రైస్‌మిల్లర్ల మాయాజాలం

ABN , First Publish Date - 2021-11-28T06:03:56+05:30 IST

రైస్‌మిల్లర్ల మాయాజాలంతో ధాన్యం విక్రయాల్లో రైతు లు నష్టపోతున్నారు. తాలు, తేమ, తరుగు పేరుతో మిల్లర్లు ఇష్టారాజ్యంగా ధాన్యం ధర తగ్గించి రైతులను నిలువు దోపి డీ చేస్తున్నారు.

రైస్‌మిల్లర్ల మాయాజాలం
హుజూర్‌నగర్‌లోని రైస్‌మిల్లుల వద్ద దిగుమతి కోసం క్యూలో నిలిపిన ట్రాక్టర్లు

 క్వింటాకు ఐదు కిలోల తరుగు

 తేమ, తాలు పేరుతో ధర తగ్గిస్తున్న వైనం

 ధాన్యం విక్రయాల్లో నష్టపోతున్న రైతులు

 రైస్‌మిల్లర్ల మాయాజాలంతో ధాన్యం విక్రయాల్లో రైతు లు నష్టపోతున్నారు. తాలు, తేమ, తరుగు పేరుతో మిల్లర్లు ఇష్టారాజ్యంగా ధాన్యం ధర తగ్గించి రైతులను నిలువు దోపి డీ చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన పీఏసీఎస్‌, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం విక్రయించినా మిల్లర్లదే రాజ్యం నడుస్తోంది.

- హుజూర్‌నగర్‌

ప్రభుత్వం హుజూర్‌నగర్‌ ప్రాంతంలో ఈ నెల 5న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. హుజూర్‌నగర్‌, వేపలసింగారం, అమరవరం, లింగగిరి, బూరుగడ్డ గ్రామాల్లో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వేపలసింగారంలో రెండు, లక్కవరం, శ్రీనివాసపురం, మాచవరం, లింగగిరి ప్రాంతాల్లో మొత్తం ఆరు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇక్కడికి తెచ్చిన ధాన్యానికి మద్దతు ధర ఎగ్గొట్టడమేగాక, తరుగు తీస్తున్నారు. పట్టణంలో 20 వరకు రైస్‌మిల్లులు ఉన్నా యి. కాగా, కేవలం రెండు మిల్లులు మాత్రమే వానాకాలం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్నాయి.  కాగా, మండలంలోని ఐదు పీఏసీఎ్‌సల ద్వారా ఇప్పటి వరకు 10,550 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఆరు ఐకేపీ కేంద్రాల ద్వారా 9,327 కింటాళ్ల ధాన్యం రైతుల నుంచి సేకరించారు.


కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినా

హుజూర్‌నగర్‌ ప్రాంత రైతులు పీఏసీఎస్‌, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తున్నారు. అయితే ఇక్కడి ధాన్యాన్ని అధికారులు మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ దిగుమతి చేసుకున్న సమయంలో క్వింటాకు కిలోల తరుగు తీస్తున్నారని రైతులు చెబుతున్నారు. తరుగు, తాలు, తేమ, మట్టిపెళ్లల పేరుతో క్వింటా ధాన్యానికి ఐదు నుంచి ఎనిమిది కిలోల వరకు తరుగు తీస్తుండటంతో రైతులు గగ్గోలుపెడుతున్నారు. సహకార సంఘాలు, ఐకేపీలకు విక్రయించిన ధాన్యాన్ని అధికారులు రైతులతోనే మిల్లుల్లో దిగుమతి చేయిస్తుండటంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంటోంది. తేమ పేరుతో తరుగు తీయడాన్ని రైతులు ప్రశ్నిస్తే అసలు ధాన్యం కొనుగోలు చేసేది లేదని, దిక్కున్నచోట చెప్పుకోండని బెదిరింపులకు గురిచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులు కనీసం పర్యవేక్షణ చేయకపోవడంతోనే మిల్లర్ల ఆగడాలు శృతిమించుతున్నాయని రైతులు వాపోతున్నారు. సాగర్‌ ఎడమ కాల్వ పరిధిలోని మొదటిజోన్‌లో 1.12వేల ఎకరాల ఆయకట్టు ఉంది. మొత్తం వరి సాగుకాగా, ఎకరానికి సగటున 30 నుంచి 35 బస్తాల దిగుమతి వచ్చింది. హుజూర్‌నగర్‌ ప్రాంతంలో రైతులు చింట్లు, సాంబమసూరి అధికంగా సాగుచేశారు. కాగా, సన్నరకాలు సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది.


తరుగు తీస్తున్నారని రైతుల ధర్నా

ధాన్యం క్వింటాకు ఐదు కిలోల తరుగు తీస్తుండటంతో ఆగ్రహించిన రైతులు హుజూర్‌నగర్‌లో రెండో రోజు శనివారం సైతం ధర్నా చేశారు. పట్టణంలోని శృతి, లక్ష్మీనర్సింహ రైస్‌ మిల్లులు ధాన్యం కొనుగోలు చేస్తుండగా, తరుగు అధికంగా తీస్తున్నారని మిల్లుల ఎదుట రహదారిపై రైతులు బైఠాయించారు. దీంతో భారీ గా వాహనాలు నిలిచాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, ఐకేపీ, సహకార సంఘాలకు ధాన్యం విక్రయించి మిల్లుల వద్దకు తెస్తే పెద్ద మొత్తంలో తరుగు తీస్తున్నారని ఆరోపించారు. విషయాన్ని మీడియాకు చెబితే దిగుమతి చేసుకునేదిలేదని బెదిరిస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అఽధికారులు ఇటుగా కన్నెత్తి చూడటంలేదని అన్నారు. గిట్టుబాటు ధర కూడా చెల్లించడం లేదని వాపోయారు. కాగా, రైతుల ధర్నాతో మిర్యాలగూడ రోడ్డుపై మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, తహసీల్దార్‌ జయశ్రీ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి తరుగు లేకుండా కొనుగోలు చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ధర్నా విరమించారు. అనంతరం ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్ధీకరించారు. కార్యక్రమంలో రైతులు ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసు, వెంకన్న, రాము, గోపయ్య, వీరయ్య, సోమయ్య, రంగయ్య, వెంకటేశ్వర్లు, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


కొనుగోళ్లలో  పేచీ పెడితే చర్యలు 

 రైతులు తెచ్చిన ధాన్యంలో తేమ ఉం దని,తరుగు పేరుతో పేచీ పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సహకార అధికారి శ్రీధర్‌ హెచ్చరించారు. బూరుగడ్డలోని పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం  సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర చెల్లించాలని సూచించారు. కొనుగోళ్లను సొసైటీ అధికారులు పర్యవేక్షించకుంటే సహించేదిలేదన్నారు. అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. రైతులను ఇబ్బందులకుగురిచేసే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు దొంగరి వెంకటేశ్వర్లు, సీఈవో కీర్తి వెంకటేశ్వర్లు, అధికారులు అంజయ్య, శ్రీను, నాగయ్య, తదితరులు పాల్గొన్నారు. 


ఐదు కిలోల చొప్పున తరుగు తీశారు: గువ్వల ఆంజనేయులు, బూరుగడ్డ, రైతు 

హుజూర్‌నగర్‌ రైస్‌మిల్లుల్లో ధాన్యం విక్రయించా. క్వింటాకు ఐదు కిలోల చొప్పున తరుగు తీశారు. మిల్లుల్లో తీసిన తేమ శాతానికి, బయట తీసిన తేమ శాతానికి తేడా ఉంది. బయట 14 నుంచి 15 శాతం తేమ ఉంటే, మిల్లుల్లో 20శాతం తేమ చూపిస్తున్నారు. క్వింటాకు ఐదు కిలోల చొప్పున తరుగు తీస్తే ఎంతో నష్టపోతున్నాం.


Updated Date - 2021-11-28T06:03:56+05:30 IST