మహేంద్ర తనయకు గుండె కోత

ABN , First Publish Date - 2022-05-15T05:41:49+05:30 IST

సాగునీటి ప్రాజెక్టులు ఆక్రమణదారుల చెరలో చిక్కుకున్నాయి. ఏటా ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతులు పేరిట పనులు చేపడుతున్నా.. ఆక్రమణలను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో నదీ తీర ప్రాంతాల్లో సైతం శివారు భూములకు నీందరక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రధానంగా జిల్లాలో ప్రధాన తాగు, సాగునీటి వనరుల్లో ఒకటైన మహేంద్ర తనయ నది ఆక్రమణల చెరలో చిక్కి శల్యమవుతోంది. కొంతమంది అక్రమార్కులు తీరాన్ని భ క్షిస్తుండడంతో నదీ రూపురేఖలు మారిపోతున్నాయి. మరోవైపు ఇసుకాసురులు యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతుండడంతో.. నదీ ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఫలితంగా భూగర్భజలాలు అడుగంటి.. ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఆక్రమణల చెర నుంచి మహేంద్ర తనయను కాపాడాలని అధికారులను కోరుతున్నారు.

మహేంద్ర తనయకు గుండె కోత
ఆక్రమణలతో చిక్కిశల్యమైన మహేంద్రతనయా నది

యథేచ్ఛగా నదీ తీరం కబ్జా
మారుతున్న ప్రవాహ దిశ
కోతకు గురవుతున్న భూములు
తీవ్రంగా నష్టపోతున్న రైతులు
(హరిపురం/మెళియాపుట్టి)

సాగునీటి ప్రాజెక్టులు ఆక్రమణదారుల చెరలో చిక్కుకున్నాయి. ఏటా ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతులు పేరిట పనులు చేపడుతున్నా.. ఆక్రమణలను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో నదీ తీర ప్రాంతాల్లో సైతం శివారు భూములకు నీందరక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రధానంగా జిల్లాలో ప్రధాన తాగు, సాగునీటి వనరుల్లో ఒకటైన మహేంద్ర తనయ నది ఆక్రమణల చెరలో చిక్కి శల్యమవుతోంది. కొంతమంది అక్రమార్కులు తీరాన్ని భ క్షిస్తుండడంతో నదీ రూపురేఖలు మారిపోతున్నాయి. మరోవైపు ఇసుకాసురులు యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతుండడంతో.. నదీ ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఫలితంగా భూగర్భజలాలు అడుగంటి.. ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఆక్రమణల చెర నుంచి మహేంద్ర తనయను కాపాడాలని అధికారులను కోరుతున్నారు.
....................................
మహేంద్రతనయ నది ఆక్రమణల చెరలో చిక్కుకుంది. మహేంద్ర తనయ.. ఒడిశా రాష్ట్రం తూర్పుకనుముల్లోని మహేంద్రగిరుల్లో పుట్టి.. జిల్లాలో ప్రవహిస్తోంది.  ఈ నది.. జిల్లాలో మందస, సోంపేట, పలాస, మెళియాపుట్టి, పాతపట్నం, ఇచ్ఛాపురం మండలాల్లో ప్రజలకు ప్రధాన సాగు, తాగునీటి వనరు. మహేంద్రతనయ నది మెళియాపుట్టి, పాతపట్నం మండలాల్లో ఒక చానెల్‌ ప్రవహిస్తోంది. దీనిద్వారా.. హిరమండలం గొట్టాబ్యారేజీ వద్ద వంశధార నదిలో కలుస్తోంది. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, మందస మండలాల్లో మరో చానెల్‌ ప్రవహించి.. బారువ వద్ద సముద్రంలో కలుస్తోంది. కాగా నదికి ఇరువైపులా ఆక్రమణలు పెరిగిపోవడంతో.. నీటి ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. నదీ తీరంతో పాటు పంట పొలాలు కోతకు గురవుతున్నాయి. దీంతో నదీ తీర ప్రాంత వాసులు, రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఆక్రమణలివీ..
- మందస మండలంలో సుమారు 24 కిలోమీటర్ల పొడవున ఉన్న మహేంద్రతనయ నదీతీరం అడుగడుగునా ఆక్రమణకు గురైంది. ఓపక్క జీడి, నేరడి, టేకు వంటి తోటలు వేశారు. మరికొన్ని ప్రాంతాల్లో పంటపొలాలుగా, కూరగాయల సాగు భూములుగా కూడా మారుస్తున్నారు.
- మెళియాపుట్టి ప్రాంతంలో మహేంద్రతనయ నది 150 మీటర్ల వెడల్పు ఉండేది. నదికి ఇరువైపులా ఆక్రమణలు పెరిగిపోవడంతో 25 అడుగులకు కుచించుకుపోయింది. దీంతో ఒడిశాలో అధికంగా వర్షాలు కురిస్తే.. నీటి ప్రవాహానికి అవకాశం లేక గట్లకు గండ్లు పడి.. తమ పంటలకు ముంపు సమస్య ఎదురవుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.  
- సోంపేట ప్రాంతంలో 40 కిలోమీటర్లు పొడవునా ప్రవహిస్తోంది.  బాతుపురం, పొత్తంగి, పొత్రఖండ, కొత్తపల్లి, మూలిపాడు, విక్రంపురం, పూడిగాం తదితర ప్రాంతాల్లో  నదికి ఇరువైపులా జీడి, మామిడి, టేకు, అరటి సాగు చేస్తున్నారు.
- మెళియాపుట్టి ప్రాంతంలో చాపర నుంచి హిరమండలం వరకు సుమారు 35 కిలోమీటర్లు పొడవున నది ప్రవాహం ఉంది. ఇక్కడ సైతం నదిని ఆక్రమించి వరితో పాటు ఇతర అంతర పంటలు సాగు చేస్తున్నారు. కొంతమంది పట్టాలు రూపొందించి.. రైతుభరోసా పథకం లబ్ధి పొందుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మెళియాపుట్టి బ్రిడ్జి ప్రాంతంలో స్థలాలను ఆక్రమించి.. విక్రయాలు సాగుతున్నాయి.

తాగునీటిపై ప్రభావం
మహేంద్ర తనయ నది కుచించుకుపోవడంతో తాగునీటి పథకాలపై ప్రభావం పడుతోంది. మందస మండలంలో గౌడుగురంటి, కొత్తపల్లి, శాసనాం గ్రామాలు ముంపుతో పాటు కోత బారిన పడుతున్నాయి. నదిలో అధిక ప్రాంతం కబ్జాకు గురవడంతో చాలా ప్రాంతాల్లో చిన్న పిల్ల కాలువలా తయారైంది. టీ-శాసనం, పొత్రకొండ, గోపాలపురం, అనంతపురం, పొత్తంగి, సిరిపురం, చిన్నకోష్ఠ, పెద్దకోష్ట, చీపి తదితర గ్రామాల వద్ద ఆక్రమణలు అధికంగా ఉన్నాయి. దీంతోపాటు ఇసుక అక్రమ రవాణా జరుగుతుండడంతో భూగర్భ జలాలుకు ముప్పు ఏర్పడింది. నీరు నిల్వ లేక.. నదీ పరివాహక ప్రాంతవాసుల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది.

పొంచి ఉన్న ప్రమాదం..
విచ్చలవిడిగా ఇసుక తరలింపు, తీరం ఆక్రమణలతో రూ.కోట్ల వ్యయంతో నిర్మించి సుమారు 275 గ్రామాలకు తాగునీరు అందిస్తున్న ఉద్దానం ప్రాజెక్టు, రైల్వే మంచినీటి పథకం, 50 గ్రామాలకు తాగునీరు అందిస్తున్న మరో రక్షిత నీటి పథకం, ఇతర చిన్న మంచినీటి పథకాలకు పెనుప్రమాదం పొంచి ఉంది. సాగు నీరందించే మూలపొలం గ్రోయిన్‌ రాళ్లు కొట్టుకుపోయి నదీ తీరం కోతకు గురవుతోంది. పొత్తంగి గ్రోయిన్‌, గౌడుగురంటి గ్రామంలో సైతం ఐదుకుపైగా ఇళ్లు కోతకు గురై కొట్టుకుపోయాయి. దీంతో ఆ గ్రామ ప్రజలు వర్షం పడితే చాలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. ఆక్రమణలు తొలగించాలని నదీ తీరప్రాంత వాసులు కోరుతున్నారు.  

చర్యలు చేపడతాం
‘మహేంద్రతనయ నదీ తీరప్రాంతంలో ఆక్రమణలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. వారి ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగించి.. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామ’ని మందస, మెళియాపుట్టి తహసీల్దార్లు బి.పాపారావు, బి.ప్రసాదరావు తెలిపారు.  

శివారు.. కన్నీరు
ఆక్రమణల చెరలో నీటి ప్రాజెక్టులు
చివరి ఆయకట్టుకు అందని నీరు

(హరిపురం)
పలాస నియోజకవర్గం మందస మండలంలో డబార్సింగి, కళింగదళ్‌, దామోదరసాగర్‌ రిజర్వాయర్‌లతోపాటు సంకుజోడి, నక్కాసాయి, గోపాలసాగరం వంటి పెద్ద చెరువులు, సునాముది, మహేంద్రతనయ నదులు, పలాసలో వరహాల గెడ్డ, లొత్తూరు రిజర్వాయర్లు, వజ్రపుకొత్తూరులో బెండిగెడ్డ, వంశధార ఛానల్స్‌ ప్రధానమైనవి. రెండేళ్లుగా ఈ నీటి వనరులు నిండినా.. సగం ఆయకట్టుకు కూడా నీరందలేదు. రైతులు భూమి శిస్తు చెల్లిస్తున్నా పంట చేతికందని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా నీరువచ్చే కాలవలు అక్రమణల చెరలో చిక్కుకున్నాయి. దీంతో శివారు భూములకు నీరందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రికార్డులల్లో వేలాది ఎకరాల ఆయకట్టు ఉన్నా.. ఆక్రమణల కారణంగా సగానికి కూడా నీరందడం లేదు. మరమ్మతుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలతో విడుదల చేస్తున్నా ఆక్రమణల జోలికి మాత్రం వెళ్లడం లేదు.

నీటితీరువా కడుతున్నా ఫలితం ఏదీ?
సంకుజోడి రిజర్వాయర్‌ నిర్మాణం కలగా మారంది. దీంతోపాటు దామోదరసాగర్‌ కాలువలు నిర్మాణం కాక, ఆక్రమణలు, పూడిక పేరుకుపోయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. దీంతో సగం భూములకు కూడా నీరంద డం లేదు. వేలకు వేలు నీటి తీరువా చెల్లిస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు.
- గేదెల రామకృష్ణ, ఆయకట్టు రైతు, మద్య గ్రామం

ఏటా కాలువల పనులు
రిజర్వాయర్‌లు, ఇతర కాలువల పనులను ఇటు ఉపాధి, అటు జలవనరులశాఖ ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్నాం. ఆక్రమణలను తొలిగించి పనులు పూర్తిస్థాయిలో జరిగితే కాలువలకు, నీటివనరులకు పూర్వవైభవం వస్తుంది. శివారు భూములకు నీరందేలా పనులు చేపడతాం.
- శ్రీనివాసరావు, జేఈ, జలవనరులశాఖ, మందస

Updated Date - 2022-05-15T05:41:49+05:30 IST