వంశ‘దారేదీ’?

ABN , First Publish Date - 2021-06-16T05:10:00+05:30 IST

జిల్లా జీవనాడి వంశధార ప్రధాన కాలువలు, పిల్ల కాలువలు దారుణంగా తయారయ్యాయి. గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. మరోవైపు రైతులు ఖరీఫ్‌ సన్నాహాలు ప్రారంభించారు. వరి ఆకుమడులు సిద్ధం చేసే పనిలో పడ్డారు. కాలువల్లో మాత్రం చుక్క నీరు నిల్వలేని పరిస్థితి. గత రెండేళ్లుగా సరైన నిర్వహణ లేక పూర్తిగా ఆనవాలు కోల్పోతున్నాయి. ముఖ్యంగా ఎడమ ప్రధాన కాలువ పరిస్థితి దయనీయంగా మారింది. హిరమండలం గొట్టా బ్యారేజీ నుంచి వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి వరకూ 107 కిలోమీటర్ల మేర కాలువ విస్తరించి ఉంది. హిరమండలం, జలుమూరు, సారవకో

వంశ‘దారేదీ’?
నరసన్నపేటలో వంశధార ఎడమ ప్రధాన కాలువ దుస్థితి ఇది..




గుర్రపుడెక్కతో నిండుకున్న ప్రధాన కాలువలు

నిర్వహణ లేక పేరుకుపోయిన పూడిక

ముందుకు సాగని నీటి ప్రవాహం

శివారు ఆయకట్టుకు అందని నీరు

షట్టర్లు ధ్వంసం

పిల్ల కాలువలు మరీ దయనీయం

(నరసన్నపేట/ఎల్‌ఎన్‌పేట)

 జిల్లా జీవనాడి వంశధార ప్రధాన కాలువలు, పిల్ల కాలువలు దారుణంగా తయారయ్యాయి. గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. మరోవైపు రైతులు ఖరీఫ్‌ సన్నాహాలు ప్రారంభించారు. వరి ఆకుమడులు సిద్ధం చేసే పనిలో పడ్డారు. కాలువల్లో మాత్రం చుక్క నీరు నిల్వలేని పరిస్థితి. గత రెండేళ్లుగా సరైన నిర్వహణ లేక పూర్తిగా ఆనవాలు కోల్పోతున్నాయి. ముఖ్యంగా ఎడమ ప్రధాన కాలువ పరిస్థితి దయనీయంగా మారింది. హిరమండలం గొట్టా బ్యారేజీ నుంచి వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి వరకూ 107 కిలోమీటర్ల మేర కాలువ విస్తరించి ఉంది. హిరమండలం, జలుమూరు, సారవకోట, పోలాకి, నరసన్నపేట, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని 1,48,000 ఎకరాలకు సాగునీరందిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.  ప్రధాన కాలువకు అనుసంధానంగా పిల్ల కాలువలు ఉన్నాయి. గత రెండేళ్లుగా కాలువ మరమ్మతులకు నోచుకోలేదు. అక్కడక్కడా తాత్కాలిక పనులు చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో ఖరీఫ్‌లో శివారు ఆయకట్టుకు సాగునీరందని దుస్థితి. షట్టర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ‘నీరు-చెట్టు’ పథకంలో భాగంగా మరమ్మతు పనులు చేసేవారు. కానీ రెండేళ్లుగా ఎటువంటి పనులకు నోచుకోలేదు. కనీసం జంగిల్‌  క్లియరెన్స్‌ సైతం చేయలేదు. 


నరసన్నపేట సబ్‌ డివిజన్‌లో..

నరసన్నపేట సబ్‌ డివిజన్‌ పరిధిలోగల నరసన్నపేట, పోలాకి మండలాల్లో 27 వేల ఎకరాలకు ఎడమ ప్రధాన కాలువ ద్వారా సాగునీరందాలి. కానీ కాలువల పరిస్థితి చూస్తే దయనీయంగా ఉన్నాయి.  షట్టర్లు కూడా సక్రమంగా పనిచేయడం లేదు. ఖరీఫ్‌లో కుస్తీలు పట్టాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలాకి మండలం డీఎల్‌పురం, కొడూరు, మగతపాడు, చెల్లాయివలస తదితర ప్రాంతాలకు ఖరీఫ్‌లోఅసలు సాగునీరందడం లేదు. ఒక వైపు కాలువలు లేక..షట్టర్లు ప నిచేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వంశధార అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. 


కుడి ప్రధాన కాలువదీ అదే తీరు..

కుడి ప్రధాన కాలువదీ అదే దుస్థితి. ఏడు మండలాలను సస్యశ్యామలం చేస్తోంది ఈ కాలువ. హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, సరుబుజ్జిలి, బూర్జ,  ఆమదాలవలస, శ్రీకాకుళం రూరల్‌, గార మండలాల పరిధిలో 82 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. కానీ గత కొన్నేళ్లుగా నిర్వహణ లేక కాలువలో గుర్రపు డెక్క, పూడిక పేరుకుపోయింది. అక్కడక్కడా రైతులే శ్రమదానం చేసి తొలగించుకుంటున్నారు. ముఖ్యంగా ఎల్‌ఎన్‌పేట మండలం స్కాట్‌పేట నుంచి సరుబుజ్జిలి మండలం గోనెపాడు వరకూ కాలువ గుర్రపుడెక్కతో నిండిపోయి ఆనవాళ్లు కోల్పోయింది. నీటి ప్రవాహం సరిగ్గా జరగక వర్షాకాలంలో కాలువ గట్లకు గండిపడుతోందని రైతులు చెబుతున్నారు. 




Updated Date - 2021-06-16T05:10:00+05:30 IST