేసిన స్థాయిలో మరే సిద్ధాంతం గురించి శ్రీపతి కటువైన వ్యాఖ్యలకు దిగడు. నవలలో విరసం చిత్రణ-నిజానికి దాడి-వేరే అంశం.


ఆ దశాబ్దానికీ, దేశ సామాజిక రాజకీయ వ్యవస్థలకీ కుదుపు వంటి అత్యవసర పరిస్థితి (1975-77); ఇందిరా గాంధీ, జేపీ, మొరార్జీ, బాబూ జగ్జీవన్‌రామ్‌, రాజ్‌ నారా యణ్‌, వాజ్‌పేయి, చరణ్‌ సింగ్‌, జార్జ్‌ ఫెర్నాండెజ్‌ వంటివారి చుట్టూ తిరిగిన ఆ దశాబ్దపు రాజకీయ పరిణామాలు (పేర్లు సహా), జనతా పార్టీ ఆవిర్భావం, పతనం అనే కీలక పరిణామాలను, కొన్ని సమకాలీన ఘటనలను ఈ నవల ఎలా స్వీకరించిందో గమనిం చడంలోనే అర్థం, పరమార్థం ఉన్నాయి. 

అత్యవసర పరిస్థితి ప్రకటనకు రెండేళ్ల ముందున్న పరిస్థితులను రచయిత పరిచయం చేస్తారు. ఫెర్నాండెజ్‌ రైల్వే సమ్మెతో అది మొదలయింది. హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జేపీ, రాజ్‌ నారాయణ్‌ సభ, గుజరాత్‌లో మొరార్జీ నిరసన, ఇందిర ఎన్నిక చెల్లదంటూ జూన్‌ 12, 1975న అలహాబాద్‌ హైకోర్టులో జేఎంఎల్‌ సిన్హా ఇచ్చిన తీర్పు, పక్షం తరువాత సుప్రీం కోర్టు ఆదేశం, అంతిమంగా అత్యవసర పరిస్థితి ప్రకటన వంటి వాటిని చారిత్రక క్రమంలో ఇస్తారు. మీసా, అరెస్టులు, ఆర్‌ఎస్‌ఎస్‌ సహా ఇరవై సంస్థల నిషేధం- ఇతివృత్తాన్ని గాలికొదిలేసినట్టు కాకుండా, నవలలో వేగం తగ్గకుండా పొల్లు పోకుండా ఇచ్చారు రచయిత. ‘‘యెమర్జెన్సీ ఇనప గంప కింద కోటానుకోట్ల కోళ్లు’’ అనడం, నాటి నిర్బంధం మీద చేసిన నిశిత వ్యాఖ్య. అప్పటికి రాజనీతి శాస్త్రం పూర్తిచేసి, జర్నలిజంలో చేరతాడు శ్రీపతి. ఒక మిత్రుడి వల్ల అనుకోకుండా ఒక పత్రికలో చేరతాడు. మానేస్తాడు కూడా. ఆ సందర్భాన్ని కలిపి ఇలా చెప్పారు రచయిత: ‘‘ఎమర్జెన్సీలో పత్రికలేమిటి, రిపోర్టింగేమిటి. నా మొహం. కలెక్టరో ఆర్డీవోనో కాదంటే తాసిల్దారో చూసి అచ్చువేస్తారు. మనం దేనికి’’ అనుకుంటూ కొలువు మానేశాడు. 1977లో ఇందిర ఎన్నికలు జరిపించింది. 118వ అధ్యాయం 1977 ఎన్నికలలో అక్కడ జనతా ప్రభంజనం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలుపులను విశ్లేషిం చారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ, ఆమె, ‘‘బాలభానుడు’’ (సంజయ్‌ గాంధీ) కూడా ఓడిపోయారు. ప్రధాని పదవి కోసం మొరార్జీ, జగ్జీవన్‌, చరణ్‌ సింగ్‌ జగడం; జేపీ, కృపలానీ సర్దుబాటు చేయడం వంటి ఘటనల వర్ణనలో నిరసనే కనిపిస్తుంది. మొరార్జీ, జగ్జీవన్‌, రాజ్‌ నారాయణ్‌లను నీచమైన భాషతో తిడతాడు శ్రీపతి. జేపీ మరణం, మొరార్జీ ప్రభుత్వం కూలిపోవడం, 


చరణ్‌ సింగ్‌ ప్రధాని కావడం, మళ్లీ ఎన్నికల వరకు పరిణామాలనూ పొందుపరిచారు. ఇదే నవలకు ముగింపు. వాస్తవానికి ఆ దశాబ్దం ఆవిష్కరించబోతున్న భవిష్యత్‌కు ఒక ఆరంభం. కానీ రచయిత దృష్టిలో అదేమీ నవోదయం కాదు. మనుషులే కాదు, కొత్త ఘడియలూ మార్పు లేనివే. 


నాటి రాష్ట్ర రాజకీయాల మీద కూడా విసుర్లు ఉంటాయి. పీవీ, చెన్నారెడ్డి, వెంగళరావు, కాసు బ్రహ్మానందరెడ్డి, వీబీ రాజు, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న; ప్రత్యేక తెలంగాణ, ఆంధ్ర ఉద్యమాలు, రమీజబి, స్కైలాబ్‌ వంటివన్నీ కనీసం ఒక్క వాక్యంలో అయినా ప్రస్తావించారు. రాష్ట్ర రాజకీయ ప్రముఖుల స్వభావాలు, ప్రజలూ, పత్రికలూ ఇచ్చిన బిరుదులు వదిలిపెట్టకుండా రాశారు. వీబీ రాజు, చెన్నారెడ్డిలను ఎన్నికల అక్రమాల కేసులతో వందేమాతరం రామచంద్ర రావు దింపేయడం, బ్రహ్మానందరెడ్డి ‘‘జడ్జీలను మేనేజ్‌ చేశా’’డని, ఇందిరతో చెన్నా ‘‘లాలూచీ’’, ఆంధ్ర వాళ్ల ‘‘హై హేండెడ్నెస్‌’’... ఇలాంటివి విద్యార్థుల బాతాఖానీలలో పొందుపరిచారు రచయిత. నాడు విద్యార్థి లోకాన్ని ప్రభావితం చేసిన రాజకీయ అంశాలను పత్రికల పతాక శీర్షికలను మాత్రం ప్రస్తావించి, రచయిత మెరుపుల్లా మెరిపిస్తూ ఉంటారు. ఉదా: ‘‘ముగిసిన వియత్నాం యుద్ధం - శాంతి ఒప్పందం మీద సంతకాలు’’, ‘‘ఆంధ్రలో ఉద్యమం మహోధృతి’’. ఈ ఉద్యమం బాగోగుల గురించి తరువాత పేజీలలో చర్చించారు. బర్కత్‌పుర విరసం కార్యాలయంలో వినిపించిన మాటలివి: ‘‘ప్రత్యేక రాష్ర్టాన్ని మన శ్రీశ్రీ సమర్థించాడు’’ అన్నాడు విజయ్‌ కుమార్‌. అందుకు గాయత్రి, ‘‘తాగనప్పుడు ఆ మాట అని వుంటారాయన... ఆయన ఏమైనా అనగలరు. ఆ వెంటనే లెంపలేసుకోనూ గలరు. శ్రీశ్రీ ఏమంటున్నాడనేది కాదు. విరసం ఏమంటు న్నదనేదే’’ అంటుంది. అప్పటికే సోవియెట్‌ రష్యా మీద విరసం ఏర్పరుచుకున్న భావన ఎలాంటిదో మోహన్‌ రెడ్డి ద్వారా చెప్పించారు, ‘‘ఇప్పుడు రష్యా కేపటలిస్ట్‌ దేశాలకేం తీసిపోదు’’ అంటాడతడు. సీపీఐని ‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇందిర’ అని ఎద్దేవా చేస్తాడు. జనసంఘ్‌ భావాలు ఏమిటి? దయానంద భారతి ద్వారా పలికించారు ఇలా, ‘‘షేక్‌ అబ్దుల్లాని కాష్మీర్‌కి ముఖ్యమంత్రిని అవనిచ్చిం దంటే- దేశానికి యిందిరమ్మ ముప్పు తెస్తున్నదనడానికి దాఖలా. వాడు పశ్చిమ తూర్పు పాకిస్థాన్లకి తోడు కాష్మీర్‌ని వుత్తర పాకిస్థాన్‌గా వెలయించాలని చూస్తున్నాడు. ముఖ్యమంత్రి కాదట. ప్రధానమంత్రి అట. ప్రధాని పదవి దేశానికా, రాష్ట్రానికా? కాష్మీర్‌ దేశంలోని రాష్ట్రాలలో వొక రాష్ట్రం కాదన్నమాట’’. పరిషత్‌ వాళ్లకి (సంఘ్‌ పరివార్‌ అనే అర్థంలో) ఇంత బలం ఎలా వస్తున్నట్టు అంటూ ప్రశ్న వేయించారు రచయిత. నిజమే, ఎన్నో పరిధులు ఉన్నాయని చెప్పుకునే ఆ పార్టీకి బలం ఎక్కడిది? ఆనాడే రచయిత ఇచ్చిన విశ్లేషణ: ‘‘వూళ్లో సాయిబులు ఎక్కువమంది ఉన్నారుగా- ప్రతిఘటనగా జనసంఘ్‌ కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి... ఆ పైన హైందవత్వాన్ని సెంటిమెంటల్‌ స్థాయిలో ప్రేరేపించి వాడుకోవటం.’’  


కానీ రచయితకున్న ఇంతటి విశాల దృష్టి శ్రీపతి పాత్ర అంతశ్చేతనను నియంత్రించలేదా? ఆర్థికశాస్త్ర విద్యార్థికి మార్క్స్‌ తెలిసి ఉండాలని రచయిత ఊహించినట్టే, ప్రధాన పాత్ర శ్రీపతిలో పాఠకుడూ ఒక ఔన్నత్యాన్ని ఆశిస్తాడు. శ్రీపతి సహా ముఖ్య పాత్రల చిత్రణ అమోఘం. స్వప్న రాగలీన, మోహన్‌ రెడ్డి, అనంత్‌ రెడ్డి, గాయత్రి, తార, వరాహ శాస్త్రి, విజయ కుమార్‌, సీత, కస్తూరి, రవి, గంగి, వేదవతి, సుబ్రహ్మణ్యం, శాంత... ఎన్నో పాత్రలు. ఎన్నో మనసత్తత్వాలు. వయసుకు తగ్గట్టు, పరిసరాలను బట్టి సహజంగా ప్రవర్తిస్తాయి. కానీ శ్రీపతిలోని ఛాయలు, స్థాయి మిగిలిన పాత్రలకు లేవు. మొరార్జీ మూత్రం వివాదం ప్రస్తావిస్తాడు శ్రీపతి. ‘‘మీ వాజ్‌పేయి ఈ వుచ్చ పోటీలో లేడనుకుంటాను’’ అంటాడు. ‘‘ఆయన మూర్ఖుడు కాదు’’ అంటాడు జనసంఘ్‌ కులశేఖరరావు. ఈ విపరీత ధోరణి విద్యార్థి దశకు సహజమే అనుకున్నా, జనతా చేసిన దగాకు ఉగ్ర నిరసన అనుకున్నా మరొక రెండు ఘటనలు రచయిత ధోరణిని ప్రశ్నార్థకం చేస్తాయి. అవి: గాయత్రిని నక్సలైట్‌ ఆరోపణలతో ఆమె పినమామే కుట్ర పన్ని అరెస్టు చేయిస్తాడు. అరెస్ట్‌ వెనుక విరసం సభ్యుడు విజయ్‌ కుమారూ ఉన్నాడు. ఆ సమయంలో ఎస్‌ఐ అత్యాచారం చేయబోతే లాగి కొడుతుంది. ఎస్‌ఐ బూతులు అందుకుంటాడు. ‘‘అవే బూతులు పడకగదిలో సంభోగవేళ పొదుపుగా వాడితే వాటికో రాణింపు వస్తుంది’’ అని వర్ణించడం బాధనే కాదు, జుగుప్సనీ కలిగిస్తుంది. ఇంతకు మించిన అనౌచిత్యం అనిపించే దృశ్యమూ ఉంది. తార గొప్ప అందగత్తె, చదువుకుంది. కుటుంబ పరిస్థితులతో రామారావు అనే చిరుద్యోగిని అనిష్టంగా పెళ్లి చేసుకుంటుంది. ఆ మానసిక, శారీరక అసంతృప్తి విషపూరిత సాలెగూడులోకి నడిపించింది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు చేసిన వర్ణన ఇది: ‘‘తునాతునకలై; బొవికలు పేగులు నెత్తురు కండరాలు చెల్లాచెదురుగా పడ్డాయి- రైలు కట్ట మీదా, కాలువ గట్టునా, బ్రిడ్జి కిందకీ, వాగులోకీ. నీళ్ల మీద వీపు భాగం-స్తనాలు: తేలుతూ మునుగుతూ, నీటి ప్రవాహంలో తార స్తనాల అంతిమయాత్ర’’. స్వప్న రాగలీన వంటి ఒకటి రెండు పాత్రలను మినహాయించి స్త్రీ పాత్రల పరిచయం సందర్భంలో వక్షాలను అమర్యాదకరంగా ప్రస్తావించడం ఈ నవలలో వైరుధ్యం. 


గడచిన ఏ కాలఖండమైనా-చైతన్యం నింపుకున్నదీ, చలనరహితంగా అనిపించేదీ, చరిత్రలో భాగమే. 1970-80 దశాబ్దమనే కాదు, దానికి ముందు, తరువాతి ప్రతి దశాబ్దం చరిత్రకు కొత్త వాక్యాలను చేర్చినవే. కానీ వాటిని సృజనాత్మక రచనలలో నిక్షిప్తం చేసినవారు తక్కువ. సామాజిక, రాజకీయ పరిణామాల నుంచి, ఉద్యమాల ప్రభావం నుంచి, చింతన నుంచి మానవాళి తప్పించుకోలేదు. చరిత్ర నుంచి పలాయనం చిత్తగించ లేదు. అవన్నీ గతంలో క్షణకాల దృశ్యాలే. కానీ అనంత అనుక్షణికాలవి. కొన్ని క్షణాలు ఉంటాయి, అవే కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాయి. ఆ పరిణామాలను రచయితలు యథాతథంగా స్వీకరించకపోవడం నేరం కాకపోవచ్చు. స్వీకరించి, తర్కిస్తే మాత్రం అలాంటి సృజనాత్మక రచనా ధోరణి ఒక వరం. ఒక అవసరం కూడా. చరిత్రకు ఛాయ సాహిత్యం. ‘అనుక్షణికం’ ఆ దశాబ్దానికి అలాంటి ఛాయే.

గోపరాజు నారాయణరావు

Updated Date - 2021-08-09T06:32:10+05:30 IST